30, జూన్ 2024, ఆదివారం

వాగ్భూషణం భూషణం*

*వాగ్భూషణం భూషణం*


సభ్యులకు నమస్కారములు.


మధురంగా మాట్లాడడం ఒక కళ. ఆలా మాట్లాడగలగడమే మనిషికి అసలైన అలంకారము. సందర్భోచితంగా ఎదుటి వారి మనసు గాయపడకుండా మాట్లాడడం గొప్ప లక్షణం.


అందుకే లోకంలో ఇంపుగా మాట్లాడే వారిని ప్రజలు ప్రశంసిస్తారు. మేలు చేసేదే అయినప్పటికీ, వినడానికి కఠోరంగా ఉండే మాటలను ప్రజలు  మనః పూర్వకంగా అంగీకరించరు. కఠిన భాష అనర్థ దాయకమే గాక కార్యభంగము, పరాభవానికి కారణమవుతుంది.


మాటల చేత దేవతలు వరాలిస్తారనీ, రాజులు తమను ఆశ్రయించిన వారిని, వారి మాటల ఆధారంగానే ఆదరిస్తారని, మధురమైన మాటల చేతనే వనితా మణులు వశవర్తులవుతారనీ, వినయ మధురంగా మాట్లాడడం చేతగాని వారికి ఇబ్బందులు కల్గుతాయని ప్రతీతి.


రాజసూయ యాగ సమయములో శ్రీ కృష్ణుని నిందిస్తున్న శిశుపాలునికి ధర్మరాజు చేసిన హిత బోధ ఇది.

*భూరి గుణోన్నతులనదగు వారికి, ధీరులకు, ధరణి వల్లభులకు వాకారుష్యము చన్నే, మాహా దారుణమది విషము కంటే దహనము కంటెన్*.


శిశుపాలా! గొప్ప గుణముల చేత ఉన్నతులైన వారికి, ధీరులకు, రాజులకు కఠినంగా మాట్లాడడం తగునా, వాక్పారుష్యము విషము కంటే, అగ్ని కంటే దారుణమైనది కదా.


*మానవులకు శాస్త్ర సంస్కారమైన మాటలే భూషణాలు గాని, భుజ కీర్తులు, సువర్ణాభరణాలు, అంగలేపనాలు శోభను కలిగించవని భర్తృహరి చెప్పాడు*.


మధురమైన వాక్కులకు మన పురాణాలలో గొప్ప ఉదాహరణ ఆంజనేయ స్వామి. మారుతి చతుర్వేద విజ్ఞాన సంపన్నుడు, వాక్యకోవిదుడైనందున  ఒక్క అప శబ్దము లేకుండా సీతమ్మ తల్లికి సవినయంగా అన్ని వాస్తవాలు వివరించ గలిగాడు. 


శ్రీ రామ, లక్ష్మణులతో శ్రీ హనుమ మాట్లాడిన మాటలను శ్రీ రామచంద్రుల వారు ఎంతగానో మెచ్చుకున్నారు.


శ్రీ ఆంజేయస్వామి సమస్త (నవ) వ్యాకరణ శాస్త్ర ప్రవీణుడు. మాట్లాడేటప్పుడు శరీర వికారాలు లేకుండా,  అటు గంభీర స్వరంతో కాకుండా, మధ్యమ స్వరంతో మధురంగా సంభాషిస్తాడు.


చివరిగా....

*జిహ్వగ్రే వర్త తే లక్ష్మిః, జిహ్వాగ్రే మిత్ర బoధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధృవం*.


మన మాట వల్లనే సంపదలు లభిస్తాయి, మిత్రులు బంధువులు చేరుతారు, మాటల ప్రభావము వల్లనే బంధన ప్రాప్తి కలుగుతుంది. *ఒక్కొక్కప్పుడు మాటల వలననే ప్రాణ హాని కూడా కలుగుతుంది*.


కాబట్టి ఎప్పటికైనా మృదుమధురంగా మాట్లాడడం లాభ మరియు క్షేమకరము.

*ముఖ్యంగా ఈ కలి యుగంలో వాకారుష్యము కూడనే కూడదు*


ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: