21, మే 2024, మంగళవారం

వివాహం కుదరని* *యువతీ యువకులకు…*

 *చిరకాలంగా వివాహం కుదరని* 

*యువతీ యువకులకు…*


          *తిరుప్పరంకుండ్రం:*

               ➖➖➖


తమిళనాడు రాష్ట్రంలో మదురైనుండి 8 కిలోమీటర్ల దూరంలో ఈ సుబ్రమణ్యేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం ఉంది.


కార్తికేయుని 6 దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి.


ఈఆలయం చిన్న కొండ శిఖరము పై ఉంది. ఆలయం ఎత్తైనగోపురాలతో; విశాలమైన మండపాలతో ఉంటుంది. విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు అని చెబుతారు.


ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో స్వామికి వివాహం అయిన స్ధలంగా ఈక్షేత్రం ప్రసిద్దిచెందింది.


ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహం కార్తికేయ-దేవసేన వివాహసన్నివేశాన్ని చూపిస్తుంది.


ఇంద్రుడు కలశంతో నీళ్ళుపోస్తుఉండగా స్వామి కుడి చేతిని చాచి వుంటాడు. ఎడమవైపున దేవసేన సిగ్గుతో నిలబడి ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళు చాలవు. అంత అందంగా వుంటారు.


*చిరకాలంగా వివాహం కుదరని యువతీ యువకులు ఇచ్చట స్వామివారిని దర్శంచి మ్రెుక్కుకుని వివాహం కుదిరిన తర్వాత స్వామి సన్నిధిలో మ్రెుక్కుబడిగా వివాహం చేసుకుంటారు.*


ఈ ఆలయంలో మహావిష్ణువు, పరమేశ్వరుడు ఎదురెదురుగా వుంటారు.


కార్తీక పౌర్ణమి రోజున కొండపైన కార్తీక దీపం వెలిగిస్తారు.కొండచుట్టు ప్రదక్షిణ చేసి కార్తీక దీపాన్ని స్వామి వారిని దర్శించుకుని తరిస్తారు. ఊరంతా దీపాలతో కళకళలాడుతూ వుంటుంది. మనకు చూడటానికి రెండు కళ్ళు చాలవు. 


మరో విశేషం ఏమిటంటే, మిగిలిన అయిదు ఆలయాల్లో స్వామి నిలబడి ఉంటారు. 


తిరుప్పరన్‌కుణ్రమ్ గుహాలయంలో మాత్రం ఆయన ఆసీనుడై ఉంటారు. ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి విగ్రహాలు ఉంటాయి. 


ఈ ఆలయంలో స్వామి విగ్రహానికి బదులు ఆయన శూలానికి (వేలాయుధం) అభిషేకాలు నిర్వహిస్తారు. 


ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపింపబడతారు.


వారి యొక్క శాప విమోచనం కొఱకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది.


తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత, మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు. 


స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, స్వస్వరూపం వచ్చి, వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్ధిస్తారు. 


వారి ప్రార్ధనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు.

అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు. అక్కడే ఉన్న చతుర్ముఖబ్రహ్మ గారికి,శ్రీమహావిష్ణువుకి తన ఈ కోర్కెని తెలియజేస్తాడు ఇంద్రుడు.బ్రహ్మ గారు, నారాయణుడు కూడా చాలా సంతోషించి, సుబ్రహ్మణ్యునికి తెలుపగా, స్వామి అంగీకరిస్తారు.


సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది. 


శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరగడం వల్లనే ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. 


రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.


ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది.

ఆలయంలోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు. 

అక్కడ అందరూ వెన్న ముద్దలతో అమ్మ వారికి పూజ చేస్తారు. 

మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న 

శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చాలా బాగుంటుంది.


ఇంకా లోపలికి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వాహనం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు.


అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు “కర్పగ వినాయగర్” అనే పేరుతో ఉంటారు. పెద్ద విగ్రహం చాలా బాగుంటారు. ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు. దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు.

శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు.


      *ఓం శరవణ భవ*

కామెంట్‌లు లేవు: