18, మార్చి 2024, సోమవారం

పరమేశ్వర స్వరూపంగా

 🙏 కాలాన్ని పరమేశ్వర స్వరూపంగా ఉపాసిస్తాం మనం.🙏


 మహాకాళీ, మహాకాల వంటి నామాలు కాల శక్తిని తెలియజేసే శబ్దాలు.


 పురాణాల్లో ఒక కథ కనిపిస్తుంది 


ఒకసారి బ్రహ్మ, విష్ణువు వారిలో ఎవరు అధికులు అనే వాదన పెరిగి, యుద్ధానికి సన్నద్ధులయ్యారు. వారిరువురూ పరస్పరం ప్రయోగించుకునే తీవ్రాస్త్రాల వల్ల అకాల ప్రళయం, బీభత్స పరిస్థితీ ఎదురయ్యేసరికి దేవతలంతా మహాదేవుడైన సదాశివుని శరణు వేడారు.


శివుడు వారిరువురి నడుమ మహాగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు. ఆ తేజోమయాగ్నికి తుది మొదళ్ళు తెలియలేదు. దానితో హరి బ్రహ్మలు ఇరువురూ ఒకరు తుదినీ, ఒకరు మూలాన్నీ తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఎవరు తమ ప్రయత్నంలో సఫలీకృతులౌతారో వారే అధికులని ఒప్పుకోవాలని ఒప్పందం పెట్టుకొని తమ యత్నాలనారంభించారు.


ఇరువురూ కూడా ఆ తేజోమయలింగానికి ఆద్యంతాలు తెలుసుకోలేక పోయారు.


 బ్రహ్మ ఒక మొగలిపువ్వు సాక్ష్యంతో అసత్యమాడి తాను తుదిని తెలుసుకున్నానని ప్రకటించాడు. కానీ సర్వసాక్షి అయిన సర్వేశ్వరుడు బ్రహ్మ అసత్యానికి ఆగ్రహించి పూజార్హత లేకుండా శపించి శిక్షించాడు.


అసత్యానికి ఎన్నడూ పూజార్హత ఉండరాదని విశ్వ శాసనం.


ఈ కథలో అనేక సంకేతాలున్నాయి. ముగ్గురిలో ఎవరు ఎక్కువో తేల్చుకొనడం ఈ కథలో ప్రధానోద్దేశం కాదు. కాలస్వరూపాన్ని అవగతం చేయడమే దీని ఆంతర్యం.


 నిజానికి పరమేశ్వర చైతన్యం సృష్టి-స్థితి-లయాలలో మూడుగా వ్యక్తమవుతుంది. అదే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపం. ఈ మూడూ ఏక ఈశ్వర చైతన్య స్వరూపాలే. ఈ ప్రాథమిక అవగాహన ఎప్పుడూ ఉండాలి.   


కాలాగ్ని స్తంభరూపుడైన పరమశివునికి తుది మొదళ్ళు తెలుసుకొనడానికి ప్రయత్నించడంలో బ్రహ్మ హంసరూపాన్నీ, విష్ణువు వరాహరూపాన్నీ ధరించారని కథ.


 వరాహం తవ్వుకుంటూ వెళుతుంది. హంస ఎగురుతూ విహరిస్తుంది•.


 ఈ రెండూ మన బుద్ధికున్న ప్రజ్ఞా స్థాయీ విశేషాలు. మనం గతాన్ని ‘తవ్వుకుంటూ’ వెళతాం. జ్ఞాపకాలుగా గత ఘటనల్ని తెచ్చుకుంటూ, కాలపు మొదళ్ల ఆనవాళ్ళను అందుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ, వాటి 'ఆది' మనకు చిక్కదు. గతం అనంతం. మనం వెళ్ళగలిగినంత వెళ్లినా దాని ఆదిని అందుకోలేం. ఈ తవ్వుకుంటూ వెళ్ళే లక్షణానికి వరాహం సంకేతం.


 అలాగే, భవిష్యత్తు కూడా అనంతం.


 ఇప్పటి వర్తమానపు బిందువుపై నిలబడి నేటిని విశ్లేషిస్తూ భవితను అంచనా వేస్తాం. కానీ మన అంచనాలకీ, ఊహలకీ కూడా అందనిదే భావికాలం. ఊహల రెక్కలతో భవిష్యత్తు వైపు ఎగిరే ఆలోచనలకు సంకేతమే హంస.


ఎప్పుడు మొదలయ్యిందీ, ఎప్పుడు పూర్తవుతుందీ ఎక్కడివరకు విస్తరించిందీ... అనేవి అంతుచిక్కని శాశ్వత ప్రశ్నలు. అనంత విశ్వం, అనంత కాలం... వీటిలో బిందువు వంటి మన ఉనికీ, మనికీ వాటి అంతునీ, ఆదినీ ఆవిష్కరించడం అసాధ్యం.


కాలాన్ని ఒక అనంత శక్తిగా అవగతం చేసుకొనడమే మన కర్తవ్యం. కాలంలో ఎన్నో మేధస్సులు, ఎన్నెన్నో ఆచరణలు, ఇంకెన్నో ఆవిష్కరణలు పెరిగిపోయాయి. ఎన్నింటినో కబళించిన భీషణ స్వరూపం కాలంలో గోచరిస్తుంది.


 ఆ భీషణత్వంలో దైవీయమైన శక్తి ఉంది. దానిని జగన్మాతగా దర్శిస్తే అందులోనూ కారుణ్యం గోచరిస్తుంది♪. ఈ తత్త్వాన్నే 'కాళీ' శక్తిగా మనం ఆరాధిస్తున్నాం. ఈ దైవీ లక్షణాన్ని అయ్యగా పిలిస్తే - మహాకాలుడు, కాలాగ్ని రుద్రుడు.


 ఈ అనంత కాలశక్తిని కరాళనృత్యాన్ని ఆపి, కళామయశాంత చైతన్యాన్ని ప్రదర్శించమని ప్రార్థించడమే మనం చేయగలిగేది.


 కాలరూపంగానున్న ఈశ్వర చైతన్యం ప్రతికూలతను విడచి, అనుకూల ప్రసన్నతను ప్రత్యక్షం చేయవలసిందిగా ప్రార్థిస్తూ -

కామెంట్‌లు లేవు: