16, జులై 2024, మంగళవారం

_నేటి విశేషం_

 *_నేటి విశేషం_*


  *కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం* రా 11.09 నుండి


*పండుగలకు నెలవు దక్షిణాయనం*

       సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సమయం "ఉత్తరాయణ పుణ్యకాలం." ఇక "దక్షిణాయనం" అంటే సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే సమయం. 


*దక్షిణాయనం కూడా పుణ్యప్రదమైనదే.*


    మన ప్రధాన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి, శుభకార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించే మనం... *శక్త్యారాధన, రుద్రారాధన, పితృదేవతారాధన మాత్రం దక్షిణాయనంలోనే చేస్తాం."*


*దక్షిణాయన పుణ్యకాల నిర్ణయం*


 *రవి కర్కాటక ప్రవేశంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది•.*


 ఈ దక్షిణాయన పుణ్యకాలంలో నెయ్యి, గోదానం శ్రేష్ఠమైన ఫలితాలనిస్తుంది, పితృదేవతలకు తర్పణాదులివ్వాలి. 


 దక్షిణాయన పుణ్యకాలంలో నదీస్నానం లేదా సంకల్ప సహిత స్నానం కానీ చేయాలి. 


*దక్షిణాయన పుణ్యకాలంలో చేసే జప, దాన, ఉపవాస, తర్పణాదులు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి.*


 సూర్యుడు మకరంలో ప్రవేశించినది మొదలు ఆరుమాసాలపాటు *ఉత్తరాయణం* అయితే, ఆయన కర్కాటకంలో ప్రవేశించినది మొదలు *దక్షిణాయనం.* 


*సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తే ఉత్తరాయనం మని, ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తే దక్షిణాయనమని పిలుస్తారు.*


 తెలుగువారు ఋతువులను చైత్రాది మాసాలతో లెక్కిస్తారు. అయితే ఉత్తర, దక్షిణ అయనాల ఆరంభానికి మాసాలతో నిమిత్తం లేదు. మేషాయనం, కర్కాటకాయనం, మకరాయనం వంటివి మాసారంభంలో రావు. అంటే ఉదాహరణకు చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్య సంక్రమణం జరగదు. కానీ, అశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో సూర్యోదయం జరిగిన రోజున మేష సంక్రమణం జరుగుతుంది. పునర్వసు 4వ పాదంలో సూర్యోదయమైతే కర్కాటక సంక్రమణం గాను, ఉత్తరాషాఢ 2వ పాదమైతే మకర సంక్రమణంగాను లెక్కిస్తాం.


 *దేవతలకు రాత్రికాలం*


 రాశిచక్రంలో దక్షిణాయనమే ముందుగా వస్తుంది. కారణం ఏమంటే మకరం కంటే కర్కాటకం రాశిచక్రంలో ముందుగా వస్తుంది. కానీ, మనవారు ఉత్తరాయణాన్ని ముందుగా చెప్పి తరువాత దక్షిణాయనం చెబుతారు. ఎందుకంటే.... _*మానవ కార్యాలకు ఉత్తరాయణం శుభప్రదమైనది. పితృదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది. పితృపక్షాలు దక్షిణాయనంలోనే వస్తాయి.*


దేవతల కాలమానం వేరు, మానవుల కాలమానం వేరు అన్న మాట తరచుగా వింటూఉంటాం. అయితే, మన కాలమానంలో మనం ఎటువంటి సత్కర్మలు చేస్తే ఏయే దేవతలు స్వీకరిస్తారో జ్యోతిర్విజ్ఞానం ఆధారంగా తెలుసుకోవచ్చు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో సూర్యోదయం, నాలుగో రాశిలో మధ్యాహ్నం, ఏడో రాశిలో సాయంత్రం, పదోరాశిలో అర్ధరాత్రి సహజంగా ఏర్పడతాయి. రాశిచక్రం మేషంతో మొదలై మీనంతో పూర్తవుతుంది. మానవుల కాలమానం ప్రకారం ఉదయవేళ మేషరాశి, మధ్యాహ్నవేళ కర్కాటక రాశి, సాయంత్రవేళ తుల, అర్ధరాత్రి మకరరాశి ఉండాలి. ఈ పరిస్థితి మనకు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది.


 ఇప్పుడు దక్షిణాయనంలో అంటే, సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయం కూడా కర్కాటకంలోనే జరుగుతుంది. అపరాహ్ణవేళ లో మనం ఆచరించేది పితృదేవతారాధనలే కనుక దక్షిణాయనంలో శ్రాద్ధాదులు శ్రద్ధగా ఆచరిస్తాం. _*ఉత్తరాయణం సాత్విక దేవతారాధనకు, దక్షిణాయనం ఉగ్రదేవతారాధనకు ప్రసిద్ధి వహించింది.*_


*దక్షిణాయన ప్రశస్తి*


 శ్రీమహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే. రుద్రారాధన, గణనాయకుడైన వినాయకుని ఆరాధనతో పాటు విశేషమైన పండుగలన్నీ దక్షిణాయనంలో వస్తాయి. శక్త్యారాధనా ప్రధానమైన విజయదశమి దక్షిణాయనంలోనే వస్తుంది. ఉగ్రదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది. మన పండుగల్లో దక్షిణాయన సంక్రమణం ఒకటి. ఇది పెద్దలను స్మరిస్తూ చేసే తర్పణాదులకే పరిమితం కావడం చేత అధిక ప్రాధాన్యతను సంతరించుకోలేదు. 


 ఉత్తరాయణంలోని మకరసంక్రాంతి శోభ దక్షిణాయనంలో కానరాదు. మకరసంక్రాంతి వేళకు పంటలు చేతికి అందివస్తాయి. దక్షిణాయన సమయంలో రైతులు పొలంపనుల్లో నిమగ్నమవుతారు. దక్షిణాయనం రాత్రికాలం ప్రారంభం కావడం చేత భోగి, కనుమ వంటివి లేవు. విశేష ఉత్సవాలు చేయరు. కానీ పితృదేవతారాధన ప్రధానంగా చేస్తారు.

కామెంట్‌లు లేవు: