21, మే 2024, మంగళవారం

విశ్వనాథ సత్యనారాయణగారి

 విశ్వనాథ సత్యనారాయణగారి ఇల్లు



విజయవాడ మారుతీనగర్ లో ఉన్న విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు ఫొటోలో చూడవచ్చు. ఆ ఇల్లు అయన 1959 లో కట్టుకున్నారని సమాచారం. ఆయన 1976లో మరణించేవరకూ ఈ ఇంట్లోనే ఉన్నారు.


వారి కుటుంబ సభ్యులు ఈ ఇంటిని "విశ్వనాథ మ్యూజియం" గా తీర్చిదిద్దారని, నిర్ధారిత రోజుల/సమయాలలో సందర్శకులను అనుమతిస్తున్నారని తెలిసింది. 


నా చిన్నతనాలలో, సంవత్సరం సరిగ్గా గుర్తు లేదు, 7-8 తరగతులు చదువుతుండగా అనుకుంటాను, వారి శిష్యుడు అయిన మా మేనమామగారితో వాళ్ళింటికి వెళ్ళిన జ్ఞాపకం. అప్పుడప్పుడే పుస్తకాలు చదవటం మొదలు పెట్టిన రోజులవి. ఆయన "వేయిపడగలు" నవల వ్రాసినట్టు తెలుసు. అందుకని, సాహసించి ఆయన్ను మీ వేయిపడగలు నవల ఎక్కడ దొరుకుతుంది అని అడిగాను. దానికి ఆయన నా తలమీద చిన్నగా కొట్టి, ఆ నవల చదవగలవురా నువ్వు, మరికొన్నాళ్ళు ఆగి చదువు అన్నారు. అలా ఆయన చెప్పినట్టే, దాదాపుగా ఒక దశాబ్దం తరువాత, 1978లో ఆ నవల చదివాను. అప్పటికి ఆయన కీర్తిశేషులు అయ్యారు.


ఈ జ్ఞాపకం ఎందుకు వ్రాశాను అంటే, వారి ఇల్లు అప్పుడు ఎలా ఉన్నదో, ఇప్పటికీ అలాగే ఉన్నది.


విశ్వనాథవారు 18 నవంబరు, 1976న గుంటూరులో మరణించారు. మరునాడు వారి భౌతికకాయం వారింటికి తీసుకువచ్చారని తెలిసి, కొంతమంది విద్యార్ధులం వారింటికి వెళ్ళి వారి అంతిమయాత్రలో పాల్గొన్నాము. 


ఇక్కడ మరొక జ్ఞాపకం పంచుకోవాలి. విశ్వనాథ వారు మరణించారన్న సమాచారం తెలిసి, మా కాలేజీ ప్రిన్సిపాల్ గారి వద్దకు కొందరం విద్యార్ధులం వెళ్ళి, అంత పెద్దాయన వెళ్ళిపొయ్యారు, వారి గౌరవార్ధం కాలేజి శలవ ప్రకటించమని అడిగాము. అప్పట్లో ఎమర్జెన్సీ అమలులో ఉన్నది, పైగా మా ప్రిన్సిపాల్ గారు కట్టర్ ఆర్ ఎస్ ఎస్, ఆయన మీద నిఘా ఉండే అవకాశం ఉన్నది. అందుకనో మరేమో తెలియదు, ఆయన అంతా విని, ఒరే అబ్బాయిలూ (అప్పటికి మాది కేవలం బాయ్స్ కాలేజి), నాకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం. కాకపోతే, ఇప్పుడు కాలేజి శలవ ప్రకటించాలి అంటే ఎమర్జెన్సీ కాబట్టి, కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. కారణం మీరందరూ వచ్చి అడిగారని చెప్పాలి. వాళ్ళు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో తెలియదు. కాబట్టి, ఒక పని చేస్తాను, వారి అంతిమ దర్శనం చేసుకోవాలి అనుకునేవారికి మొదటి పిరియడ్ అవ్వంగానే (మాది షిఫ్ట్ కాలెజి కాబట్టి మొదటి అవర్ ఉదయం 8:10 కి అయ్యేది)అనుమతి ఇస్తున్నాను అన్నారు. ఈ వార్త క్షణాల్లో కాలేజీ అంతా పాకి, అందరూ ఆ సాకుతో వెళ్ళిపొయ్యారు. నిజంగా విశ్వనాథ వారిని చూద్దామనుకున్న ఒక 20-30 మంది(నాతో కలిపి) వారింటికి వెళ్ళి వారి అంతిమ యాత్రలో పాల్గొన్నాము.  


అప్పుడు వారి ఇల్లు చూడటమే, ఇక ఆ తరువాత మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు అదే ఇంటిని వారి మ్యూజియం గా మార్చారని తెలిసి, ఒకసారి చూసి రావాలని ఉన్నది.


మారుతీనగర్ లో లెదా ఆ దగ్గరలో ఉన్న మన గ్రూపు సభ్యులు "విశ్వనాథ మ్యూజియం" సందర్శించి లోపలి ఫొటొలు, మ్యూజియం సందర్శనా సమయాలు వగైరా వివరాలతో ఒక సమగ్ర వ్యాసం వ్రాసి పోష్ట్ చేస్తే ఎంతయినా బాగుంటుంది. ఇది ఒక ఆశ. మన గ్రూపు సభ్యులు ఎవరన్నా ఈ ఇనిషియేటివ్ తీసుకుని, చక్కటి వ్యాసం ఫొటోలతో సహా త్వరలో వ్రాస్తారని ఆశిస్తూ ముగిస్తాను.


(ఫొటో సాక్షి పత్రిక వారి సౌజన్యం)

కామెంట్‌లు లేవు: