23, ఆగస్టు 2024, శుక్రవారం

బాలకృష్ణయ్య (అ)మాయకత్వం!

 బాలకృష్ణయ్య (అ)మాయకత్వం!


అమ్మా! మన్నుదినంగ నేశిశువునో?

ఆకొంటినో?వెఱ్ఱినో?

నమ్మంజూడకు వీరిమాటలు మదినన్నీవు కొట్టంగ వీ

రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేన్

మదీయాస్య గం

ధ మ్మాఘ్రాణము సేసి నావచన ముల్ దప్పైన దండింపవే!!


ఆం:భాగవతము- పోతనమహాకవి: 10 స్కం: 337 ప:


       బాలకృష్ణుని చిలిపి చేష్ఠలకు చిత్రాయమానం బమ్మెఱ వారిభాగవతం!

              ప్రతిపద్యం ఒక రసగుళిక! మనంభౌతికదృష్టితోగాక ఆదిభౌతిక దృష్టితో పరిశీలిస్తే వాటి వెనుక నున్న అర్ధంపరమార్ధం మనకు బోధపడుతుంది.

       కావాలని కృష్ణయ్య బలరామాదులు వీక్షింపగా ఆటలాడుసందర్భంలో మృద్భక్షణ చేశాడు. తమ్ముడుఇలాచేశాడని తల్లితోఅన్న ఫిర్యాదు.(అదేకావాలి ఆనల్లనయ్యకు.) తల్లి మందలింపు .మనయింట్లో పాలు పెరుగు వెన్నలు లేవా?మన్నెందుకు తిన్నావురా?అనియశోద మందలిస్తే 


"నంగనాచి, బుంగమూతిపెట్టి,ఏవిటమ్మా! నువ్వూనమ్ముతున్నావా వీరిమాటలు? ఉత్త అబధ్ధాలమ్మా! ఆవంకతో నీవునన్నుకొడితే చూచి నవ్వటానికి యీయెత్తులన్నీ.మన్నుతినటానికి నేనేమైనా వెర్రివాడనా?ఆకలిగొనియున్నానా? ఇన్నిమాటలెందుకమ్మా !ఇదిగోనా దగ్గరకురా! నానోరు వాసనజూచిచెప్పవమ్మా! మన్నుతిన్నానో లేదో?అంటున్నాడు."

ఆవెర్రిబాగులతల్లి ,అందుకుపక్రమించింది.ఇంకేముంది? సకలప్రపంచం ఆయన ఉదరంలోనే దర్శనమిచ్చింది.(ఇది తొలి విశ్వరూప ప్రదర్శనం)

యశోదకు కళ్ళుతిరిగిపోయాయి.ఒకపక్కనుండి కృష్ణుడంటే భయం పట్టుకుంది. 

              "ఏమిటిది?కలగన్నానా?లేక యదార్ధమా?వీడు నాకొడుకేనా?లేక వైష్ణవ మాయయా?"-అనితబ్బిబ్బయింది.

అంతలోకృష్ణుడు అమాయకంగా మొగంబెట్టి పొట్టచూపిస్తూ అమ్మా!ఆకలిగా ఉందే!ఏదైనాపెట్టవే! అన్నాడు.అంతే ఆవెర్రిబాగులతల్లి అన్నీమరచిపోయింది.పుత్రవ్యామోహం మనస్సు నాక్రమింపగా,కృష్ణుని చంకకెత్తుకొని వంటయింటి వైపుపరుగెత్తింది.

          ఇదీ బాలగోపాలబాలుని అమాయకత్వంలోని మాయకత్వం!

                                 స్వస్తి!

కామెంట్‌లు లేవు: