*కార్తికమాసంలో నెలరోజులూ దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి?*
నిత్యం తులసికోట వద్ద, పూజగదిలో దీపారాధన చేయవచ్చు. ఏదైనా కారణం వల్ల కొన్నిరోజులపాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు. దానికి చింత పడనవసరం లేదు.
ప్రత్యేకించి కార్తికమాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాలు కలిగిస్తాయి. అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తికమాసంలో మాత్రమే చేయడం చూస్తుంటాం.
అటువంటి దీపోత్సవాల్లో పాల్గొనవచ్చు. కనీసం కార్తిక పౌర్ణమినాడు లేదా ఆ మాసంలో ఏదైనా ఒక రోజున 'ఆలయంలో, నదీతీరంలో, పూజగదిలో, తులసికోటవద్ద దీపారాధన చేయడం మంచిది.
కార్తిక పౌర్ణమినాడు సంవత్సరం మొత్తానికి గాను 366 వత్తులను వెలిగించే సంప్రదాయం ఉంది. ఆనాడు దీపారాధన చేస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది.
*కార్తికమాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు?*
*వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే.*
*దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి. అదే మానవ దేహం. పృధివీతత్త్వం. వైరాగ్యంతో కూడిన తైలం, నూనె కావాలి. ఇది జలతత్త్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. అది ఆకాశ తత్త్వం . వెలిగించడానికి అగ్ని కావాలి. వెలిగించిన తర్వాత దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి. అది ఆ వాయుతత్త్వం. ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం.*
మానవునిలో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరిపోసే ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తాం. దేహంపై మమకారం వదలిపెట్టడానికి, అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తిక దీపదానం చేస్తాం.
*కార్తికమాసంలో దేవుని దగ్గర పెట్టిన దీపం ఎంతసేపు వెలగాలి*
దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం.
*దీపం కనీసం గోదోహన కాలంపాటు వెలగాలన్నారు.*
అంటే ఆవుపాలు పితికేందుకు పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్ధం. సామాన్య పరిభాషలో అరగంట దాకా వెలిగేంత చమురుపోసి దీపారాధన చేయాలి అలాగే పూజా పూర్తయ్యాక మనంతట మనమే దీపం ఆరకూడదు. దానంతట అది ఆరిపోయేవరకు అలా ఉంచాలి. పూజమధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి.
*దీపం ఆరింది అనడం కూడా అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అంటూ ఉంటారు.*
🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏
🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి