13, ఆగస్టు 2024, మంగళవారం

శివ ధర్మాలు

 *శివ ధర్మాలు*

⚜️🔱⚜️🔱


🔱 *1 మహాదేవుని పూజిస్తే మరుజన్మ ఉండదు.* 🌈


💫 పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకనాటికి గిట్టవలసిందే. అలా గిట్టిన ప్రతి ఒక్కరూ... వారి కర్మఫలాన్ననుసరించి తిరిగి జన్మెత్తుతారు. మరి జనన-మరణ చక్రాన్ని దాటి మనిషికి మరో మార్గం లేదా? దీన్నుంచి విడుదల లేదా?


*సాగరాణాం క్షయం వ్యంతి క్షీయతే హిమవా నపి* 

*రుద్రలోకే క్షయో నాస్తి, శంకరే శరణం గతే* 


💫 సముద్రాలన్నీ ఇంకిపోవచ్చు. హిమాలయ పర్వతం కూడా కరిగిపోవచ్చు. శంకరుడి శరణు పొందినవాడు చేరుకునే రుద్రలోకంలో మాత్రం దేనికీ నాశం లేదు. ఎందుకంటే రుద్రలోకం నశించదు. అక్కడికి చేరుకున్నవాళ్లకు కూడా నాశం లేదు. శివుని శరణాగతి వేడితే, సేవిస్తే పునర్భవం (మరు పుట్టుక) ఉండదు. శాశ్వతంగా శివలోకంలోనే ఉంటారు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂

🔱 *2. ఉత్తమగతులు పొందాలంటే మార్గం ఏది?* 🌈


 ఏ చోటు చేరుకుంటే మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం రాదో.. ఏది అన్నిటికంటే ఉత్తమమైనదో దాన్ని ఉత్తమగతి అంటారు. దాన్ని పొందే మార్గం కావాలా? తెలుసుకోండి.


*ఏష్టవ్యా బహవః పుత్రాశ్శివధర్మానుసారిణః,*

*సముద్ధరన్తి తే గోత్రం, రజ్జుః కూపాద్ ఘటం యథా*


💫 శివధర్మాన్ని ఆచరించే కొడుకులను ఎంతో మందిని కనాలి. ఆ పుత్రులు వారి వంశాన్ని ఉద్ధరిస్తారు. తాడు నూతిలోనుండి కుండను బయటికి లాగినట్లుగా శివధర్మపరాయణులైన సంతానం ఆ వంశంలోని వారిని అధోలోకాలనుంచి, ఊర్ధ్వలోకాలలోకి లాక్కొని వెళ్తుంది. అంతేకాదు అధోలోకాలలో పడకుండా చేయడమే కాక, అంతకు ముందు నరకాదిలోకాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడ ఉత్తమగతులు కల్పిస్తారు. శివధర్మపరులు తాము ఉత్తమస్థానాలలో ఉండి, తమవంశంలోని వారికి కూడ ఉత్తమగతులకు తీసుకువెళ్తారు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


🔱 *3 ఒక్క పని చేస్తే వందపనులు చేసినట్లే!* 🌈 


💫 మనం ఓ పని చేస్తే దానికి ఆ ఫలితం మాత్రమే లభిస్తుంది. రెండు పనులు చేస్తే రెండింతలు ఫలితమే లభిస్తుంది. మరి ఒక్క పని చేసి వందరెట్లు ఫలితం రావాలంటే ఏం చేయాలి? 


*సర్వయజ్ఞతపోదాన తీర్థవేదేషు యత్ఫలమ్,* 

*తత్ఫలం కోటిగుణితం, స్థాప్య లింగ లభేన్నరః*


💫 సమస్తయజ్ఞాలు ఆచరిస్తే, అనేక తపస్సులు చేస్తే, ఎన్నో దానాలు ఇస్తే, అనేక పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే, నాలుగు వేదాలూ పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. కానీ వీటివల్ల కలిగే ఫలితానికి కోటిరెట్లు అధికమైన ఫలితం శివలింగాన్ని స్థాపించిన మానవుడు పొందుతాడు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂

🔱 *4. ఒకదానికంటే మరోటి గొప్పదైతే...ఏం చేయాలి?* 🌈


💫 మన సంప్రదాయంలో చేసే ప్రతి ఒక్క కార్యం గొప్పదే. కానీ కొన్నింటికంటే మరికొన్ని గొప్పవి. మరి మనమేం చేయాలి?


*లింగస్య దర్శనం పుణ్యం* 

*దర్శనాత్ స్పర్శనం శుభం,* 

*స్పర్శనా దర్చనం శ్రేష్ఠం,* 

*ఘృతస్నానం సమాచరేత్* 


💫 శివలింగాన్ని దర్శించుకోవడమే పుణ్యం. దర్శనంకంటే స్పర్శనం (తాకటం) వల్ల ఎక్కువ పుణ్యం, స్పర్శనం కంటే శివలింగాన్ని పూజించటం ఇంకా ఉత్తమం. శివార్చనం కంటె గూడ శివలింగానికి (ఆవు) నేతితో అభిషేకం చేయడం ఇంకా పరమోత్తమం. 


💫 కనుక, భగవంతుడు వారికిచ్చిన స్థితి.. స్తోమతను బట్టీ వాటిని ఆచరించి ఆయా ఫలితాలు పొందవచ్చు. మనకు ఇదే ఫలం అని బాధపడనక్కర్లేదు. శివుడిపై భారం వేసి వాటిని ఆచరిస్తే ఉత్తమమైన కార్యాలు ఆచరించే ఫలితాన్ని ఆ శివుడే కలిగిస్తాడు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


🔱 *5 రేపుమాపని ఆలసించకు... త్వరపడు..* 🌈 


💫 ఏదైనా ఓ పని చేస్తే మనకు మంచి జరుగుతుందని ఎవరైనా చెప్తే మనం వెంటనే ఉత్సాహంగా వింటాం. వెంటనే చేద్దామనుకుంటాం. కానీ ఇంతలోనే బద్ధకిస్తాం. రేపు చేయొచ్చులే... మాపు చేయొచ్చులే... అని ఆలస్యం చేస్తాం. మామూలు పనులైతే ఆలస్యం చేసినా తప్పు లేదు. మరి జన్మను తరింపజేసేదైతే? 


*త్వరిత జీవితం యాతి, త్వరితం యాతి యౌవనం,* 

*త్వరితం వ్యాధి రభ్యేతి, తస్మాత్ పూజ్య సదాశివః.* 


💫 బ్రతుకు త్వరగా ముగిసిపోతుంది. యౌవనం అంతకంటే వేగంగా ముగిసిపోతుంది. శరీరం మీదికి రోగాలు వేగంగా వచ్చిపడతాయి. మరి మనకు ఉత్తమగతులనిచ్చే శివపూజ వెంటనే చేయాలి. తరువాత ఎప్పుడో చేద్దాం లెమ్మని కాలం గడిపేసి ముసలితనము, రోగాలూ, మరణము వచ్చేసాక అప్పుడాలోచిస్తే ఉపయోగం ఏమిటి?


🙏 *శివధర్మాలను ఆచరిద్దాం. జన్మను తరింపచేసుకుందాం* 🙏


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*

🌹🌹🌹🌹🌹

⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱

కామెంట్‌లు లేవు: