23, నవంబర్ 2020, సోమవారం

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము


            మూడవ అధ్యాయము 


ముని సూతుడు తదుపరి యా 

మునిజనముల జూచి మిగుల మోదముతోడన్ 

"వినుడిక మీరలు దెలిపెద 

జనపతి మఱి సాధు శ్రేష్టి చరితము లెల్లన్    55



పూర్వ ముల్కాముఖుండను పుణ్యమూర్తి 

పుడమి నేలుచు నుండెను బుధులు మెచ్చ 

సతత మందిరదర్శన,సత్య వ్రతము 

విప్ర దానంబు లాతని విమల గుణము      56



ఆత డొకనాడు యర్ధాంగి యనుసరించ 

భద్రశీలానదీతీర ప్రాంతమందు 

సత్యనారాయణ స్వామి సద్వ్రతంబు 

సల్పు చుండెను యత్యంత సక్తి తోడ       57



శాస్త్రసమ్మతి జేసియు సత్యవ్రతము 

దివ్యమైన ప్రసాదంబు తీర్థజలము 

భక్తవరులకు మఱియును బంధువులకు 

వినయమున జేసె నాతడు వితరణంబు    58


సత్యవ్రతమును రాజట సల్పుచుండ 

సాధువనియెడి పేరున్న సాత్వికుండు 

వైశ్యు డచటికి వచ్చియు వర్తకమున 

పరవశించెను గాంచియు భక్తి తోడ        59



వ్రతమున పాల్గొని సాధువు 

యతి విస్మయ మంది దాని యాచరణముకున్ 

వ్రత నియమము లన్నిటిని 

నతమస్తకుడయ్యు నడిగె నరపతి నపుడున్  60



సాధు వారీతి యడుగగ సంతసించి 

సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

సంతు కోసము భక్తితో సల్పితంచు 

వినయమున జెప్పె వ్రత విధి వివరములను   61


అంతట సాధువు యదివిని 

సంతోషము పొంది పిదప సరుకుల తోడన్ 

సొంతూరు జేరి  నావతొ 

సంతానము కొఱకు దలచె సత్యవ్రతంబున్  62


సాధువంతట సతితోడ సంప్రదించి

సత్యదేవునివ్రతమును సన్నుతించి  

"సంతు గల్గిన వ్రతమును సల్పెదంచు "

మదిని సంకల్ప మొందెను మాట పలికి     63

కామెంట్‌లు లేవు: