21, మే 2024, మంగళవారం

మహాభాగవతం


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము*


*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*45.1 (ప్రథమ శ్లోకము)*


*పితరావుపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమః|*


*మా భూదితి నిజాం మాయాం తతాన జనమోహినీమ్॥9999॥*

*శ్రీశుకుడు వచించెను* శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీవసుదేవులు తనను పరమేశ్వరునిగా భావించుచున్నట్లు గుర్తించెను. వారు అట్లు తలపోసినచో పుత్రవాత్సల్యానందములకు దూరమగుదురని తలంచి, ఆ ప్రభువు వారిపై జనులను మోహములో ముంచునట్టి తన యోగమాయను ప్రసరింపజేసెను.


*45.2 (రెండవ శ్లోకము)*


*ఉవాచ పితరావేత్య సాగ్రజః సాత్వతర్షభః|*


*ప్రశ్రయావనతః ప్రీణన్నంబ తాతేతి సాదరమ్॥10000॥*


యదువంశ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణభగవానుడు బలరామునితో గూడి తల్లిదండ్రుల చెంతకు చేరెను. పిమ్మట ఆ స్వామి వినమ్రుడై సాదరముగా 'అమ్మా', 'నాన్నా' అని సంబోధించి, వారిని సంతోషపఱచుచు ఇట్లు నుడివెను-


*45.3 (మూడవ శ్లోకము)*


*నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి*


*బాల్యపౌగండకైశోరాః పుత్రాభ్యామభవన్ క్వచిత్॥10001॥*


*45.4 (నాలుగవ శ్లోకము)*


*న లబ్ధో దైవహతయోర్వాసో నౌ భవదంతికే|*


*యాం బాలాః పితృగేహస్థా విందంతే లాలితా ముదమ్॥10002॥*


"తల్లిదండ్రులారా! మీ పుత్రులమైన మమ్ము మీ యుత్సంగములలో చేర్చుకొని, ఆనందించుచు, మమకారములను పంచి యిచ్చుటకై మీరు ఇంతవఱకును ఎంతో ఉత్కంఠితులై యుంటిరి. కాని మీరు మమ్ము ఎత్తుకొనుచు, దించుచు, లాలించుచు, పాలించుచు సంతోషపడెడి భాగ్యమునకు నోచుకొనరైతిరి. అట్లే దైవోపహతులమైన కారణముగా మేమును ఒకవిధముగా భాగ్యహీనులమే. ఏలయన, లోకములోని బాలురు తమ తల్లిదండ్రులయెదుట తారాడుచు, వారి ఒడులలో చేరి, నిండు ప్రేమాదరములతో ఆడుచు, పాడుచు హాయిగా పెఱిగి పెద్దవారగుచుందురు. ఆ అదృష్టమునకు మేము దూరమైతిమి.


*45.5 (ఐదవ శ్లోకము)*


*సర్వార్థసంభవో దేహో జనితః పోషితో యతః|*


*న తయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్యః శతాయుషా॥10003॥*


*45.6 (ఆరవ శ్లోకము)*


*యస్తయోరాత్మజః కల్ప ఆత్మనా చ ధనేన చ|*


*వృత్తిం న దద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి హి॥10004॥*


ధర్మార్థకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్థములకు సాధనమైన దేహమును ప్రసాదించు వారును, పోషించువారును తల్లిదండ్రులే. అట్టి మాతాపితరుల ఋణమును తీర్చుకొనుటకై మానవునకు యథార్థముగా నూఱేండ్లైనను చాలవు. శక్తియుండియు తన దేహముద్వారా, ధనాదులద్వారా తల్లిదండ్రులను సాదరముగా సేవింపనివాడు ఎంతయు నికృష్టుడు (నీచుడు). అట్టి దుష్టుడు మృతుడైన పిమ్మట యమదూతలు వాని శరీరమాంసమును వానిచేతనే తినిపింతురు.


*45.7 (ఏడవ శ్లోకము)*


*మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుమ్|*


*గురుం విప్రం ప్రపన్నం చ కల్పోఽబిభ్రచ్ఛ్వసన్ మృతః॥10005॥*


పూజ్యులైన తలిదండ్రులను, వృద్ధులను, సాధ్వియైన భార్యను, బాల్యావస్థలో నున్న కుమారులను, కుమార్తెలను, ఆరాధ్యుడైన గురువును, సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని, తనను ఆశ్రయించినవారిని, యథోచితముగా పోషింప సమర్థుడయ్యెను, ఆ విధముగా చేయనివాడు, ఈ లోకములో బ్రతికియుండియు, చచ్చినవానితో సమానుడే.


*45.8 (ఎనిమిదవ శ్లోకము)*


*తన్నావకల్పయోః కంసాన్నిత్యముద్విగ్నచేతసోః|*


*మోఘమేతే వ్యతిక్రాంతా దివసా వామనర్చతోః॥10006॥*

జననీ జనకులారా! దుష్ప్రవృత్తిగల కంసుని ఆగడముల కారణముగా మేము ఉద్విగ్నమనస్కులమై మీకు దూరముగా ఉండవలసి వచ్చుటచే మిమ్ము సేవింపలేకపోయితిమి. అందువలన ఇంతకాలము వ్యర్థముగా గడచిపోయినది.


*45.9 (తొమ్మిదవ శ్లోకము)*


*తత్క్షంతుమర్హథస్తాత మాతర్నౌ పరతంత్రయోః|*


*అకుర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్దుర్హృదా భృశమ్॥10007॥*


"అమ్మా! నాన్నా! దుష్టుడైన కంసుడు మిమ్ములను మిగుల ఇడుములపాలు చేసెను. ఐనను మేము పరతంత్రులమై యున్నందున కష్టస్థితిలో ఉన్న మిమ్ము ఆదుకొనలేక పోయితిమి. అందువలన మమ్ము క్షమింపుడు".


*శ్రీశుక ఉవాచ*


*45.10 (తొమ్మిదవ శ్లోకము)*


*ఇతి మాయామనుష్యస్య హరేర్విశ్వాత్మనో గిరా|*


*మోహితావంకమారోప్య పరిష్వజ్యాపతుర్ముదమ్॥10008॥*


*శ్రీశుకుడు వచించెను* విశ్వాత్ముడైనను, స్వసంకల్పముచే లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణునియొక్క మృదుమధుర వచనములకు మోహితులైన దేవకీవసుదేవులు తమ కుమారులను ఒడిలోనికి తీసికొని, అక్కున చేర్చుకొని పరమానందభరితులైరి.


*45.10 (పదకొండవ శ్లోకము)*


*సించంతావశ్రుధారాభిః స్నేహపాశేన చావృతౌ|*


*న కించిదూచతూ రాజన్ బాష్పకంఠౌ విమోహితౌ॥10009॥*


పరీక్షిన్మహారాజా! పుత్రప్రేమ కారణముగా వారు మోహితులై, ఆ మమకారములలో మునిగిపోయిరి. వారు ఆనందాశ్రువులచే తమ కుమారులను అభిషేకించిరి. ఆనందాతిరేకములో గద్గదకంఠులైన  ఆ దేవకీవసుదేవులు గొంతు పెగలక ఏమియు మాటాడలేకపోయిరి.


*45.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్ దేవకీసుతః|*


*మాతామహం తూగ్రసేనం యదూనామకరోన్నృపమ్॥16010॥*


కృష్ణభగవానుడు తల్లిదండ్రులను ఈ విధముగా ఓదార్చిన పిమ్మట మాతామహుడైన ఉగ్రసేనుని యదువంశీయులకు రాజుగా జేసెను.


*45.13 (పదమూడవ శ్లోకము)*


*ఆహ చాస్మాన్ మహారాజ ప్రజాశ్చాజ్ఞప్తుమర్హసి|*


*యయాతిశాపాద్యదుభిర్నాసితవ్యం నృపాసనే॥10011॥*


*45.14 (పదునాలుగవ శ్లోకము)*


*మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః|*


*బలిం హరంత్యవనతాః కిముతాన్యే నరాధిపాః॥10012॥*


పిమ్మట శ్రీకృష్ణుడు తన మాతామహునితో ఇట్లనెను - 'ఉగ్రసేనమహారాజా! మేము మీ ప్రజలము. మమ్ము నీవు ఆజ్ఞాపింపుము. యయాతి శాపకారణముగా యదువంశీయులు రాజసింహాసనముపై కూర్చుండుటకు (రాజ్యపరిపాలన చేయుటకు) అర్హులు కారు. ఐనను నేను కోరుచున్నాను గనుక, నీవు ఈ  సింహాసనమును అధిష్ఠించుటలో దోషములేదు. నేను భృత్యుడనై నిన్ను సేవించుచుందును గాన, ప్రముఖ దేవతలును వినమ్రులై నీకు కానుకలను సమర్పింతురు. ఇంక ఇతర రాజుల విషయము చెప్పనేల?


*45.15 (పదునైదవ శ్లోకము)*


*సర్వాన్ స్వాన్ జ్ఞాతిసంబంధాన్ దిగ్భ్యః కంసభయాకులాన్|*


*యదువృష్ణ్యంధకమధుదాశార్హకుకురాదికాన్॥10013॥*


*45.16 (పదహారవ శ్లోకము)*


*సభాజితాన్ సమాశ్వాస్య విదేశావాసకర్శితాన్|*


*న్యవాసయత్స్వగేహేషు విత్తైః సంతర్ప్య విశ్వకృత్॥10014॥*


పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు (శ్రీహరి) విశ్వసృష్టికి కారకుడు. కంసుని దురాగతములకు భయపడి నలుదిక్కులకు పాఱిపోయిన యదు, వృష్ణి, అంధక, మధు, దాశార్హ, కుకురాది వంశీయులైన తన బంధువులను అందఱిని ఆ ప్రభువు మథురకు పిలిపించెను. ఇంతవఱకును కాందిశీకులై విదేశములలో బిక్కుబిక్కుమనుచు తలదాచుకొనుచున్న వారినందఱిని సగౌరవముగా ఆహ్వానించి, ఆ స్వామి ఆత్మీయతతో ఓదార్చెను. పిమ్మట వారిని ధనాది సంపదలచే తృప్తిపఱచి, వారివారి గృహములలో నివసింపజేసెను.

 

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: