14, ఆగస్టు 2024, బుధవారం

మత్స్యావతారము

 మత్స్యావతారము


ఆతడుం డతులిత హరినిష్ఠతోడ 

నశనంబుగా నీరె నరయ గ్రోలుచును 

నొనరంగ నిష్ఠతో నొకయేటితటిని

గావించు చుండెను గాఢమౌతపము 


'కృతమాలిక'నియడా యేటిలో నిలిచి 

యత్యంత నిష్ఠతో నవనినాథుండు 

సల్పుచు న్నుండెను జలతర్పణంబు. 

అత్తరి యవనీశు డాశ్చర్య మొంద 

దోచె మీనొక్కటి దోసిలియందు.  

ఆ చేపపిల్లనా యధిపతిగాంచి 

నులికె నత్యంతగా నొడలెల్ల కదల. 

సత్యవ్రతుండంత సలిలంబులోకి 

ఝషమును దానిని జాలితో విడచె.


ఆరీతి విడివడి యంభశ్చరంబు 

మగిడి నీటిని జేరె మారాజు కతన.

జలచర పోతంబు జనపతి తోడ 

నయ్యడ నిట్లనె నభ్యర్థనమున 

"నరనాథ !వినవయ్య నా దీన గాథ

దయలేక వదలకు దక్కిన నన్ను 

చిరుమీనులనుబట్టి చేరియు జంపు 

జ్ఞాతి ఘాతకులైన ఝషములు పెక్కు 

పాపవర్తనులౌచు బ్రతికుదు రిచట.

పాపజాతి ఝషపు పాలన బడక 

తప్పించు కొనుటకై దారిని వెదికి 

నీ దోసి టందున నేజేరి యుంటి 

అరయ రక్షించక నార్తినౌ నన్ను 

దయమాలి విడుతువే దారుణంబుగను !

నట్టేటికిని మఱల నెట్టంగ తగునె! 

ఆపదొండు గలదు నంతియే గాక 

వేటాడు జాలర్లు యేటికి వచ్చి 

వదలక మామీద వలలని పన్ని 

యేఱంత కెలికియు యెఱలను బెట్టి 

గట్టిగా బట్టేరు కడు లాఘవమున

మిడిసిపోనీకను మెడపట్టుకొనిన 

యపుడెందు బోదును యనఘుడా ! నేను 

ఝషములు వేటాడి జాలి చూపకను 

పట్టినన్ సులువుగా భక్షించ గలవు 

జాలించుకను లేక జాలర్లు నన్ను 

పట్టియు సులువుగా భక్షించ గలరు 

ఇరు యాపదలనుండి వెఱగు జూపించి 

రాగంబుతో నన్ను రక్షింపు మిపుడు 

ప్రక్షీణులను గావ భాగ్యంబు గలుగు "

మత్స్య మారీతిగా మాట్లాడి నంత 

సత్త్వ శోభితుడైన సత్యవ్రతుండు 

కరుణతో దానిని కాపాడ దలచె. 


✍️గోపాలుని మధుసూదనరావు

కామెంట్‌లు లేవు: