23, ఆగస్టు 2024, శుక్రవారం

సాధకుడు - సద్గురువు

 సాధకుడు - సద్గురువు 


ప్రతి సాధకుని మదిలో తొలిచేది ఏమిటంటే నాకు సద్గురువు దొరుకుతారా? ఆయనను నేను ఎలా తెలుసుకోవాలి? అన్నది ఒక ప్రశ్న ఎంతో మంది ముముక్షువులు తనను తరింపచేసే సద్గురువు కోసం వెతుకులాట చేస్తుంటారు. ముందుగా అసలు సాధకుడు ఎవరో తెలుసుకుందాము.  


సాధకుడంటే ఈ ద్వైత ప్రపంచాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొని ఇక్కడ ప్రతిదీ రెండుగా వున్నది మరి దీనికి కారకుడు ఎవరు? నేను ఆ కారకుడిని తెలుసుకోవటం ఎలా అని పరితపించే ముముక్షువే సాధకుడు.  సాధకుడు తాను చూస్తున్నది ప్రతిదీ నశించేదని గ్రహించి ఇక్కడ నశించనిది, శాశ్వతమైనది ఏది అని వెతకటం మొదలిడతాడు.  అతడు మరణాన్ని జయించటం ఎలా అని ఆలోచిస్తాడు. 


గురువు: గురువు అనగా అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞనాన్ని ప్రసాదించే వాడే గురువు.  అజ్ఞానం చీకటిగా భావిస్తే జ్ఞానప్రకాశాన్ని నిలిపే వాడే గురువు.  మనకు అనేక విషయాలను తెలియచేసే గురువులు వున్నారు.  కానీ బ్రహ్మ జ్ఞనాన్నికలిగించవారే గురువే సద్గురువు.. జ్ఞానం అంటే మనకు తెలియనిది తెలుసుకోవటం.  బ్రహ్మజ్ఞానం అంటే అన్నిటి కన్నా ఉత్తమమైన జ్ఞానం.  ఒక్క మాటలో చెప్పాలంటే ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవలసిన పనిలేదో అదే బ్రహ్మ జ్ఞానం.  అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే గురువే సద్గురువు. 


సద్గురువు లక్షణాలు: ఏ మహానుభావుడు అయితే ఈ భవసాగరాన్ని దాటి మోక్షాన్ని పొందాలనుకుంటాడో ఆయనే బ్రహ్మజ్ఞాని అటువంటి జ్ఞానియే సద్గురువు . ముందుగా మనం పరిశీలిస్తే ఆ మహానుభావుడు అరిషడ్వార్గాన్ని జయించిన వాడైవుంటాడు. అనగా  కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు ఆయన వాటినుండి విముక్తి పొందినవాడై ఉంటాడు. అంటే 


1) కామం: ఆయనకు ఈ ప్రపంచంలో వేటి మీద కోరిక కలిగి ఉండడు ఏది అతనికి కావాలని ఉండదు అది స్త్రీ కానీ, ధన, వస్తు, వాహన కనకాలైన కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహానుభావునికి తనదనేది ఏది ఉండదు, సమాజ అర్ధంలో చెప్పాలంటే పూర్తి దారిద్యపు జీవనం గడుపుతుంటాడు. నిరాడంబరగా ఉంటాడు.,


2) క్రోధం: క్రోధం అంటే కోపం ఆయన ఎల్లప్పుడూ కోపానికి లోనుకాకుండా సదా శాంత స్వభావంగా ఉంటాడు, మిత బాషి.


3) మోహం: మొహం అంటే విషయ వాంఛలు నాకు ఇదికావాలి అది కావాలనే కోరిక అది అతనికి ఉండదు. 


4) లోభం: లోభం అంటే మన వాడుక భాషలో పిసినారితనం. అనగా తనదైన దానిని వదులుకోవటానికి ఇష్టపడని తత్త్వం.  ఆయనకు ఏమి ఉండదు కాబట్టి ఇక వదులుకోవడం అనేదే  ఆయనకు ఉండదు.


5) మదం: మదం అనేది నా అంతవాడు లేడనే గర్వము, నేను గొప్పవాడిని అనే  భావం. ఆయనకు అవి వుండవు. 


6) మాత్సర్యం :మాత్సర్యం అనగా తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండటం.  అది అతని మనస్సులోకూడా రాదు.


బ్రహ్మ జ్ఞాని అయినవాడు పైన పేర్కొన్న ఆరు మానసిక స్థితులను అధిగమించి కేవలము సదా బ్రహ్మములోనే చరిస్తూ ఉండి తనను తాను ఉద్దరించుకుంటాడు. అటువంటి మహానుభావుడు మాత్రమే సద్గురువుగా పరిగణించబడతాడు.  ఇప్పుడు చెప్పండి మనకు ఇటువంటి గొప్పవారు తారసపడతారా ? 


నేటి గురువులు: ప్రస్తుతం సమాజంలో మనం అనేక మందిని వారికి వారే సద్గురువులం అని చెప్పుకునే వారిని చూస్తున్నాము. మిత్రమా ఒక్కసారి వారిలో పైన తెలిపిన లక్షణాలు ఉన్నాయా అని పరిశీలించు.  ఒక్కటి అంటే ఒక్కటి కూడా వారిలో వుండవు. 


ఖరీదైన కాషాయ వస్త్రాలను ధరిస్తూ, ఖరీదయిన భవనాలలో నివసిస్తూ, విలువైన ఆసనాలఫై ఆసీనులు అవుతూ ప్రవచనాలు చేస్తున్నవారు మనకు కోకొల్లలుగా కనపడతారు.  మీకు కౌపీనం (గోచి) పెట్టుకున్న యోగి ఎక్కడైనా తారసపడ్డాడా? నేను చూడలేదు, మీరు చుస్తే తెలియచేయండి.


సాధకునికి గురువు ఆవశ్యకత: నేను కొన్ని ఉపమానాలతో సాధకునికి గురువు ఎంతవరకు అవసరమో తెలియచేయ ప్రయత్నిస్తాను. 


నీవు మీ ఊరుకు బస్సులో వెళ్లాలని అనుకొని దారి ఖర్చులకు తగు డబ్బులు సమకూర్చుకొని బస్స్టాండు చేరుకొని నీ బస్సు ఏదో తెలుసుకోలేక అక్కడ వున్న అక్కడి విషయాలు తెలిసిన ఒక వ్యక్తిని నీ ఉరుకు వెళ్లే బస్సు యెక్కడ ఆగుతుంది అని అడిగితె అతను నీకు ఫలానా ప్లాటుఫారమ్ లో దొరుకుతుంది అని చెప్పాడనుకో, ఇప్పుడు ఆతను నీకు ఏవిధంగా సహకరించాడు? కేవలం నీకు ఒక మాట సహాయం చేసాడు, గురువు కూడా అంతే. 


నీవు కారులో ఒక వూరు వెళ్లదలిచావు కొంత దూరం వెళ్లిన తరువాత రెండు రోడ్లు చీలాయి అక్కడ ఒక మార్గనిర్దేశం అంటే సైను బోర్డు కనపడినది అందులో రెండు రోడ్లు ఏ ఏ ఊర్లకు వెళతాయో తెలియపరచి వుంది దానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని  నిర్ధారించుకుంటావు. ఆ బోర్డు నీకు ఎలా ఉపయోగ పడింది? గురువు కూడా అలానే సహాయపడగలడు 


నీవు వెళ్లే మార్గంలో ఒక మురికి కాలువ అడ్డం వచ్చింది దానిని దాటటం ఎలా అని నీవు అనుకుంటుంటే అక్కడ ఒక వ్యక్తి దూరంలో వున్న ఒక రాయిని చూపి అది ఆ కాలువలో వేసి దానిమీద కాలు పెట్టి బురద అంటకుండా దాటమని సలహా ఇచ్చాడు.  అలాగే నీవు ఆ కాలువను దాటావు .  ఇక్కడ మురికి కాలువ అనేది సంసారం అనేది. దానిని దాటాలి అని అనుకోవటం నీ ప్రయతనం. అక్కడ వేసిన రాయి నీవు చేయవలసిన సాధన ఆ రాయిని చూపినవాడు నీ గురువు. 


గురువు కేవలం నీవు ఎలా సాధన చేయాలో మార్గదర్శనం చేస్తాడు.  కానీ ప్రయత్నం, సాధన కృషి అన్నీ నీవే కలిగి ఉండాలి.  నీ ప్రయత్నం లేకుండా నీకు మోక్షం సిద్దించదు.  ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమిమీద నివసించే ఎవ్వరు కూడా నీకు మోక్షాన్ని ఇవ్వలేరు.  కేవలం సద్గురువు నీకు పైన తెలిపినట్లు మార్గదర్శనం చేయగలరు. 


గురువును వదిలి వేయాలి: ఓ సాధక మిత్రమా నీకు గురుత్వం వహించిన గురువును కేవలం కొద్దికాలం మాత్రమే సంబంధం కలిగి తరువాత గురువుని వదిలి వేయాలి.  కేవలం సాధనతోటె మోక్షాన్ని పొందాలి.  అంటే నీకు గురువుతో ఇప్పుడు  పనిలేదు. ఎలాగైతే పై సందర్భంలో రాయిని చూపిన వాడిని, అలాగే రాయిని వదిలి నీ మార్గంలో వెళ్ళావో అదే విధంగా గురువు చూపిన సాధనను  వదలాలి. అంటే ఎప్పుడైతే నీవు సమాధి స్థితిని పొందుతావో అప్పుడు నీకు గురువు నేర్పిన ధ్యానంతో పనివుండదు. 


సమాజంలో ఈ రోజుల్లో అనేకమంది ధన సంపాదన అభిలాషులు నేనే గురువుని ఈ పద్ధతి నేనే కనుక్కున్నాను అని పేర్కొంటూ వారి శిష్యగణాలను వృద్ధి చేసుకుంటూ వారి వద్దనుండి ధనాన్ని  సేకరిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొందరు గురువులు తాము నేర్పిన విద్య (యోగ పద్దతి) వేరే ఎవ్వరికీ చెప్పరాదని ప్రమాణం చేయించుకొని వారి శిష్యుల వద్ద ఎక్కువ మొత్తంలో ద్రవ్యాన్ని వసులు చేస్తున్నారు. అమాయకులైన ఆ శిష్యులు వారి గురువు గారి గొప్పతనాన్ని వారు నేర్చుకున్న యోగాన్ని ప్రచారం చేస్తూ గురువుగారి వ్యాపారాభివృద్ధి చేస్తున్నారు.  భార్గవ శర్మ అలాంటి ఒక శిష్యుడిని తమరు నేర్చుకున్న యోగం ఏమిటని ప్రశ్నించాడు.  తాము సుదర్శన క్రియ అనే యోగసాధన గురువుగారి వద్దనుండి నేర్చుకున్నామని.  దానిని ఎవ్వరికీ చెప్పకూడదని ప్రమాణం చేశామని చెప్పి మీరు అందులో చేరండి బాగుంటుంది అని సలహా ఇచ్చాడు.  మిత్రమా తెలిసిన విద్య పలువురికి చెప్పటానికి పనికిరానప్పుడు విద్య అభ్యసించటం ఎందుకు అంటే సమాధానం లేదు.   ఇక కొందరు వారి గురువు ఫోటోని పెన్నులకు పెట్టుకొని మెడలో వేసుకొని ప్రచారం చేస్తున్నారు.  అలాటి వారు తమ గురువుకి శిష్యులను చేర్చటమే తమ జీవిత పరమావధి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. 


బ్రహ్మకుమారి యోగ సంఘంలో పరిచయం అయిన ఒక మిత్రుడు భార్గవ శర్మతో నా వద్ద అమ్మా భగవాన్ పాసు ఒకటి వున్నది నాకు వెళ్ళటం కుదరటం లేదు దాని ఖరీదు ఐదు వేలు నేను మీకు ఉచితంగా ఇస్తాను మీరు ఆధ్యాత్మికత వైపు పయనిస్తున్నారుకదా మీరు వెళ్ళండి అని అనటం జరిగింది.  దానికి ఆయన మిత్రమా భగవంతుడు నిరాకారుడు అతడు ఈ జగత్తుకి కారకుడు అటువంటి భగవంతుని మనం సాధన చేసి తెలుసుకోవాలి కానీ నేనే దేముడు అని ప్రగల్బాలు పలికే వారిచుట్టూ తిరిగితే ఏమి లాభం ఉండదు.  మీరు ఇచ్చే పాసుతో పాటు ఇంకొక ఐదు వేలు దారిఖర్చులకు ఇచ్చినా నేను వెళ్ళను.  మీరు కూడా అటువంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పాడు. అంతే కాకుండా సాధక మిత్రమా నీవే ఆలోచించు నీ గమ్యం మోక్షమా లేక గురువుల ప్రచారామా?  ఇలా తమ గురువులని ప్రచారం చేసే వారు సారా తాగుతున్నానని మెడలో కాళీ సీసాలు వేసుకొనే మూర్ఖులకన్నా అధములు. ఇటువంటి గురువులు మురికి కాలువ దాటించామని చెప్పుకొంటూ మురికి కాలువలో (సంసార బంధనాలలో) జలకాలాడుతూ నిన్నుకూడా ఆ మురికి కాలువలో నిర్బంధిస్తున్నట్లు తెలుసుకో. మిత్రమా నీ సాధన సిద్దించిన తరువాత నీ గురువుని విస్మరించి ముందుకు పో 


ఇటీవల ఒక మిత్రుడు తాను ఒక గురువును నమ్ముతున్నానని అయన చాలా మహిమాన్వితుడని అయన కొన్ని యోగ పద్ధతులు కనుకొన్నారని నాకు తెలిపితే అది విన్న తరువాత తట్టిన భావాలతో ఈ వ్యాసం. 


గమనిక: దయచేసి సాధక మిత్రులారా గమనించ గలరు, శ్రీ పరమేశ్వరుడు, శ్రీ కృష్ణ భగవానులు పతంజలి మహర్షి, ఆది శంకరాచార్యులు ఇంకా ఉపనిషత్తులలో పేర్కొనిన మహర్షులు మనకు మార్గదర్శకులు.  వారు చెప్పిందే కొందరు తెలుసుకొని అది వారి ప్రతిభ అన్నట్లు చెపుతూ అమాయక సాధకులను తప్పుత్రోవ పట్టిస్తున్నారు.  కాబట్టి మోసపోకండి.  మీకు నిజంగా మోక్ష ప్రాప్తి కావాలంటే నా దగ్గరకు (ఇక్కడ "నా" అంటే ఎవరి వద్దకు వారు అని అర్ధం) రండి మీకు తప్పకుండ మోక్షం సిద్ధిస్తుంది.


ఓం తత్సత్ 


ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః


మీ భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: