శు భో ద యం!!🙏
పెద్దన యాశీస్సులు
------------------------------
శా: " శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా
దేవిం దత్కమలా సమీపమున బ్రీతిం నిల్పినాడో యనం
గా వందారు సనందనాది నిజ భక్త శ్రేణికిం దోచు రా
జీవాక్షుండుఁ గృతార్ధు సేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్
మను చరిత్రము కావ్యారంభమున కృతిభర్త యగు శ్రీకృష్ణరాయ సార్వ భౌమునకు పెద్దన యెసఁగు
ఆశీర్వచనము.
ఆది లక్ష్మియు శ్రీహరియు సరసములలో దేలుచుండ నామె వక్షోజములకు అలంకరించుకొనిన కస్తూరి
శ్రీహరి వక్షస్థలమున నంటినది. అది జూచి సనక సనందనాది మునులు ఆహా! శ్రీహరి యెంతగొప్పవాడు! శ్రీ దేవితో సమముగా భూదేవికి గూడ సముచిత స్థానమునొసంగినాడనుచు మురియుచు వందనముల నొనరింప సంతసమున
విలసిల్లు ఆహరి దయాళువై కృష్ణరాయలను శుభదృష్టితో జూచి యనుగ్రహించుగాక!
అనిదీని తాత్పర్యము!
శ్రీదేవి విష్ణువక్షస్థల నివాసి. భూదేవికి ఆభాగ్యములేదు. ఇపుడీ కస్తురి పూతలు జూడ ఆమెకుగూడ హరి తనహృదయమున నివాస మేర్పరచెనా ?యను భ్రాంతిని సనందనాదులకు కలిగించినది.కావున భ్రాంతిమంత
మను నలంకారము ఇందుకలదు.
కృతిభర్త రాయల కిరువురు భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి,లు. వారిరువురను శ్రీహరివలెనీవు సమముగా నేలి దక్షిణ నాయకుడ వనిపించు కొందువుగాక! యని రాయల కుపదేశము (వ్యంగ్యము)
నావిష్ణుః పృధివీపతిః"- అను న్యాయముచే ప్రభువుకూడా విష్ణువుతో సమానుడే! విష్ణువు ,జగత్పోషకుడు. రాయలుకూడ జగద్రక్షకుఁడై వర్ధిల్లవలెనని భావము.
శ్రీదేవి కలిమిచే భాగ్యము, భూదేవి కలిమిచే పంటల ,సమృధ్ధితో నొప్పుదువుగాక యని యాశీస్సు!
ఈవిధముగా "ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశోవాపి తన్ముఖమ్" అను నాలంకారిక సూత్రాను సారముగా ఆశీర్వాద పురస్సరముగా పెద్దనగారు మనుచరిత్రమును ప్రారంభించినారు.
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి