8, జూన్ 2022, బుధవారం

నవగ్రహాలలో

 నవగ్రహాలలో ఆర్యమన్, రూఢ, సావిత్రి, విష్ణు అనే పేర్లు ఎవరివి ?

.........................................................

హిందూదేవాలయాలలో ఉపదేవాలయాలు వుంటాయి. అంటే ప్రధానగుడి ప్రక్కన మరో గుడి లేదా గుడులు వుంటాయి. భైరవ, లక్ష్మీ, పార్వతి, కుమారస్వామి, గణేశ, హనుమ దేవాలయాలు ఉండవచ్చు. గుడిలో వెలసిన నవగ్రహాలను కూడా ఉపదేవాలయమనే అంటారు. ఖగోళ,జ్యోతిష్య శాస్త్రాలకు నవగ్రహాలే మూలము.


నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్యారాధన హిందూదేశములో వేదకాలము నుండే వుంది. ఉత్తరదేశములో 'మాగాల' నే జాతి ప్రజలు సూర్యుడిని తప్ప ఇతర దేవతలను పూజింపరు. సూర్యుడి కోసమే ప్రత్యేకంగా నిర్మించిన దేవాలయాలను ఆదిత్యగృహాలంటారు. దక్షిణ హిందూదేశములో తమిళనాడులోని తిరువాడమరదూర్ గ్రామంలో ప్రాచీన సూర్య దేవాలయముంది. ఈ ఆలయంలో సూర్యుడు ప్రధానదేవత కాగా మిగిలిన ఎనిమిది గ్రహాలకు చుట్టూ ప్రత్యేక దేవాలయాలున్నాయి. కుళోత్తుంగచోళ చక్రవర్తి కట్టించిన ఈ గుడికి మార్తాండ దేవాలయమని పేరు.


ఆంధ్రదేశములో చిత్తూరు జిల్లాలోని గుడిమల్లములో పురాతన మార్తాండ శిల్పముంది. శ్రీకాకుళము జిల్లా అరసవిల్లి కూడా పురాతన సూర్యదేవాలయముంది. 7 వ శతాబ్దములో కళింగాధిపతి దేవేంద్రవర్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తున్నారు. 17 వ శతాబ్దములో షేర్ మహ్మద్ ఖాన్ ఈ దేవాలయాన్ని పాడుచేసి, పాడుచేసినట్లుగా శాసనము కూడా వేయించాడు. తరువాతి కాలములో అరసవిల్లి సూర్యనారాయణ దేవాలము పునరుద్దరించబడింది. ఒడిషాలోని కోణార్క సూర్య దేవాలయము జగద్విఖ్యాతి గాంచిన పురాతన దేవాలయము.


ఆగమశాస్త్ర ప్రకారము నవగ్రహా విగ్రహాలలో సూర్యవిగ్రహం  పశ్చిమ ముఖముతో మధ్యలో వుంటుంది. సూర్యుడు ఎరుపురంగులో వుండి,ఎర్రని పూలచే అలంకరించబడి అందమైన వస్త్రాలు ధరించి రథముపై స్థానకభంగిమలో (నిలుచున్న భంగిమ ) వుంటాడు. రెండు చేతులలోనూ పద్మాలుంటాయి. సూర్య భగవానుడు క్షత్రియ వంశానికి చెందిన కశ్యపుని సంతానమని పురాణాలు తెలియ చేస్తున్నాయి. ఇతను కళింగాధిపతి, సూర్యభగవానుడి లాంఛనము సింహము.


సూర్యునికి ఇరువైపులా దండ పింగళ అనే పేర్లుగల సేవకులుంటారు. యమ, రేవంతులు సూర్యుని కుమారులు. రజని, ఛాయ, సువర్చల, స్వర్ణ అనేవారు ఇతని భార్యలని కొన్ని పురాణాలలో వుంది. సూర్యుడికి గల పన్రెండు రూపాలను ద్వాదశ ఆదిత్యరూపాలని అంటారు. అవేమంటే (1) ధాత్రి (2) మిత్ర (3) ఆర్యమన్ (4) రూఢ (5) వరుణ (6) సూర్య (7) భాగ (8) విష్ణు (9) సావిత్రి (10) వివష్వన (11) పుషాణ (12) త్వాష్త్రీ.


*నేను సేకరించిన వ్రాసిన ఆర్టికల్స్ ను కొందరు కొన్నింటిని నా పేరు తీసేసి, వారి పేరుమీదుగా ప్రచారము చేసుకొంటున్నారు, విచిత్రమేమిటంటే ఇలా వారి పేరున వ్రాసుకొన్నవి కొన్నాళ్ళకు నాకే రావడము.* *మరికొందరు ఎందుకో నా పేరు తొలగించి వాట్సాఫ్, ఫేస్ బుక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. కొందరు నా ప్రస్తావన లేకుండా నేను వ్రాసిందేదో యాథాతథంగా యూట్యూబ్ లలో తమదే అన్నట్లుగా చదివేస్తున్నారు. ఎవరు ఎలాగైనా ప్రచారము సర్క్యూ లేషన్ చేసుకోండి కాని నా పేరు మాత్రం తొలగించవద్దని మనవి.*


/స్వస్తి /

.............................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురము.

కామెంట్‌లు లేవు: