శు భో ద యం🙏
విఫల ప్రయత్నం!
శా: తృష్ణాతంతు నిబధ్ధ బుధ్ధులయి రాధేయాదులం గూడి శ్రీ
కృష్ణుం గేవల మర్త్యుగాఁ దలచి ,బంధింపంగ నుత్సాహ వ
ర్ధిష్ణుండయ్యె , సుయోధనుం డకట! ధాత్రీనాధ! యూహింపుమా?
ఉష్ణీషంబున గట్టవచ్చునె ?మదవ్యూఢోగ్ర శుండాగ్రమున్ ;
- అధర్వణ భారతము.- ఉద్యోగ పర్వము- అధర్వణుడు;
అర్ధములు:- తృష్ణాతంతువు- ఆశయనేదారము ;మర్త్యుడు-మానవుడు; ఉత్సాహ వర్ధిష్ణుడు- ఉత్సాహము(కోరిక)ను పెంచుకొనినవాడు; ఉష్ణీషము- తలకుచుట్టుకొను వస్త్రము; మదవ్యూడోగ్ర- మదముతో మత్తెక్కిన; శుండాగ్రమున్-ఏనుగును;
భావము:- ఆశయనే దారముతో బంధింప బడిన బుధ్ధిగలవాడై సుయోధనుడు శ్రీకృష్ణుని సాధారణ మానవుడనితలచి
బంధింప నుత్సాహమును జూపెను. అయ్యో ! ఏమనిచెప్పను? మదగజము తలపాగ గుడ్డకు గట్టువడునా? మూర్ఖుడు తెలియ నేరకున్నాడు. అనిభావము.
శ్రీ కృష్ణుడు పాండవ రాయబారిగా కౌరవ సభకేగినపుడు అతనిని బంధిప దుర్యోధనుడు యత్నించును. అపుడు సభలో జరిగెడి యలజడిని ధృతరాష్ట్రునకు విదురుడు తెలుపు సందర్భము.
నన్నయ్యకు కొంచెము ముందో వెనకో అధర్వణుడను జైన కవి యుండేవాడట. అతడుగూడా భారతమును ఆంధ్రీకరించెననియు, కారణాంతరములచే నది మరుగున పడి నశించిన దనియు చరిత్రకారులు వ్రాయు చున్నారు. అందుకు నిదర్శనముగా పైపద్యములను ప్రదర్శించు చున్నారు. చారిత్రికాంశము లెట్లున్నను అధర్వణుడు గొప్పకవి యనుట నిర్వివాదము.
దుష్కర ప్రాసతో పద్యారంభము. సుయోధనకార్యము దుష్కరమని సూచించుటకు!
తంతువు అంటే దారము. చాలాసులభముగా తెంపవచ్చును. సుయోధనాదులు ఆశాపాశ బధ్ధులైనారట. తామే మొదలు కట్టుబడినారు. వారికిక యితరులను కట్టు శక్తియెక్కడిది? అయినను వ్యర్ధప్రయత్నము. కృష్ణుని బంధించుట మదపుటేనుగును తలగుడ్డతో బంధించుట వంటిదట! ప్రయత్నము విఫలమగుటయేగాదు. ప్రత్నించిన వారికే ప్రమాద మగును.
ఈరీతిగా భావ స్ఫోరకముగా రసోచితముగా సన్నివేశమునకు అనుగుణముగా చక్కనిపద్యములను రచించిన
యధర్వణుని భారతము మనకు లభింపక పోవుట మనదురదృష్టము. మరోపద్యం మరోసారి.
స్వస్తి!🙏🙏🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి