21, మే 2024, మంగళవారం

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము*


*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*45.17 (పదిహేడవ శ్లోకము)*


*కృష్ణసంకర్షణభుజైర్గుప్తా లబ్ధమనోరథాః|*


*గృహేషు రేమిరే సిద్ధాః కృష్ణరామగతజ్వరాః॥10015॥*


శ్రీకృష్ణబలరాముల అనుగ్రహముతో వారి మనస్తాపములు తీఱిపోయెను. మనోరథము లన్నియును ఈడేఱెను. ఆ నందకుమారుల బాహు బలచ్ఛాయలో వారు సురక్షితులై యుండిరి. అందువలన ఆ యదు ప్రముఖ వంశీయులందఱును తమ తమ గృహములలో హాయిగా నుండిరి.


*45.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*వీక్షంతోఽహరహః ప్రీతా ముకుందవదనాంబుజమ్|*


*నిత్యం ప్రముదితం శ్రీమత్సదయస్మితవీక్షణమ్॥10016॥*


శ్రీకృష్ణుని ముఖారవిందము చిఱునవ్వుల శోభలతో కలకలలాడుచుండెను. ఆ స్వామి చూపులలో కనికరము తొణికిసలాడుచుండును. అట్టి ఆహ్లాదకరమైన శ్రీకృష్ణుని ముఖకమలమును అనుదినము దర్శించుచు యదువంశీయులు ఎల్లరును ఉల్లాసముతో ఉండిరి.


*45.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తత్ర ప్రవయసోఽప్యాసన్ యువానోఽతిబలౌజసః|*


*పిబంతోఽక్షైర్ముకుందస్య ముఖాంబుజసుధాం ముహుః॥10017॥*


ఆ మథురానగరమునందలి వృద్ధులు సైతము తమ నేత్రముల ద్వారా శ్రీకృష్ణుని వదనమనెడి పద్మమునందలి మకరందా మృతమును పదేపదే తనివిదీర ఆస్వాదించుచు, తత్ప్రభావమున యువకులవలె జవసత్త్వములు గలిగి తేజరిల్లుచుండిరి.


*45.20 (ఇరువదియవ శ్లోకము)*


*అథ నందం సమాసాద్య భగవాన్ దేవకీసుతః|*


*సంకర్షణశ్చ రాజేంద్ర పరిష్వజ్యేదమూచతుః॥10018॥*


పరీక్షిన్మహారాజా! పిమ్మట కృష్ణభగవానుడు , బలరాముడు నందగోపునిజేరి, ఆయనను కౌగలించుకొని, ఇట్లునుడివిరి.


*45.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*పితర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ భృశమ్|*


*పిత్రోరభ్యధికా ప్రీతిరాత్మజేష్వాత్మనోఽపి హి॥10019॥*


*45.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*స పితా సా చ జననీ యౌ పుష్ణీతాం స్వపుత్రవత్|*


*శిశూన్ బంధుభిరుత్సృష్టానకల్పైః పోషరక్షణే॥10020॥*


*45.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*యాత యూయం వ్రజం తాత వయం చ స్నేహదుఃఖితాన్|*


*జ్ఞాతీన్ వో ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖమ్॥10021॥*


"తండ్రీ! నీవును, తల్లి యశోదయు, మిగుల ప్రేమ వాత్సల్యములతో మమ్ము లాలించి, పోషించితిరి. మాతాపితలు తమ సంతానమును ప్రాణములకంటెను మిన్నగా చూచుకొందురు. అందు ఏమాత్రమూ సందేహము లేదు. కన్న తల్లిదండ్రులను, తదితర బంధువులును తమ శిశువులను పోషించుటకును, రక్షించుటకును (లాలన, పాలనలకు) వీలుకాని పరిస్థితులలో వదలివేసినప్పుడు, వారిని చేరదీసి ప్రేమాదరములతో పెంచి పోషించినవారే, నిజమైన తల్లిదండ్రులు. నాయనా! ఇక మీరు వ్రజభూమికి వెళ్ళిరండు. మేము మీ యెడల లేనందున మీరు మిక్కిలి బెంగపడుదురను మాట వాస్తవమే. అందువలన మేమును ఇక్కడి బంధుమిత్రులకు ఆత్మీయతతో సుఖసంతోషములను గూర్చిన పిదప, మారాకకై అనుక్షణము నిరీక్షించుచు తపనపడుచుండెడి మీ అందఱిని చూచుటకై అక్కడికి మేము తప్పక వత్తుము".


*45.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*ఏవం సాంత్వయ్య భగవాన్ నందం సవ్రజమచ్యుతః|*


*వాసోఽలంకారకుప్యాద్యైరర్హయామాస సాదరమ్॥10022॥*


కృష్ణభగవానుడు నందునకును, తదితర వ్రజవాసులకును ఈ విధముగా ఊఱటగూర్చి, వస్త్రాభరణములను, కంచుపాత్రలను సమర్పించి, వారిని సాదరముగా పూజించెను.


ఈ శ్లోకములో *కుప్యము* అనగా బంగారము, వెండి తప్ప కంచు మొదలగు ఇతర లోహములు అని తెలియగలము.


*45.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*ఇత్యుక్తస్తౌ పరిష్వజ్య నందః ప్రణయవిహ్వలః|*


*పూరయన్నశ్రుభిర్నేత్రే సహ గోపైర్వ్రజం యయౌ॥10023॥*


శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట నందుడు బలరామకృష్ణులను ఆత్మీయతతో అక్కున జేర్చుకొని, వారిని మథురలో విడిచిపెట్టి వెళ్ళుటకు మనస్సొప్పక మిగుల బాధతో కంటతడిబెట్టెను. ఎట్టకేలకు వారిని వీడ్కొని, తోడి గోపాలురతో గూడి వ్రజభూమికి బయలుదేఱెను.


*45.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*అథ శూరసుతో రాజన్ పుత్రయోః సమకారయత్|*


*పురోధసా బ్రాహ్మణైశ్చ యథావద్ద్విజసంస్కృతిమ్॥10024॥*


పరీక్షిన్మహారాజా! అనంతరము వసుదేవుడు గర్గమహర్షి మొదలగు బ్రాహ్మణులచేత బలరామకృష్ణులకు యథావిధిగా ఉపనయన సంస్కారములను జరిపించెను.


*45.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తేభ్యోఽదాద్దక్షిణా గావో రుక్మమాలాః స్వలంకృతాః|*


*స్వలంకృతేభ్యః సంపూజ్య సవత్సాః క్షౌమమాలినీః॥10025॥*


అనంతరము వసుదేవుడు గర్గాది విప్రోత్తములను గంధపుష్పాక్షతలతోడను, వస్త్రాభరణములతోడను అలంకరించి, వారికి దూడలతోగూడిన పాడియావులను, దక్షిణలను సమర్పించెను. ముందుగా ఆ గోవులు పట్టువస్త్రములతోడను, సముచితమైన బంగారు హారములతోను అలంకరింపబడినవి.


*45.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*యాః కృష్ణరామజన్మర్క్షే మనోదత్తా మహామతిః|*


*తాశ్చాదదాదనుస్మృత్య కంసేనాధర్మతో హృతాః॥10026॥*


ఇదివఱలో కంసుడు వసుదేవుని గోసంపదను అన్యాయముగా లాగుకొనియుండెను. బలరామకృష్ణులు జన్మించినప్పుడు ప్రజ్ఞాశాలియైన (ధర్మబుద్ధిగల) వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానములను చేయుటకు సంకల్పించి యుండెను. ఆ సంకల్పమును అనుసరించి, కంసుని మరణముతో తనకు స్వాధీనమైన ఆ గోవులను ఇప్పుడు భూసురోత్తములకు దానము చేసెను.


*45.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*తతశ్చ లబ్ధసంస్కారౌ ద్విజత్వం ప్రాప్య సువ్రతౌ|*


*గర్గాద్యదుకులాచార్యాద్గాయత్రం వ్రతమాస్థితౌ॥10027॥*


యదువంశమునకు ఆచార్యుడైన (పురోహితుడైన) గర్గమహర్షిచే జరిపింపబడిన ఉపనయన సంస్కారముల ద్వారా బలరామకృష్ణులకు ద్విజత్వము ప్రాప్తించెను. ఆ మహామునినుండి గాయత్రీ మంత్రోపదేశమును పొందిన పిమ్మట ఆ సోదరులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింపదొడగిరి.


*45.30 (ముప్పదియవ శ్లోకము)*


*ప్రభవౌ సర్వవిద్యానాం సర్వజ్ఞౌ జగదీశ్వరౌ|*


*నాన్యసిద్ధామలజ్ఞానం గూహమానౌ నరేహితైః॥10028॥*


*45.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*అథో గురుకులే వాసమిచ్ఛంతావుపజగ్మతుః|*


*కాశ్యం సాందీపనిం నామ హ్యవంతిపురవాసినమ్॥10029॥*


బలరామకృష్ణులు సకల విద్యలకును నిధానములు. వారు జగద్గురువులు, సర్వజ్ఞులు. వారి జ్ఞానము స్వతస్సిద్ధమైనది, లోకోత్తరమైనది. ఐనను, వారు లోకమర్యాదను అనుసరించి, సామాన్యులవలె ప్రవర్తించుచు తమ దివ్యలక్షణములను బయటపడనీయకుండిరి. అంతట వారు గురుకులమునందు విద్యాభ్యాసము చేయుటకై ఇష్టపడిరి. అందువలన ఆ సోదరులు అవంతీపుర (ఉజ్జయిని) వాసియు, కాశ్యప గోత్రజుడును అగు *సాందీపని* అను గురువు కడకు చేరిరి.


*45.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యథోపసాద్య తౌ దాంతౌ గురౌ వృత్తిమనిందితామ్|*


*గ్రాహయంతావుపేతౌ స్మ భక్త్యా దేవమివాదృతౌ॥10030॥*


పిదప ఆ రామకృష్ణులు సంప్రదాయప్రకారము గురువును ఆశ్రయించిరి. జితేంద్రియులై, లోకమునకు ఆదర్శప్రాయముగా ప్రవర్తించుచుండిరి. వారు గురువును దైవసమానునిగా భక్తిశ్రద్ధలతో సేవించుచు, గురువుయొక్క ఆదరాభిమానములకు పాత్రులైరి.

 

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: