16, జులై 2024, మంగళవారం

రామాయణం

 .రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?


ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న "నవరత్నాలలో" ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. 


రాజ్యసభలో ఉన్న పండితుల అందరినీ పిలిచి "రామాయణం" లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు.


ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు.


ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.


విక్రమాదిత్యుని రాజ్యసభలో "వరరుచి" అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.

అతనికి ఆ వెయ్యి  బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.


అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాల లో తిరిగి రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.


అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది. 


40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.


నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.

వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ  మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం "మాం విద్ధి... అని చెప్పింది.

ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.


అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.


ఆ శ్లోకం ఇది 


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్

అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్


ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.


అతను  చెప్పిన 18 రకాలయిన  అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.


ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి?

ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?


ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలోఅరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది.

రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి  లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ,

తన తల్లి "సుమిత్ర" ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం.


ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. 


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్.

అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷


మొదటి అర్ధం:


రామ= రాముడు:  దశరథం=దశరథుడు:  విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో,  సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!


రెండవ అర్ధం:


రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం)  దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ  ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి  రా! 


మూడవ అర్ధం:


రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా


ఓ పుత్రా!  నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో,

సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.

రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక  శోకిస్తుంది.


కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.

కామెంట్‌లు లేవు: