*బ్రాహ్మణులకు ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకోకూడదు*
ఒక బ్రాహ్మణునికి దానంగా ఇచ్చిన దానిని తిరిగి వెనక్కి తీసుకోవడం మహా పాపం.
దీనికి సంబంధించిన ఒక కధ శ్రీమద్భాగవతంలో ఉన్నది.
ఒకప్పుడు నృగ మహారాజు ఉండేవాడు. అతను ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. ఈయన బ్రాహ్మణులకు అనేక ఆవులను కానుకగా ఇచ్చేవాడు.
ఒకానొక సమయం లో ఆయన ఒక బ్రాహ్మణునకు కానుకగా ఇచ్చిన గోవును ఒకానొక అనుకోని సందర్బంలో మరొక బ్రాహ్మణునకు ఇవ్వటం జరిగింది. ఆ గోవు తిరిగి కొత్త గోమందలో ఎలా కలిసిందో కలిసిపోయింది. అయితే ఆ రాజుకు ఈవిషయం తెలియదు. రెండో బ్రాహ్మణునకు కానుకగా ఇచ్చిన తరువాత ఆ ఆవును మొదటగా కానుకగా పొందిన ఆ తొలిబ్రాహ్మణుడు ఆ ఆవు తనకు చెందిందని పేర్కొన్నాడు. అప్పుడే కానుకగా పొందిన ఆ బ్రాహ్మణుడు కూడా "అది నాది" అని వాదించటం ప్రారంభించాడు.
ఇద్దరి వాదన విన్నరాజు, ఇద్దరికీ ఎక్కువ గోవులను ఇస్తానని ఆ బ్రాహ్మణులకు సర్ది చెప్పి, తగాదాను విడిచి పెట్టమని వారిని ప్రార్ధించాడు. కానీ వారు రాజుగారి విన్నపాన్ని పట్టించుకోలేదు.
కొన్ని రోజుల తర్వాత ఆరాజు మరణించాడు. ఒక బ్రాహ్మణుని ఆస్తిని తీసుకున్న పాపం దృష్ట్యా తెలియకుండానే అతను ఒక పెద్ద కొండ చిలువగా జన్మించాడు. ఒక రోజు అక్కడ ఆడుకోవడానికి వచ్చిన శ్రీకృష్ణుడి పిల్లలు ఆ పాముని చూసి బయటకు తీసుకురావటానికి ప్రయత్నించారు. కానీ వారు ఆపని చేయలేక పోయారు. వారు ఈ విషయాన్ని తమ తండ్రికి చెప్పారు. క్షణంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆ కొండచిలువని బయటకు తీసాడు. శ్రీకృష్ణుని హస్తస్పర్శ కారణంగా పాము శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన అసలు రూపాన్ని పొందినది.అతను పాముగా ఎలా అయ్యాడు? అని అడిగితే అతను తన కథను శ్రీ కృష్ణునికి చెప్పాడు.
ఆ కధ విన్న శ్రీకృష్ణుడు తన ప్రజలను పిలిచి ఎట్టి పరిస్థితులోనూ ఒక బ్రాహ్మణునకి కానుకగా ఇచ్చిన దానిని గానీ, దానంగా ఇచ్చిన దాన్ని దానిని తిరిగి వెనక్కు తీసుకోకూడదు అని ఆదేశించాడు.
కాబట్టి ఒకసారి ఇచ్చిన దానిని ఎవ్వరూ వెనక్కి తీసుకోకూడదు. అలాగే ఒకరి సొత్తుని మరొకరు కాజేయడకూడదు అని ఈ పురాణ కధ ద్వారా స్పష్టమగుచున్నది.
--- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహా స్వామివారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి