*దేవాలయాలు - పూజలు 19*
సభ్యులకు నమస్కారములు.
*సంప్రదాయములు*
4) *మధ్వ సంప్రదాయము* దక్షిణ భారత దేశంలో శ్రీమద్ మధ్వాచార్యుల వారు ఇచ్చిన, ప్రవేశ పెట్టిన భక్తి మార్గం మరియు గురువులు (పీఠాధిపతులు) వారి ప్రబోధనల ద్వారా మధ్వ సంప్రదాయం లేదా సద్వైష్ణవ సంప్రదాయం వృద్ధి జరిగినది అని తెలుస్తున్నది. వీరు *ద్వైత* సిద్ధాంతాన్ని విశ్వసించి పాటిస్తారు.
5) *శైవ సిద్ధాంతం* శైవత్వం లేదా శివ తత్వం అనేది లింగ పూజల పట్ల పరమేశ్వరుని పట్ల నమ్మకం ఉన్న వ్యవస్థ. ఇక్కడ సర్వ సర్వ శ్రేష్టమైన, ముఖ్యమైన పరమైన భగవంతుడు శివుడు.
వీరు విశ్వసించేది
శ్రీమద్భగవత్ శంకరాచార్యులు గారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని *అద్వైతం* .
శైవము పలు ఉపశాఖలతో కూడి ఉన్నది. అందులో కొన్ని రుద్ర శైవము, వీర శైవము, పరమ శైవము ఇత్యాది.
పూజా సంప్రదాయాల గురించి గతంలో సంగ్రహంగా తెలుసుకున్నాముకదా, ఇప్పుడు ఆగమాల గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. *భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు*. భగవంతుని ఏలా ప్రతిష్టించాలి, ఏలా అర్చించాలి, మరియు సంవత్సరము/ప్రతి సంవత్సరము జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ మార్గమును ప్రబోధిస్తాయి ఆగమాలు. ఉత్సవం నిర్వహించే ఉదాత్తులకు ఏలాంటి లక్షణాలు, అర్హతలు ఉండాలి అనే వివరాలను ఆగమ శాస్త్రం తెలియజేస్తున్నది. వైష్ణవ ఆగమాలు రెండు విధములు.
1) వైఖానస ఆగమము
2) పాంచ రాత్ర ఆగమము.
1) *వైఖానస ఆగమము* వైఖానస ఋషికి శ్రీ మహా విష్ణువు ద్వారా తెలియజేయబడినది.
శ్రీవైష్ణవం, శైవం, మధ్వం లాగానే వైఖానసం కూడా ప్రాచీన హిందు సంప్రదాయం.
ఈ సంప్రదాయాన్ని పాటించే వారు ముఖ్యంగా *కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖను, వైఖానస కల్ప సూత్రాన్ని* పాటించే బ్రాహ్మణులు. వీరు వాస్తవానికి *ఏకేశ్వర* భావాన్ని నమ్ముతారు.
కాని, కొన్ని అలవాట్లు *బహు దేవతారాధనను* తలపిస్తాయి. ఇతర వైష్ణవ వర్గాలలో ఉన్నట్లు *ఉత్తర మీమాంస* ను నమ్మకుండా, కేవలం పూజా పునస్కారాల పైననే వైఖానసం అమలు జరుగుతుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమైన *వైఖానస భగవత్ శాస్త్రమే* ప్రామాణము. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిత్య పూజలకు వైఖానస ఆగమమే ప్రధానము.
2) *పాంచరాత్ర ఆగమము* పాంచ అంటే అయిదు, రాత్ర అర్థము రోజులు. భగవంతుడు అయిదు రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేన మూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి.
*బ్రహ్మాదీనాం గురుం పూర్వం*
*ఇందిరా గృహమేదినం*,
*పాంచరాత్ర ప్రవక్తారం*
*వందేనారాయణంప్రభుం* ||
*విష్వక్సేనం తదాతార్క్ష్యం*
*భరద్వాజం కపింజలం*
*వశిష్ఠాది మునింవందే*
*పాంచరాత్ర ప్రవర్తకాన్*||
కావుననే దీనికి
*పాంచరాత్ర ఆగమమని* పేరు.
ఈ భక్తి పూర్వకంగా చేసే పూజా విధానము వలన మనుష్యుల అజ్ఞానము తొలగి జ్ఞానము, వైరాగ్యం సిద్ధిస్తుంది. ఈ విశ్వంలో ప్రతి జ్ఞాని పునరావృత్తి రహిత వైకుంఠము చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు
పాంచరాత్రము దోహద పడుతుంది. ఆగమంలో భగవంతుని సేవించేందుకు *దివ్యము, అర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి*.
శ్రీ పద్మ సంహిత, శ్రీప్రశ్న సంహిత శ్రీ మన్నారాయణ సంహిత మొదలైన శాస్త్రాలలో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక మరియు కామ్యోత్సవాలను జరుపుతున్నారు.
నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజాదికాలు నిర్వహింపబడుతున్నాయి. కాని, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మాత్రం అనూచానంగా *వైఖానస* ఆగమానుసారమే పూజలు జరుగుతున్నాయి.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి