మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి లీలలు..
*ప్రదక్షిణాలూ..ప్రయోజకత్వమూ..*
అప్పుడే బస్సు దిగి వచ్చారా దంపతులు..ఇద్దరూ దాదాపు 45ఏళ్ళ వయసు పైబడిన వారే..వారి వెనకాలే ఓ ఇరవై, ఇరవైరెండేళ్ల యువకుడు..చూడగానే వాళ్ళ కుమారుడు అని తెలిసిపోతోంది..నేరుగా శ్రీ స్వామివారి మందిరం లోకి వచ్చి, మండపం లో నిలబడ్డారు..మండపం లోనుంచే, శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..
"అయ్యా!..ఇక్కడ ఉండటానికి వసతి దొరుకుతుందా?..మేము కొన్నాళ్ళు శ్రీ స్వామివారి వద్ద ఉండాలని వచ్చాము.." అని ఆలయ సిబ్బందిని అడిగారు..ఆ దంపతులది కందుకూరు ప్రక్కన శాఖవరం అనే ఓ చిన్న పల్లెటూరు..ఆ యువకుడు వాళ్ళ కుమారుడే..చక్కని రూపం..మంచి ఒడ్డూ పొడుగూ.. చూడగానే ఆకట్టుకునే రూపం..వాళ్ళ వివరాలు అన్నీ సేకరించుకొని..వాళ్ళు ఉండటానికి ఒక గది కేటాయించారు..
ఇక వివరాలలోకి వెళితే..ఆ దంపతులకు వచ్చిన సమస్య కుమారుడితోనే..చక్కగా చదువుకున్నాడు..డిగ్రీ మంచి మార్కులతోనే పాసయ్యాడు..వినయానికి విధేయతకు మారు పేరు లాగా ప్రవర్తన ఉండేది..ఈ దంపతులూ అబ్బాయిని చూసి మురిసిపోయేవారు..మరి ఉన్నట్టుండి ఏమైందో తెలీదు..అబ్బాయి ప్రవర్తన మారిపోయింది..చిన్నపిల్లాడిలా మనస్తత్వం ఏర్పడింది..తనలో తానే నవ్వుకోవడం..మాట్లాడుకోవడం..చేయసాగాడు.. చదువు పూర్తిగా మానేశాడు..ఒక్కొక్కసారి మరీ పసి పిల్లాడిలాగా ఏడవడం చేయసాగాడు..చూసే వాళ్లకు కూడా గుండె తరుక్కు పోయేది..పాపం ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు..డాక్టర్ల వద్దకు పరుగెత్తారు..ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యా లేదు..ఏ టెస్టుకూ అంతుపట్టడం లేదు.. శారీరికంగా పుష్టిగా వున్నాడు..ఈ మానసిక రోగాన్ని నయం చేయడం ఎలానో తెలియడం లేదు..ఇద్దరు ముగ్గురు సైక్రియాటిస్ట్ లకు కూడా చూపారు..వాళ్ళు చెప్పిన సలహాలూ పాటించారు..ఏమీ మార్పు లేదు..రోజులు కాస్తా నెలల్లోకి..నెలలు సంవత్సరాల్లోకి మార్పు చెందాయి కానీ..తమ కుమారుడు మాత్రం ఏ మార్పు లేకుండా..మానసిక రోగంతో మిగిలిపోయాడు..
వైద్యులు వల్ల నయం కానీ జబ్బు వచ్చినప్పుడే..సహజంగా దైవం గుర్తుకువస్తాడు మానవులకు..అదే జరిగింది ఆ దంపతుల విషయం లోకూడా.."మీరు కొన్నాళ్ల పాటు మీ బిడ్డను తీసుకొని..మొగలిచెర్ల గ్రామం లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వద్ద వుండకూడదూ..ఆ స్వామి ని నమ్ముకుంటే ఫలితం ఉంటుంది.." అని ఎవరో సలహా ఇచ్చారు..ఎందుకనో ఆ తండ్రి మనసులో ఆ మాట నాటుకు పోయింది..భార్యతో తాను విన్న సలహా గురించి చెప్పాడు..ఆవిడ కూడా ఈ ప్రయత్నం చేద్దామని అన్నది..అదిగో..ఆరకంగా నిశ్చయం చేసుకొని..తమ కుమారుడితో సహా మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి చేరారు..
మొగలిచెర్ల చేరారు కానీ..ఇక్కడకూడా వెంటనే ఫలితం కనబడలేదు..ప్రతిరోజూ రెండుపూటలా శ్రీ స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు కుమారుడిని వెంట బెట్టుకుని చేశారు..సుమారు మూడు నెలల తరువాత మాత్రమే ఆ యువకుడి ప్రవర్తన లో కొద్దిపాటి మార్పు కనబడింది..అలా మొదలై.. మరో మూడు నెలలు గడిచేసరికి..ఆ యువకుడు పూర్తిగా మనిషిలా మారాడు..వివేకవంతుడయ్యాడు..మొత్తం ఆరు నెలల పాటు శ్రీ స్వామివారి సన్నిధిలో ఆ దంపతులు చేసిన ప్రార్ధన ఫలితాన్ని ఇచ్చింది..తనలో వచ్చిన మార్పు శ్రీ దత్తాత్రేయుడి కరుణా కటాక్షణాల వల్లే సాధ్యమైందని ఆ యువకుడూ పూర్తిగా నమ్మాడు..తమ కుమారుడు పూర్వస్థితికి వచ్చేసాడన్న ఆనందంతో..శ్రీ స్వామివారి సమాధి వద్ద సాగిలబడి ప్రణామం చేసుకున్నారు..ముగ్గురూ సంతోషంగా తమ ఊరికి వెళ్లారు..
విజయేంద్ర వర్మ గా పిలువబడే ఆ యువకుడు ఇప్పుడో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. చక్కగా ఉద్యోగం చేస్తూ వున్నాడు..శ్రీ స్వామివారికి పరమ భక్తుడు..అతని తల్లిదండ్రులు ప్రస్తుతం కందుకూరు లో వుంటున్నారు..అప్పుడప్పుడూ శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వస్తూ ఉంటాడు..శ్రీ స్వామివారి దర్శనం అయిన తరువాత ఆలయ సిబ్బందిని పేరు పేరు నా చక్కగా పలకరించుకొని వెళుతుంటాడు..
సర్వం..
శ్రీ దత్తకృప!.
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా.. పిన్: 523114..సెల్..94402 66380& 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి