7, మే 2024, మంగళవారం

ఆవకాయ రుచిని

 ఈ క్రింది పద్యాలని చూడండి


కం.

కలిపెడిది ఆవకాయట

కలిపించెడి వారు మామగారట మరినే

కలిపిన రుచికరమగు నట

కలుపగ వేరొండు గాయ కలుపగ నేలా

----------------------------------------

కం.

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

------------------------------------------------

కం.

ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

-------------------------------------------------

కం.

చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగు వాడు  కాడోయ్!

---------------------------------------------

కం.

శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

-----------------------------------------------

కం.

ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!

--------------------------------------------

కం.

బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

------------------------------------------------

ఆవకాయ అవతరణ:


కం.

చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్

-----------------------------------------------------

ఆవకాయ ఇష్టం లేదని ఎవరైనా అంటే వానిని ఒక కవి ఏకంగా శపించేస్తున్నాడు చూడండి


కం.

ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!

--------------------------------------------------

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:


కం.

చెక్కందురు డిప్పందురు

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్

డొక్కందురుగ  మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

-----------------------------------------

మరొక మంచి గేయ కవితని చూడండి.


ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది

మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది

మెంతికాయ  మోజు పెంచేస్తుంది

తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది

కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది

బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది

పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది

పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది

------------------------------------------

చింతకాయ చింతించినా చూడరు

ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు

గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు

కొరివికారం కొరకొర చూసినా చలించరు

టమాటా టక్కుటమారాలు చేసినా పడరు

నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా

అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు

వంకాయ బండపచ్చడి బాధపడినా


నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా

దోసావకాయ దోరగా నవ్వినా

నారింజకారం కవ్వించినా 

కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా

పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా

క్యాబేజి పచ్చడి  ఘుమఘుమలాడినా

కొబ్బరిపచ్చడి  కూతపెట్టి పిలిచినా

బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా

కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా

వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా

వడగళ్ల జడివానలు కురుస్తున్నా

చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా

అన్ని ఋతువుల అమృతమనుచు

మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే

----------------------------------------------

అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ

ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా

కంటికింపుకాదు నోటికి రుచికాదు

మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

ఇంతటి మహత్తరమైన ఆవకాయని, ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలి పెట్ట గలమా! నిస్సందేహంగా వదలలేం.

-------------------------------------------------

పదార్థాలని తినేప్పుడు అందరూ ఆవకాయని నంజుకుని తిని ఆవకాయ రుచిని ఆస్వాదించండి. చక్కటి వరి బియ్యం అన్నంలో ఆవకాయని కలిపి కమ్మని ఆవు నేయితో నిజమైన ఆవకాయ రుచిని ఆస్వాదించండి. 

రచయిత పేరు తెలియదు. వారికి  నమస్సులు. 🌹💐🙏


*సేకరణ:- శ్రీ పురం వేంకటేశ్ ప్రసాద్ గారి పోస్టు.*

కామెంట్‌లు లేవు: