13, ఆగస్టు 2024, మంగళవారం

దేవాలయాలు - పూజలు 9*

 *దేవాలయాలు - పూజలు 9*


సభ్యులకు నమస్కారములు.


గత వ్యాసాలలో తెలుసుకున్నట్లుగా ఇష్ట దేవతలను దర్శించుకోవడానికి, పూజలలో, భజనలలో పాల్గొనడానికి మరియు జీవిత గమనంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులను స్వామి వారికి/అమ్మవారికి నివేదించుటకు, గతంలో మ్రొక్కుకున్న మ్రొక్కులను తీర్చుకొనుటకు దేవాలయాలకు వెళ్ళడం హైందవ ధర్మము, సంస్కృతి మరియు సంప్రదాయము. *పూజలు, ప్రార్థనలు శ్రద్ధ మరియు భక్తి సమన్వితంగా చేయాలి*. 


*జ్ఞాత్వా కర్మాణి కుర్వీత*.

అర్థం తెలుసుకుని కార్యక్రమాలు చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది.

నిష్టా గరిష్ట పూజలవలన మనలో (అర్చకులు మరియు భక్తులు) ఉన్న అనుశాసన బద్ధమైన స్థూల క్రియా కలాపాల ద్వారా

 *అంతరంగ సూక్ష్మ శక్తులు జాగృతమవుతాయి*. అందువలన మానవీయ అంతఃకరణలో సత్ప్రవర్తనలు, సద్భావనలు, సుసంస్కార జాగరణ, వికాసన అన్ని సంభవిస్తాయి. *కాబట్టి నిర్దేశించబడిన పూజా ప్రక్రియను తేలికగా తీసుకోరాదు, ఉపేక్షించరాదు*. 


దేవాలయాలలో గాని గృహాలలో గాని *పూజాదికాలను బొమ్మలాటగా, కాలక్షేపపు తంతుగా నిర్వహించి, శుభాలను, పుణ్యాలను సులువుగా పొందుదాం అన్న భావన వద్దు.*


 ఆ ఆలోచన రానీయవద్దు. భగవంతుడు లేనిదెక్కడ భగవంతుడు సర్వాంతర్యామి. మనలోనూ ఉన్నాడు. అతనికి తెలుసు మనం ఎంత శ్రద్ధగా, దీక్షగా ఉన్నామో. అంతరాత్మను మభ్యపెట్టలేము గదా!. పూజలు, భజనలు ప్రదర్శనల కొరకు, అట్టహాసాల కొరకు చేయరాదు. 

*నలుగురిని ఆకర్షించుటకు చేయరాదు*.


దేవాలయాలలో అర్చక స్వాములు నిర్వహించే పూజలలో అనేక సంప్రదాయాలు కలవు. పూజా సమయాలు వివిధ ప్రాంతాలలో, అక్కడి సామాజిక, భౌగోళిక పరిస్థితి, మార్పులు బట్టి వివిధంగా ఉంటాయి. సాధారణంగా దేవాలయాలలో పూజలు ప్రాతః సంధ్య మరియు సాయం సంధ్యలలో నిర్వహింపబడుతాయి. అర్చక స్వాములు దేవాలయ ద్వార ప్రవేశ తదుపరి గర్భాలయ శుద్ధితో ప్రారంభమై దిగువ పేర్కొనబడిన *షోడశోపచారాల* సుసంపన్న పూజా విధానము ఉంటుంది.

1) ఆవాహన

 2)ఆసనం

 3) పాద్యం

 4)అర్ఘ్యం 

5) ఆచమనం

 6) స్నానం

 7) వస్త్రం

(పుండ్ర ధారణ- బొట్టు)

 8) ఉపవీతం

 (యజ్ఞోపవీతం లేదా మంగళ సూత్రం) 

9) అనులేపన/గంధం

 10) పుష్పం 

11) ధూపం

 12) దీపం/ జ్యోతి 

13) నైవేద్యం 

14) తాంబూలం 

15) నీరాజనం.

16)మంత్రపుష్పం 

అపరాధ క్షమాప్రార్థన....

(ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు)


సంప్రదాయ పదహారు (16) పూజలను సంస్కృతంలో షోడశోపచారాలు అని పిలుస్తారు. *షోడశ* అంటే పదహారు, ఉపచారాలు అంటే సేవలు.


శాస్త్రాలలో పూజా సమయాలు గూడా నిర్దేశింపబడినవి. 

1) *ఉదయము* 

5-30 నుండి 11.00 ల లోపు పూజల వలన అనుకున్న పనులు నెరవేరుతాయి.

2) *మధ్యాహ్నము* 11.00 నుండి 2.00 ల వరకు జీవితంలోని ఒడి దుడుకులు సవరింపబడుతాయి.

3) *సాయంత్రము* 6.00 ల నుండి 9.00 వరకు ఆరోగ్య ప్రాప్తి, అనారోగ్య హరణ.

4) రాత్రి 9.00 నుండి 

మధ్యరాత్రి కాలంలో పూజలు అనర్థదాయకము మరియు హితవు కాదు.

(శివరాత్రి ఉత్సవం తప్ప)


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: