16, జులై 2024, మంగళవారం

మన సాహిత్య మకరందం!*

 0201b-6.2401c-6.160724-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



       *మన సాహిత్య మకరందం!*

                 ➖➖➖✍️



*ఒకటిఁగొని, రెంటి నిశ్చల యుక్తిఁజేర్చి,*

*మూఁటి నాల్గింటఁగడు వశ్యములుగఁజేసి,*

*యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు*

*విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు*

```

ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతం ఉద్యోగపర్వంలోనిది. తిక్కన రచన.


సంజయ రాయబారం ముగిసింది. ఆ విశేషాలింకా ధృతరాష్ట్ర మహా రాజ చెవిని పడలేదు. రాజు వ్యాకుల చిత్తుడై ఉన్నాడు. ఆందోళనతో తనకి నిద్ర పట్టడంలేదని, తన మనస్తాపం ఉపశమించేలా నాలుగు మంచి మాటలు చెప్పమనీ విదురుని కోరాడు.


ఆ సందర్భంగా విదురుడు కుఱుమహా రాజుకి బోధించిన హిత వచనాలలో ఇదొకటి ...!


ఒక దానిని స్వీకరించి, రెండింటిని స్థిర పరచుకుని, మూడింటిని నాలుగింటి చేత వశపరచుకుని, ఐదింటిని జయించి, ఆరింటి గురించిన ఎఱుక గలిగి, యేడింటిని ఎవడు విడిచి పెడతాడో, అతడే వివేకధనుడని స్థూలంగా ఈ పద్యం చెబుతోంది!


ఈ అంకెల మర్మం తెలుసుకుంటే నిగూఢమైన తాత్త్వికార్ధం సుబోధకమవుతుంది.


పెద్దలు ఈ పద్య భావాన్ని ఇలా విడమరిచి చెప్పారు. చూడండి ...


ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రం(ఆలోచన), ఉత్సాహం అనే రెండింటినీ స్థిరంగా చేసుకుని, మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాల వారినీ సామ దాన భేద దండోపాయాల చేత (ఈ నాలుగింటి చేత) పూర్తిగా వశం చేసుకుని, పంచేంద్రియాలనూ(త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము) జయించి,సంధి,విగ్రహము,యానము, ఆసనము,ద్వైదీభావము,సమాశ్రయము లను తెలుసుకుని, సప్త వ్యసనాలను (స్త్రీ, జూదము, పానము, వేట, కఠినముగా మాటలాడుట, తగని వెచ్చము, కఠిన దండము) విడిచి పెట్టి ఎవడయితే ప్రవర్తిస్తాడో, అతడు వివేకవంతుడు.


దీనికి మన పెద్దలు ఇంకా వేరే విధమైన వ్యాఖ్యానాలు కూడ చేశారు.


ఈ పద్యానికి ఇంకో విధమైన అర్ధం యిలా చెప్పారు ...


బుద్ధిని కలిగి ఉండి, వాక్కు , క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో ఒకటిగా చేర్చి, ధర్మార్ధ కామాలనే మూడింటినీ, బ్రహ్మచర్య, గార్హ్యస్థ, వానప్రస్థ, సన్యానములనే నాలుగింటితో వశపరచుకుని, వాక్, పాణి, పాదము, వాయువు, గుహ్యము అనే కర్మేంద్రియాలను అయిదింటినీ గెలిచి, యజన, యాజన, అధ్యయన, ఆధ్యాపన, దాన, ప్రతిగ్రహములు అనే ఆరు స్మార్త కర్మలనీ తెలుసుకుని, పంచభూతాలూ, బుద్ధి, అహంకారం అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకవంతుడు.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...9440652774.

లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

కామెంట్‌లు లేవు: