9, సెప్టెంబర్ 2023, శనివారం

పిల్లల మఱ్ఱివారి శృంగార శాకుంతలము!




పిల్లల మఱ్ఱివారి శృంగార శాకుంతలము!


తెనుగు సాహిత్యం ఒక మహా సాగరం. అందులో యెన్ని అపురూపమైన రత్నాలున్నాయో? ఆరత్నాలే మనకవులు. వారిచ్చిన కావ్యాలు వెలగొనలేనివి. అట్టి మహాృకవులలో ' పిల్లల మఱ్ఱి పినవీరభద్రుడు బహుధా గణనీయుడు. ప్రతిభా వ్యుత్పత్తులు రెండును సమేళణ నములై యితని కవిత్వానికి వన్నెలుదిద్దాయి. పిల్లల మఱ్ఱివారి శృంగార శాకుంతలము. యితని ప్రతిభకు ప్రతీక! అందులోఞయెన్ని మెరుపులో, యెన్నితళుకులో,

.

దుష్యంతుడు వేటకోసం అడవికి వచ్చాడు. డస్సి, ఆయలుపుఁదీర్చుకొనుటకు కణ్వాశ్రమానికి వచ్చాడు. ఆయాశ్రమ ప్రాంతంలోని ప్రకృతికి పరవసిస్తూ , అడుగులు ముందుకు సారించాడు. ఇంతలో బాలపాదపాల దాహార్తిదీరుస్తూ, నీటికడవ నెత్తుకొనివచ్చు కన్యను గాంచాడు. అంతే మతిపోయింది ఆపిల్ల అందానికి. దివ్యాదివ్యసౌందర్య దర్శనం ప్రదర్శనచేసే ఆమెసౌందర్యం ఆరాజుకు విభ్రమ దాయకమైనది. 

ఆమె సౌందర్య వీక్షాదక్షమైన చక్షుః ప్రీతివలన యిలా అనుకుంటున్నాడు. 

దుష్యంతుని భావనకు ముకురాయమానమైన యీపద్యాన్ని చిత్తగించండి!

.

సీ: సురకన్య కాఁబోలు; సురకన్య యయ్యెనే 

ఠీవిమై రెప్పలాడించు టెట్లు?

పుత్తడి కాఁబోలు, పుత్తడి యయ్యనే 

హంసీ గతుల నడయాడుటెట్లు?

వనలక్ష్మి కాఁబోలు, వనలక్ష్మి యయ్యెనే? 

కటి వల్కలంబులు గట్టు టెట్లు?

రతిదేవి కాఁబోలు , రతియయ్యెనే 

వలరాజు నెడబాసి వచ్చు టెట్లు?

కన్నుగవ యార్చుటను సురకన్య కాదు; 

నడి యాడెడుఁ గానఁ బుత్తడియు గాదు; 

లలిఁ దపశ్చిహ్నమున వనలక్ష్మి కాదు; 

ప్రసవశర ముక్తైనది రతియుఁ గాదు;

.

దుష్యంతుడు ప్ర ప్రధమంగా శకుంతలను కణ్వాశ్రమంలో చూచాడు. ఆమెయెవరో తెలియదు. కణ్వుడా వయోవృధ్ధుడు. పైగా బ్రహ్మచారి. ఆయనకు కూతురెలాఉంటుంది? అదీ అనుమానం. మరి యెవరైయుంటుంది? పరపరి విధాలమనస్సు ఆలోచన చేస్తోంది.నిర్ధారణజరిగేదాకా మనః పరిభ్రమణంతప్పదుగదా! అదేయీపద్యంలో ని చిత్రణ!

.

ఫలానా కావొచ్చు అనుకోవటం, ఆలక్షణంలేదుకాబట్టి కాదనుకోవటం. అనేది , పృధక్కరణ! యిదోకావ్య కళాశిల్పం. ఆశిల్పమే అనల్పంగా యీ పద్యంలోకనిపించే విశేషం!

దేవతలేమో అనిమిషులు, మరి యీపిల్లను చూతామా రెప్పలాడిస్తోంది. కాబట్టి దేవకన్యకాదు. పోనీ బంగారం అందామా అది చలనంలేని లోహం. కానీ యీమెనడుస్తోంది. 

కాబట్టి పుత్తడి యనటానికీ వీలులేదు. పోనీ వనలక్ష్మియనుకుందామా? వస్త్ర ధారణ చేసినది కదా! కాబట్టి వనలక్మీ యనలేము. రతీదేవిృయని యనుకుందామా? పక్కన మనమధుడు లేడు. కాబట్టి అదీ కుదరదు. కానీ యిక్కడ కవియిక్కడ మన్మధుడు లేని రతిగా నామెను చెప్పుటచే, సమీప భవిష్యత్తులో ఆనాయకుని స్థానం మనం పూరించ వచ్చునులేయని దుష్యంతుని యభిప్రాయమైనట్లుగా ధ్వని. యిదండీ పిల్లల మఱ్ఱివారు చేసిన గారడీ!

కామెంట్‌లు లేవు: