8, జూన్ 2022, బుధవారం

ఎన్ని చూశారు

 ఎన్ని చూశారు, ఎన్నింటిని  విన్నారు,ఎన్ని ధరించారు ?

..........................................................


(1) కుప్పెలు (2) రాగడిబిళ్ళ (3) కుంకుమరేఖ  (4) పాపటబొట్టు (5) కమ్మలు (6) బావిలీలు (7) సూసకము (8) చంద్రవంక , సూర్యవంక (9) కెంపురవ్వల పల్లెరు పూవు 


(10) బుగడలు (11) కుచ్చులు (12) నానుతీగ (13) మెడనూలు (14) కుతికంట్లు (15) సరిపెణలు (16) గుండ్లపేరు (17) సరిగె (18) ముక్కెర (19) బన్నసరము (20) ఉత్తాండాలు.


(21) కంకణాలు (22) తట్లు కడియాలు (21) సందిదండలు (22) ఒడ్డాణము (23) ముద్రికలు (24) హంసకాలు (25) మ్రోయుగజ్జెలు (26) బొబ్బిలికాయలు (27) గిలుకు మెట్టెలు.


అయ్యలరాజు నారాయణకవి 1800 - 1850 నాటికాలము వాడు. హంసవింశతి గ్రంథాన్ని వ్రాశాడు. అందులో నాటి సామాజిక స్థితిగతులను చక్కగా వర్ణించాడు. హంసవింశతి శృంగారనీతి కావ్యము.


చిత్రభోగుడనే రాజపాలనలో విష్ణుదాసుడనే సాతాని* హేమావతులు భార్యభర్తలు. హేమావతి అందగత్తె. విష్ణుదాసుడు దూరదేశము వెళుతూ, తను పెంచుకొన్న హంసకు ఇంటిని, ఇల్లాలును జాగ్రత్తగా చూచుకోమని చెప్పి వెళతాడు. రాజైన చిత్రభోగుడు హేమావతి అందాన్ని వలచి హేల అనే పరిచారికను దూతగా హేమావతి దగ్గరకు పంపుతాడు. రాజు గుణగణాలను ఐశ్వర్యాలను హేల పొగిడి చివరకు హేమావతిని ఒప్పిస్తుంది. ఒకరోజు హేమావతి అలంకరించుకొని రాజవాసానికి వెళుతున్న సందర్భంలో హంస ఆపి, పరపురుష పొందు ఎంతతప్పో తెలియచేస్తూ రాత్రి తొలిజాము నుండి తెల్లవారే వరకు నీతికథ చెబుతుంది. తెల్లవారిన తరువాత హేమావతి తన ప్రయత్నాన్ని విరమించుకొంటుంది. ఇలా ఇరవై రాత్రులు గడిచిన తరువాత హేమావతి, చిత్రభోగులు  తామెంతటి తప్పు చేయాలని భావించారో తెలుసుకొని బాధపడతారు. ఈలోగా దూరదేశ పర్యటనను ముగించుకొని విష్ణుదాసుడు రావడముతో కథలు సుఖాంతమైతాయి.


పైన పేర్కొన్న ఆభరణాలన్ని హేమావతి, ఇంకా నాటి సమాజములోని స్త్రీలు ధరించినవే. హంసవింశతి కావ్యరచన 1850 నాటిది కాబట్టి మన తెలుగు ఆడపడచులు 150 సంవత్సరాల కిందట ధరించి మురిసినవే ఈ ఆభరణాలు.


నేటి తరానికి పై తెలిపిన ఆభరణాలలో ఎన్ని తెలుసని ప్రశ్నించుకొంటే  మూడో నాలుగో తెలుసనే సమాధానము వస్తుంది. నేటి  పిల్లలు పూర్తిగా పాశ్చత్య నాగరికతకు లోనైనారని చెప్పకతప్పదు. అవగింజంత బొట్టును ధరిస్తున్నారు, కొందరు పిల్లలు అది కూడా భారమని మానేస్తున్నారు. మట్టిగాజులే కాదు ఏ గాజులు కూడా కొందరు అసలు వేసుకోవడము లేదు. లంగాఓణీలు నాలుగు దశాబ్దాల కిందటనే అంతరించాయి. చీరకట్టు తెలియదు. రాబోయే యాభైసంవత్సరాల కాలంలో చీరకట్టు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది.


దీనికంతటికి కారణము సమాజము కాదు, ప్రధానదోషులు తల్లిదండ్రులే, ఫ్యాషన్ల పేరుతో అమాయకులైన పిల్లలు ఏది కావాలంటే దానిని కొనిస్తూ అతిగారాబము చేస్తూ వారసత్వ సంపదలను సంస్కృతులను చెడగొడుతున్నారు. ఈ దుస్సంప్రాదాయానికి పిల్లలు కాదు తల్లిదండ్రులే కారణము, వారే మారాలి. ఈ మాటన్నందుకు నన్ను ఎందరు విమర్శించినా నిర్ణయము మార్చుకోను.


చైన్ అనే చీనా పదము నుండి చైనాలనే పదము వచ్చింది. కాలి గొలుసులకే కాలిచైనాలని కూడా అంటారు. ఆంగ్లములో చైన్ అన్నా గొలుసు అనే కదా అర్థము.


(*) సాతానులు - శ్రీవైష్ణవ భక్తులు, వైష్ణవ పూజారులు. బెంగాలులో వైష్ణవాన్ని ప్రచారము చేసిన శ్రీచైతన్యుని అనుయాయులు. ఆంధ్రదేశములో శ్రీరామానుజాచార్యుల శిష్యులు. చాత్తాడ శ్రీవైష్ణవులని కూడా వీరిని అంటారు.

................................................... జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురము.

కామెంట్‌లు లేవు: