గణిత జ్యోతిష్యము
అనగనగా 'భాస్కరాచార్యుడు' అనే పేరు గల గణితశాస్త్రవేత్త ఉండేవాడు.
నేడు మనం చదువుకునే గణితశాస్త్రాన్ని, అందునా విశేషించి బీజగణితాన్ని (ఆల్జీబ్రా) అందరికీ అర్థమయ్యే తీరులో ఎప్పుడో రాసినవాడు ఈ భాస్కరాచార్యుడే.
ఈయన రాసిన లెక్కల గ్రంథం పేరు 'లీలావతీ గణితం'. సహజంగా గ్రంథ కర్తగా ఎవరుంటే వారిపేరునే ఆ గ్రంథానికి పెట్టడాన్ని మనం చూస్తాం. ఇక్కడ భాస్కరాచార్యుడు తన గణిత గ్రంథానికి, తన పేరుని కాక తన కూతురైన లీలావతి పేరుని పెట్టడం వెనుక ఒక విషాదాత్మక కథ ఉంది. వివరంగా చూద్దాం..
గణిత శాస్త్రంలో మహాపండితుడైన భాస్కరాచార్యుడు, జ్యోతిష శాస్త్రానిక్కూడా ప్రాణం వంటిదైన గణితం ద్వారా జ్యోతిషశాస్త్రాన్ని ఆపోశన పట్టడమే కాక-తనకు ఒక్కగానొక్క కూతురైన లీలావతి పుట్టిన సమయాన్ని బట్టి ఆమె జాతకాన్ని స్వయంగా పరిశీలించి- అవాక్కైపోయాడు.
'తన కూతురికి వివాహమైన మర్నాడే విధవరాలయ్యే యోగం' జ్యోతిషం బట్టి సుస్పష్టంగా కన్పిస్తోంది.
'ఎలా ఈ కష్టాన్ని దాటాలి' అని తీవ్రంగా ఆలోచించాడు భాస్కరుడు. పండితులందరితోనూ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి, ఏ ముహూర్తంలో పెళ్లిని చేస్తే లీలావతికి ఏవిధంగానూ వైధవ్యయోగం పట్టనే పట్టదో, అలాంటి ముహూర్తాన్ని నిర్ణయించి పెళ్లి చేసాడు కూడ.
అయితే భాస్కరాచార్యుని పాండిత్యాన్ని సవాలు చేస్తూ పెళ్లి అయిన మర్నాడే ఆమె విధవరాలయింది. భాస్కరాచార్యునికి తీవ్ర మనస్తాపం కల్గింది.
తన పుత్రికా, తన విద్యాప్రతిభా రెండూ ఓడిపోవడంతో, భాస్కరాచార్యుడు మహానిరాశకు గురై, అసలు జ్యోతిషశాస్త్రమే ప్రమాణం కాదనే విధంగా కొత్త పుస్తకాన్ని వ్రాయ సంకల్పించాడు
ఇంతలో తోటి పండితులంతా వచ్చి భాస్కరా! అసలు శాస్త్రమే అబద్ధమై యుంటే శాస్త్రం ప్రకారమే నిర్ణయించిన వైధవ్యం కూడ అసత్యమే కావాల్సి ఉంది కాని వైధవ్యం వఱకూ సరిగా ఎందుకు జరిగింది, ఈ కారణంగా లీలావతి పెళ్లి, శాస్త్రం ప్రకారం సరైన సమయానికి జరిగి ఉండకపోవచ్చని మాకు అనిపిస్తోంది. అంతేకాదు, పెళ్లికి వాడిన ఇసుక గడియారంలో కూడ ఏదో లోపం ఉండవచ్చేమో నని ఏకగ్రీవంగా తీర్మానించారు.
సమయం ఇంతయిందని నిర్ణయించేందుకు వీలుగా ఆ రోజుల్లో ఇసుక గడియారాలుంటూండేవి.
క్రింద సన్నని రంధ్రం ఉన్న పెద్ద గాజు పాత్రలో జల్లించిన ఇసుకని పోసేవారు. ఆ పాత్రకి క్రిందుగా మరో గాజుపాత్రని ఉంచేవారు. క్రింది పాత్రలోనికి, పైపాత్ర నుండి సన్నగా జారిపడిన ఇసుక ఎత్తుని బట్టి, కాలాన్ని ఘడియ విఘడియ, లిప్తలనే ఆనాటి తీరు కాలమానంలో గుర్తించేవారు.
కింద ఉన్న ఆ గాజుపాత్ర బయటివైపున ఈ విధంగా కాలాన్ని ఎవరైనాసరే గుర్తించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేకమైన అడ్డగీతలుండేవి. ఈ ఇసుక గడియారం వద్ద తన కూతురి పెళ్లి రోజున సరిగా సమయాన్ని చెప్పవలసిందని గట్టిగా చెప్పి, తన మేనమామనే కూచోబెట్టాడు భాస్కరుడు.
ఇసుకని సరిగా జల్లించని కారణంగా ఒక సందర్భంలో ఒక రేణువు పైపాత్ర రంధ్రానికి అడ్డుపడి ఇసుకని పడకుండా ఆపింది. రెండు మూడు నిమిషాల పిమ్మట ఈ విషయాన్ని గుర్తించిన తన మేనమామ, పైపాత్రని కదిపి సరిచేసాడు. అయితే ఈ సమయానికి ఇంతటి ప్రాధాన్యముందనే విషయాన్ని భాస్కరుడు ఎవరికీ వివరించి చెప్పలేదు. కనీసం ఈ మేనమామకి కూడా, దాని క్కారణం కూతురి వైధవ్యాన్ని గురించి ముందే చెప్తే, ఆ మాట ఆనోటా ఆనోటా పాకి అది ఏవిధంగా పరిణమిస్తుందోనని చెప్పలేకపోయాడు. విషయమేమిటని మేనమామని గుచ్చిగుచ్చి ప్రశ్నించేసరికి ఇసుక గడియారం కొన్ని క్షణాలు ఆగిందన్న నిజాన్ని చెప్పనే చెప్పాడు.
భాస్కరాచార్యునికి ఒక పక్క తన శాస్త్రం నిజమైందేనని పరీక్షలో తేలినందుకు సంతోషమూ, మఱోపక్క తన కూతురి జీవితం బుగ్గిపాలయి నందుకు ఆపుకోలేని దుఃఖమూ ఒకేసారి కలిగాయి.
ఆ కష్టంలో భాస్కరుడన్న మాట ఒకటే-
'కాల సర్వేశ్వరాధీన' ఎంతగా ప్రయత్నించినా ఎంత అడ్డుకున్నా పరమేశ్వరుని నిర్ణయానికి మార్పూ మఱో తీర్పూ లేదనీ కాలం ఆయనకి అనుగుణంగానే పనిచేస్తుందనీను.
అవశ్యం భావిభావానాం
ప్రతీకారో భవే ద్యది।
తదా దు:ఖైర్న సీదేయుః
నలరామ యుధిష్ఠిరా...
రాబోయే కష్టాలని తమ మానవ సహజమైన తెలివితేటలతో దాటాలని నలుడూ, రాముడూ, ధర్మరాజూ... ఇలా ఎవరూ ఏనాడూ ప్రయత్నించి ఉండలేదు.
కారణం, విధి ప్రకారం అనుభవించాల్సిన యోగం ఉండగా, మానవ ప్రయత్నం ఎంత చేసినా ప్రయోజనం ఉండనే ఉండబోదని తెలిసి.
ఇలా ఆలోచించి తన దుఃఖాన్ని తీర్చుకొనేందుకూ, తన పుత్రికకి ఊరట కలిగేందుకూ భాస్కరాచార్యుడు తన శాస్త్ర పరిజ్ఞానాన్ని తన కూతురు లీలావతికి చెప్తూ ఆమె పేరిటే 'లీలావతి గణితమ' నే గ్రంథాన్ని వ్రాసి శాశ్వతుడయ్యాడు.
కాబట్టి ఈ గ్రంథానికి పేరు పెట్టడం వెనక ఇంతటి బాధామయగాథ ఉందన్నమాట.
చాల శ్లోకాల చివరలో 'ఓ లీలావతీ ఈ లెక్కకి సమాధానమెంతో చెప్పు - లీలావతీ ! నీకు దీని సమాధానం తెలుసా? ఆలోచించు లీలావతీ ! ' అనే అర్థం వచ్చేలా,
‘లీలావతి! ప్రోచ్యతామ్!
హే! లీలావతి! జ్ఞాయతే ?...'
అంటూ వ్రాసాడు. దీనిక్కారణం అమె బాధని తనదిగా అనుభవిస్తూ, అమెకి ఊరటని కలిగించదలచుకోవడమే.
నేటి కాలపు బీజగణితం, రేఖాగణితం (జ్యామెట్రీ) ట్రిగనామెట్రీ, మెన్సురేషన్లే కాక, ఘాతమూలం (Cube -root) కనుక్కొనే విధానాన్ని మొదటగా చెప్పినవాడు కూడ భాస్కరాచార్యుడే. అయితే నాటి కాలపు లెక్కల ద్వారా లెక్కలు మాత్రమే కాక, సాహిత్యపు మాధుర్యం కూడ విద్యార్థికి తెలుస్తుండేవి.
ఎంతైనా ఈ శాస్త్రాన్ని వ్రాసింది ఒక మహాకవి కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి