ఒకసారి కేరళ నుండి వచ్చిన ఒక భక్తురాలు ఆశ్రమంలో అందరికీ ఒకపూట వండి పెడతానని పట్టుబట్టింది. ఎంతో సమయమూ, శ్రమా వెచ్చించి ముప్పై రెండు వంటకాలతో భోజనం సిద్ధం చేసింది. భగవాన్ మాత్రం అన్నిటినీ కలిపి ఒకే ముద్దగా చేసేసి తినేశారు.
తర్వాత భగవాన్, ఆ భక్తురాలితో ఇలా సెలవిచ్చారు ...
ఇన్ని పదార్థాలు వంటకోసం సేకరించడం, వండటం ఎంత శ్రమ పడ్డావో కదా! పొట్టను శుభ్రం చేసి, మలబద్ధకాన్ని పోగొట్టే ఒక్క కూర చాలదా ఈ అన్నంలోకి! ఇన్ని ఎందుకు చెయ్యడం?
ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. నువ్వు 32 రకాలు చేశావు కదా! అది తిందామా! ఇది తిందామా! అని తినే సమయంలో మనసు చెదురుతూ ఉంటుంది. అదే ఒక్క పదార్థం ఉంటే హాయిగా ఏ ఆలోచనా లేకుండా తినవచ్చు.
మనం ఆకలితో అలమటిస్తుంటే "నిరాడంబరులమనీ, సన్యాసులమనీ చెప్పుకుంటూ ఇన్ని రకాలు తింటున్నారే!" అన్న ఆలోచనలూ, అసూయలూ అన్నార్తులలో రేకెత్తించడము మంచిది కాదుకదా!
అయినా "ఎంతోమంది తిండి దొరకనివాళ్ళు ఉండగా మనం ఇంత ఆర్భాటంగా, అట్టహాసంగా తింటే వాళ్ళందరికీ తిండి ఎలా దొరుకుతుంది?"
తర్వాత మళ్ళీ భగవాన్ ఇలా వివరణ ఇచ్చారు ...
నేను ఏదో ఒక పదార్థాన్ని ముందు తింటే, వడ్డించేవారు సహజంగా ఏమనుకుంటారు? "ఆ! భగవాన్ మొదట ఇది తిన్నారు కాబట్టి భగవానుకు ఇదంటే ఇష్టం" అనుకుని దాన్ని ఇంకొంచెం ఎక్కవ వడ్డించడానికి ప్రయత్నిస్తారు! అందుకనే ఇలా జరగకూడదని అంతా కలిపేసి ఒకే ముద్దగా తినేస్తాను! అంతే.
రమణోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి