21, మే 2024, మంగళవారం

శంకర జయంతి ప్రత్యేకం

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం 

          ( ఈ నెల 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )


                       భాగం 9/10 

                        

8.అద్వైత సిద్ధాన్తమ్ 


        వేద ప్రామాణికమైన అద్వైత సిద్ధాన్తాన్ని ఆదిశంకరులు పునః ప్రతిపాదించారు. 

       వేదాలతోపాటు విష్ణు పురాణం, పాంచరాత్ర - వైఖానస ఆగమాలవంటి వైష్ణవ గ్రంథాలతో సహా అన్నీ పేర్కొన్న ఈ సిద్ధాన్తంలో, 

       అద్వైతంలోని  ఎనిమిది ప్రధాన విషయాలు వెలికి తీశారు. అవి 

అ) బ్రహ్మమే అందరికీ ఆత్మ, 

ఆ) బ్రహ్మ నిర్గుణము, 

ఇ) జీవాత్మ పరమాత్మ ఒక్కటే, 

ఈ) ప్రపంచం పైకి కనబడుతున్నది; కానీ వాస్తవంలో అది మిథ్య, 

ఉ) మోక్షం జ్ఞానం వలననే లభిస్తుంది, 

ఊ) జీవించియుండగానే ముక్తి పొందవచ్చు. అదే జీవన్ముక్తి, 

ఋ) సత్యం 

      ప్రాతిభాసిక,వ్యావహారిక,పారమార్థిక సత్యాలని మూడు విధాలు, 

ౠ) శివకేశవులకు భేదం లేదు. 


      పరమాత్మని సేవిస్తూ, తత్త్వాన్ని తెలుసుకుంటూ, 

      పెద్దవృత్తమైన పరమాత్మలో చిన్నవృత్తంగా ఉంటాడు జీవుడు. ఆ చిన్నవృత్తం క్రమక్రమంగా పెరిగి పెద్దవృత్తంతో ఐక్యమైనట్లు, తాను పరబ్రహ్మయే అని అనుభూతి స్థితికి చేరుకోవడమే (రెండు కాని) ఒకటే అయిన అద్వైతం. 


*ప్రత్యేక గమనిక 


    అద్వైత సిద్ధాన్తంలో  "జీవాత్మ - పరమాత్మ ఒక్కటే!" అనే  ఒక ప్రముఖమైన విషయం,  

    వైష్ణవాగమాలలోని పాంచరాత్రాగమంలో, 

    సాక్షాత్తు నారాయణుడే బ్రహ్మతో చెప్పిన ప్రామాణిక విధానాలలో ఒకటి. 👇  


           పాంచరాత్రాగమము - అద్వైత భావము  


    పాద్మ సంహిత ఎనిమిదవ అధ్యాయములో బ్రహ్మ-నారాయణ సంవాదములో, 

    నారాయణుడు అన్నది.    


ఓ చతుర్ముఖా (ఓ బ్రహ్మా)!  

    మోక్షము అనేది భేదముక్తి, అభేదముక్తి, మిశ్రముక్తి అని మూడు విధాలుగా ఉంది.  


1.భేదముక్తి: 

      ఇది కైంకర్య లక్షణమైనది (సేవ). 

      ఈ లోకంలో పరిచర్యచేయు మనుష్యులున్నట్లే, 

      ముక్తులైనవారు పరమాత్మలోకమైన వైకుంఠమునందు, ఆ పరమాత్మకు దగ్గఱగా ఉండి, కింకరులై (సేవచేయుచు) భగవంతుని అనుగ్రహము మాత్రమే కోరుదురు. 

      ఇది భేదముక్తికి లక్షణము. 

2.అభేదముక్తి: 

      పరమాత్మకు జీవాత్మకు అత్యన్తమైన ఐక్యమునే అభేద ముక్తి అంటారు. 

     "సోఽహమ్"- ఆ బ్రహ్మను నేను - అనే భావననే ఐక్యం అంటారు. 

3.మిశ్రముక్తి: 

      మిశ్రముక్తిలో జీవుడు విడిగా ఉంటాడు. 

      భగవంతుని అర్చనాదులతో సంతోషపెట్టి, ఏకాగ్రచిత్తుడై, బ్రహ్మాత్మైక్యజ్ఞానంతో, చిద్ఘనుడైన పరమాత్మతో ఐక్యము నందుతాడు. 

      దీనిని సాయుజ్యముక్తి అంటారు. 


      దీని వలన సామాన్యముగ పొందుటకు సాధ్యముకాని ఐశ్వర్యము, అణిమాద్యష్టసిద్ధులు కలుగును. 

                       లేదా 

     పరమానందప్రాప్తిరూపమైన ముక్తియైనను కలుగవచ్చును. 

                       లేదా 

      జీవాత్మ పరమాత్మల ఐక్యరూప ముక్తిని పొందవచ్చు. 


భేదేన చాప్యభేదేన మిశ్రేణ చ చతుర్ముఖ!  

త్రిధైవ ముక్తి రుదితా భేదే కైంకర్యలక్షణా 


ముక్తిర్యథేహ లోకేషు పరిచర్యాపరా నరాః 

దేవస్య తద్వదేవైతే వైకుంఠే పరమాత్మనః 

లోకే తస్య సమీపస్థాః తత్ప్రసాదపరా స్సదా 


అభేదముక్తిరత్యన్తమ్ ఐక్యం స్యాత్పరజీవయోః 

ఆత్మనో భావనాచైక్యం సోహమిత్యేవమాత్మికా 


సిద్ధాన్తే మిశ్రరూపేతు భేదే స్థిత్వార్చనాదిభిః 

తోషయిత్వా పరందేవం తతోముక్త స్సమాహితః 

విజ్ఞానేనేకతానేన పరమాత్మని చిద్ఘనే 

ఐక్యంప్రాప్నోతి సాముక్తి రుక్తా సాయుజ్యలక్షణా 


ఐశ్వర్యమణిమాద్యష్టగుణావాప్తి స్సుదుర్లభా 

ముక్తిర్వా పరమానందప్రాప్తిరూపా యదీప్సితమ్ 

ముక్తిర్వాస్త్యేకతాపత్తి ర్జీవాత్మపలమాత్మనోః 


ముక్తాయింపు    


    వైష్ణవుల పాంచరాత్రగ్రంథంలో పైన తెలిపిన విధంగా,  

    సాక్షాత్తు నారాయణుడే బ్రహ్మకు బోధించడంతో,   

    ఆది శంకరాచార్యులవారు వెలికి తెచ్చిన,వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాన్తం, 

    కేవలం శంకరుల అనుయాయులకీ, వారి పరంపరకే కాక, 

    మానవులందరికీ వర్తించే భగవదుపదేశమే కదా! 


                    కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయంణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: