*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది ఐదవ అధ్యాయము*
*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*45.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*తయోర్ద్విజవరస్తుష్టః శుద్ధభావానువృత్తిభిః|*
*ప్రోవాచ వేదానఖిలాన్ సాంగోపనిషదో గురుః॥10031॥*
*45.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*సరహస్యం ధనుర్వేదం ధర్మాన్ న్యాయపథాంస్తథా|*
*తథా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విధామ్॥10032॥*
అంతట గురూత్తముడైన ఆ బ్రాహ్మణుడు (సాందీపని) ఆ సోదరుల యొక్క నిర్మల సేవాభావములకును, సముచిత ప్రవర్తనలకును మిగుల ప్రసన్నుడయ్యెను. అందువలన అతడు వారికి చతుర్వేదములను, షడంగములను, ఉపనిషత్తులను వాత్సల్యపూర్వకముగా నేర్పెను. ఇంకను వారికి ధనుర్వేదమును, మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములను, న్యాయవైశేషికాది శాస్త్రములను, సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, ఆశ్రయము - అను ఆఱు భేదములతో గూడిన రాజనీతి శాస్త్రమును మెలకువలతోగూడ అధ్యయనము చేయించెను.
*45.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*సర్వం నరవరశ్రేష్ఠౌ సర్వవిద్యాప్రవర్తకౌ|*
*సకృన్నిగదమాత్రేణ తౌ సంజగృహతుర్నృప॥10033॥*
మహారాజా! పురుషులలో శ్రేష్ఠులైన ఆ బలరామకృష్ణులు సకలవిద్యలకును ప్రవర్తకులు. అందువలన గురువుగారు ఒక్కసారి చెప్పినంత మాత్రమున ఆ ఇరువురును ఆయా విద్యలను సంపూర్ణముగా గ్రహించుచుండిరి.
*45.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*అహోరాత్రైశ్చతుఃషష్ట్యా సంయత్తౌ తావతీః కలాః|*
*గురుదక్షిణయాఽఽచార్యం ఛందయామాసతుర్నృప॥10034॥*
మహారాజా! ప్రజ్ఞానిధులైన ఆ సోదరులు ఇరువురును పూనిక వహించి, అఱువది నాలుగు దినములలో అఱువది నాలుగు కళలను పుక్కిటబట్టిరి. పిమ్మట వారు సాందీపనితో 'గురువర్యా! మేము గురుదక్షిణను సమర్పింతుము. మీ అభీష్టమును తెలుపుడు' అని ప్రార్థించిరి.
*45.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం సంలక్ష్య రాజన్నతిమానుషీం మతిమ్|*
*సమ్మంత్ర్య పత్న్యా స మహార్ణవే మృతం బాలం ప్రభాసే వరయాంబభూవ హ॥10035॥*
మహారాజా! సాందీపని బలరామకృష్ణుల యొక్క అద్భుత మహిమను, మానవాతీతమైన (అసాధారణ) బుద్ధిబలమును గాంచి అచ్చెరువందెను. పిదప ఆ మహాత్ముడు తన భార్యతో సంప్రదించి ఇట్లు తెలిపెను- "శిష్యులారా! ప్రభాసతీర్థమున మా కుమారుడు సముద్రమున మునిగి మృతిచెందెను. ఆ బాలుని తీసికొనివచ్చి మా దంపతులకు అప్పగింపుడు. ఇదియే మాకు గురుదక్షిణ".
*45.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*తేథేత్యథారుహ్య మహారథౌ రథం ప్రభాసమాసాద్య దురంతవిక్రమౌ|*
*వేలాముపవ్రజ్య నిషీదతుః క్షణం సింధుర్విదిత్వార్హణమాహరత్తయోః|॥10036॥*
అపార బలపరాక్రమములుగల ఆ బలరామకృష్ణులు అందులకు మిగుల సంతసించిరి. అంతట ఆ మహాత్ములు రథమును అధిరోహించి, ప్రభాసతీర్థమునకు చేరి, సముద్రతీరమున క్షణకాలముపాటు అచట కూర్చుండిరి. అప్పుడు సముద్రుడు వారిని దివ్యపురుషులుగా గుర్తించి, సముచితరీతిలో వారిని పూజించెను.
*45.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*తమాహ భగవానాశు గురుపుత్రః ప్రదీయతామ్|*
*యోఽసావిహ త్వయా గ్రస్తో బాలకో మహతోర్మిణా॥10037॥*
పిమ్మట కృష్ణభగవానుడు అతనితో ఇట్లనెను. 'సాగరా! నీ ఉత్తుంగ తరంగములద్వారా మా గురుపుత్రుని నీలో చేర్చుకొంటివి. వెంటనే ఆ బాలకుని తీసుకొని వచ్చి మాకు అప్పగింపుము'.
*సముద్ర ఉవాచ*
*45.40 (నలుబదియవ శ్లోకము)*
*నైవాహార్షమహం దేవ దైత్యః పంచజనో మహాన్|*
*అంతర్జలచరః కృష్ణ శంఖరూపధరోఽసురః॥10038॥*
*45.41 (నలుబది ఒకటవ శ్లోకము)*
*ఆస్తే తేనాహృతో నూనం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః|*
*జలమావిశ్య తం హత్వా నాపశ్యదుదరేఽర్భకమ్॥10039॥*
*అప్పుడు సముద్రుడు ఇట్లనెను* "దేవాదిదేవా! శ్రీకృష్ణా! మీ గురుపుత్రుని నేను అపహరించలేదు. శంఖరూపధరుడైన *పంచజనుడు* అను మహాదైత్యుడు నా జలములలో సంచరించుచున్నాడు. ఆ దుష్టుడే మీ గురు తనయుని అపహరించియుండవచ్చును'. ఆ మాటలను విన్నంతనే కృష్ణపరమాత్మ వెంటనే సముద్రజలములలో ప్రవేశించి, ఆ దైత్యుని హతమార్చెను. కాని, అతని ఉదరములో గురుసుతుడు కనబడలేదు.
*45.42 (నలుబది రెండవ శ్లోకము)*
*తదంగప్రభవం శంఖమాదాయ రథమాగమత్|*
*తతః సంయమనీం నామ యమస్య దయితాం పురీమ్॥10040॥*
*45.43 (నలుబది మూడవ శ్లోకము)*
*గత్వా జనార్దనః శంఖం ప్రదధ్మౌ సహలాయుధః|*
*శంఖనిర్హ్రాదమాకర్ణ్య ప్రజాసంయమనో యమః॥10041॥*
*45.44 (నలుబది నాలుగవ శ్లోకము)*
*తయోః సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితామ్|*
*ఉవాచావనతః కృష్ణం సర్వభూతాశయాలయమ్|*
*లీలామనుష్య హే విష్ణో యువయోః కరవామ కిమ్॥10042॥*
అంతట ఆ దైత్యుని శరీరమునుండి పుట్టిన శంఖము (పాంచజన్యము) ను తీసికొని, రథమువద్దకు వచ్చెను. పిమ్మట ఆ ప్రభువు హలాయుధధారియగు బలరామునితోగూడి, యమునకు అత్యంత ప్రీతిపాత్రమైన సంయమనీపురమునకు చేరి, శంఖమును పూరించెను. ప్రాణులను శాసించువాడైన యముడు ఆ శంఖముయొక్క మహాధ్వని విన్నంతనే ఆ మహాపురుషులకు ఎదురేగి, చక్కని స్వాగత సత్కారములతో భక్తిశ్రద్ధాపూర్వకముగా వారిని సేవించెను. పిమ్మట యమధర్మరాజు సకలప్రాణుల హృదయములలో అంతర్యామియై విరాజిల్లుచుండునట్టి శ్రీకృష్ణుని యెదుట వినమ్రుడై నిలిచి, ఇట్లు విన్నవించెను. 'లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణా! నేను మీ ఇరువురకును ఎట్టి సేవలొనర్పవలయునో తెలుపుము!
*శ్రీభగవానువాచ*
*45.45 (నలుబది ఐదవ శ్లోకము)*
*గురుపుత్రమిహానీతం నిజకర్మనిబంధనమ్|*
*ఆనయస్వ మహారాజ మచ్ఛాసనపురస్కృతః॥10043॥*
*అంతట కృష్ణభగవానుడు ఇట్లు నుడివెను* "యమధర్మరాజా! మా గురుసుతుడు చేసికొనిన కర్మలను అనుసరించి, మీ కింకరులు అతనిని ఇచటికి తీసికొనివచ్చిరి. అతనిని మాకు అప్పగింపుము. ఇది నా ఆజ్ఞ".
*45.46 (నలుబది ఆరవ శ్లోకము)*
*తథేతి తేనోపానీతం గురుపుత్రం యదూత్తమౌ|*
*దత్త్వా స్వగురవే భూయో వృణీష్వేతి తమూచతుః॥10044॥*
వెంటనే శ్రీకృష్ణుని ఆదేశమును అనుసరించి, యముడు ఆ బాలకుని తీసికొనివచ్చి వారియెదుట నిలిపెను. పిదప ఆ యదువంశ శిరోమణులు ఆ బాలకునితో సాందీపని సన్నిధికి చేరి, తమ గురువునకు అతనిని అప్పగించి, 'ఇంకను ఏమి కావలయునో తెలుపుడు' అని ప్రార్థించిరి.
*గురురువాచ*
*45.47 (నలుబది ఏడవ శ్లోకము)*
*సమ్యక్సంపాదితో వత్స భవద్భ్యాం గురునిష్క్రయః|*
*కో ను యుష్మద్విధగురోః కామానామవశిష్యతే॥10045॥*
*45.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*
*గచ్ఛతం స్వగృహం వీరౌ కీర్తిర్వామస్తు పావనీ|*
*ఛందాంస్యయాతయామాని భవంత్విహ పరత్ర చ॥10046॥*
*పిమ్మట సాందీపని ఇట్లనెను* "నాయనలారా! మీరు చక్కని గురుదక్షిణను సమర్పించి, మమ్ము ఆనందింపజేసితిరి. మీ వంటి పురుషోత్తములకు గురువునైన నాకు ఇంక కోరుకొనదగినది ఏమి ఉండును? వీరులారా! మీరు మీ ఇండ్లకు వెళ్ళుడు, మీకు అజరామరమైన కీర్తి లభించును. అదీ సకలలోకములను పునీతమొనర్చును (మీరు దక్షిణ సమర్పించినరీతి, దాని వలన మీకు లభించిన కీర్తిప్రతిష్ఠలు లోకమునకే ఆదర్శప్రాయములు) మీరు అభ్యసించిన ఈ వేదశాస్త్రములును ఈ లోకమునందును, పరలోకము నందును నిత్యనూతనములై వర్ధిల్లుగాక!"
*45.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*
*గురుణైవమనుజ్ఞాతౌ రథేనానిలరంహసా|*
*ఆయాతౌ స్వపురం తాత పర్జన్యనినదేన వై॥10047॥*
ప్రియమైన పరీక్షిత్తూ! ఈ విధముగా బలరామకృష్ణులు గురుననుజ్ఞను పొంది, రథమునందు ఆసీనులైరి. పిదప వారు మేఘగర్జనవలె ధ్వనించుచు, వాయువేగమున సాగిపోగల ఆ రథముపై పయనించి, తమ మథురానగరమునకు చేరిరి.
*45.50 (యాబదియవ శ్లోకము)*
*సమనందన్ ప్రజాః సర్వా దృష్ట్వా రామజనార్దనౌ|*
*అపశ్యంత్యో బహ్వహాని నష్టలబ్ధధనా ఇవ॥10048॥*
వారి శుభాగమనమునకు సంతోషించుచు, పురప్రజలు ఎల్లరును వారిని జూచి, తాము కోల్పోయిన సంపదలను చాలాకాలమునకు మఱల పొందినంతగా పరమానందబరితులైరి.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే గురుపుత్రానయనం నామ పంచచత్వారింశోఽధ్యాయః (45)*
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట* యను నలుబది ఐదవ అధ్యాయము (45)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి