*జై శ్రీమన్నారాయణ*
23.08.2024,శుక్రవారం
*ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, "ఆంధ్ర కేసరి" శ్రీ.టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి నేడు..*
టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.
టంగుటూరి ప్రకాశం’ పంతులు సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధుడు. మనిషి కృషి పట్టుదల ఉంటె ఎన్నికష్టనష్టాలు వచ్చినా జీవితంలో పైకి ఎదగవచ్చనునని నేటి తరానికి తెలిపిన స్ఫూర్తి ప్రధాత. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని.. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు.. టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు. ఆయన జీవితం పూలపాన్పు కాదు.. బాల్యంలోనే ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రకాశం పంతులు జీవితంలోని ఎన్నో స్ఫూర్తినిచ్చే సంఘటనలున్నాయి.
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953 తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాఋ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు వారి కోసం హైకోర్టు స్థాపించారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించారు. సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపారు. బెజవాడలో కాటన్ దొర కట్టిన బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడితే.. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బ్యారేజ్ రిపేర్ చేయడానికి ఇవ్వమని స్పష్టం చేస్తే.. రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ ను బాగుచేయించి నిలబెట్టారు. ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దారు. అందుకే ప్రజలందరూ ఆ బ్యారేజ్ ను ఆయన పేరుతోనే ప్రకాశం బ్యారేజ్ గా పిలుచుకుంటున్నారు.
అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్యాన్ని అనుభవించారు. ప్రకాశం పంతులు తన పుట్టిన రోజున తనను శాలువతో సత్కరిస్తే ‘ఈ శాలువ నాకెందుకురా!ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!!’ అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి