30, డిసెంబర్ 2020, బుధవారం

15. వేదాంగములు : శిక్ష*

 *41-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*15. వేదాంగములు : శిక్ష*


((((((((((🕉))))))))))


*అక్షమాల - జపమాల :-*


*''రుద్రక్షమాల'' అంటే రుద్రాక్షలు కల జపమాల అని అర్థం - రుద్రుని కళ్ల నుండి వచ్చినవి రుద్రాక్షలు అని జనశృతి. ఇక్కడ ''అక్ష'' అంటే 'కన్ను' అని అర్థం. 'అక్షమాల' అంటే ఏమిటి? ఇక్కడ ''అక్ష''ని కన్నుగా అన్వయించుకోవటం తప్పు. ''అ'' నుండి ''క్ష'' వరకూ గల అక్షరాలకి ప్రతీక. సంస్కృతంలో మొదటి అక్షరం ''అ'' చివరిది ''క్ష''. సంపూర్ణతని సూచించటానికి ఇంగ్లీషులో ''A to Z'' అంటారు, సంస్కృతంలో ''అ"కారాది "క్ష" కారాంతః'' అంటారు. అంటే ''అ''తో ఆరంభించి ''క్ష''తో అంతమవటం. అక్షరాలన్నీ కలిపి 50, అందువల్ల అక్షమాలలో 50 పూసలుంటాయి.*



*శబ్దోచ్చారణ యొక్క ప్రాముఖ్యత :- మంత్రపఠనంలో అప్రమత్తత అవసరమని ముందు చెప్పడం జరిగింది. శబ్దోచ్చారణలో పొరపాటు జరిగితే మంత్రం సరియైన ఫలమివ్వకపోగా హానిని గాని, వ్యతిరేక ఫలితాలని గాని ఇస్తుంది. తైత్తిరీయ సంహితలో ఈ విషయాన్ని తెల్పే కథ ఒకటుంది. (2.4.12) త్వష్టుడుకి ఇంద్రునితో వైరం. ఇంద్రుని సంహరించగల కుమారుడు కావాలని కోరుకొంటాడు. అందుకని ''ఇంద్రశత్రుర్వర్ధస్వ'' అన్న మంత్రాన్ని జపిస్తూ ఒక హోమాన్ని చేశాడు. ఈ మంత్రాన్ని సరిగ్గా పఠించే పద్దతిలో పలికితే,''త్వష్టుని కుమారుడు పెరిగి ఇంద్రుని వధించుగాక'' అనే అర్థం వస్తుంది. ఆ శబ్ద ప్రాబల్యం వల్లనే ఆ కుమారుడు పెరిగి ఇంద్రుని వధింప గలిగే వాడు. కాని శబ్దోచ్చారణలో త్వష్టుడు పొరపాటు చేశాడు. అందువల్ల అర్థం తారుమారైంది. అక్షరాలూ, పదాలూ మారకపోయినా స్వరోచ్చారణ దోషం వల్ల, త్వష్టుడు ఆశించిన దానికి సరిగ్గా వ్యతిరేకం జరిగింది. అతని కుమారుని ఇంద్రుడే చంపి వేశాడు. అందువల్ల వృత్రుడన్న అతని కుమారుని వధకు త్వష్టుడే కారణమైనాడు.*



*వేదాలలోని ఈ ఉదంతాన్ని చెప్తూ, సరియైన పద్ధతిలో మంత్రాలని పలకాలంటుంది ఈ శ్లోకం :- ''మంత్రో హీనస్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో న తమర్థమాహ స వాగ్వజ్రో యజమానం హినస్తి యతేంద్రశత్రుః స్వరతో`òపరాధాత్‌''*


*కొన్ని స్వల్ప భేదాలు :- ఇప్పటి వరకూ వేద శబ్దమెంత శుద్ధంగా ఉండాలో వివరించడము జరిగింది. దీనికి నిదర్శనమిదే; రామేశ్వరం నుండి హిమాలయాల వరకూ భారతదేశంలో ఏ విధమైన సామాజిక సంపర్కమూ లేని ప్రదేశాలలో కూడా వేదాలకి గల పాఠాలని నూటికి తొంభైతొమ్మిది పాళ్లు ఒకే విధంగా అక్షరంగాని పదంగాని వ్యత్యాసం లేకుండా ఉంటాయి. ఇక్కడ వేదాలు ఒక తరం నుంచి మరొక తరానికి లిఖిత పూర్వకంగా కాక, వాక్కు వల్లనే సంక్రమించిన విషయం కూడ గుర్తుంచుకోవాలి.*



*అంటే, స్వల్ప వ్యత్యాస ముందని దీని అర్థమా? అవును, ఉన్నది. ఒక ప్రాంతంలో ఉన్న ప్రతిశాఖకీ మరొక ప్రాంతంలో కల పాఠంలో కొద్ది వ్యత్యాసముంటుంది. ఇది ఆమోద నీయమేనా? ఏ మార్పు ఉన్నా అది విపరీతాలకు దారితీస్తుందని చెప్పిన తర్వాత ఈ 1% వ్యత్యాసం మాత్రమెట్లా సహించటం? శుద్ధమైన రూపము ఒకటే ఉంటే 1%  మార్పుకూడా అనుకొన్న ఫలితాన్నివ్వక పోవచ్చు, వేరొక ఫలితాన్నివ్వవచ్చును. ఈ ప్రశ్నకి సమాధానముంది. మంత్రాలలోని పదాలను మారిస్తే ఫలితం విపరీతమవుతుంది. నిజమే - జబ్బుని కుదర్చటానికి మందుని మార్పు చేస్తే వైద్యం మారినట్టే ఇది కూడ. కాని ఇది రోగికే వర్తిస్తుంది, తనంతట తానే అతడు ఔషధాన్ని మార్చుకో కూడదు, వైద్యుడు మార్చవచ్చు. ఒక వ్యాధిని కుదర్చటానికి ఎన్నో మందు లుంటాయి. అటువంటి సమయాల్లో వైద్యుడు ఒక మందుకి బదులు మరొక దానిని సూచించటంలో తప్పేమీ లేదు. ఒకే జబ్బైనా రోగి దేహస్థితిని బట్టి ఔషధంలోని పదార్థాల మిశ్రమాన్ని కూడ వైద్యుడు మార్చవచ్చు: ఆ విధంగానే ఉద్దేశ పూర్వకంగానే ఋషులు వివిధ శాఖలలోని పదాలను మార్చారు. తమ తరువాత వచ్చేవారు వల్లించటానికి వీలుగా ఈ మార్పు చేయబడింది.*



*''ప్రాతిశాఖ్య'' పాఠాలలో ఈ మార్పులకు సంబంధించిన నియమాలు వివరింపబడ్డాయి. ''ప్రాతిశాఖ్య'' అన్న మాటకి అసలైన అర్థం ''ప్రాంతీయం'' అని. మాటలలోని తేడాలు స్వల్పము - ఆ తేడాలు గణనీయము కావు. సన్నిహిత పదాలు, ఇంచుమించు ఒకే విధంగా ఉచ్చరింపబడే పదాలనే వాడారు. వైదిక శబ్దాలూ - ప్రాంతీయభాషలూ : వేద పదాలలో ప్రాంతీయ భేదాలను దృష్టిలో పెట్టుకొని వివిధ భారతీయ భాషలలో గల తేడాలను గమనిస్తే సాంస్కృతిక భేదాలకు మూలకారణం వైదిక శబ్దాలన్న ఆశ్చర్యకరమైన విషయం బయట పడుతుంది. భాషా శాస్త్ర సంబంధమైన  పరిశోధనలివి.*



*''ద'' ''ర'' ''ల'' ''ళ'' - ఇవన్నీ ఒక దానికొకటి దగ్గరి శబ్దాలు. చిన్న పిల్లవాడిని ''రైలు'' ''రామ'' అనమంటే ''దైలు'' ''దామ'' అంటాడు. ''ద'' ''ర''లకు శబ్దపరంగా సాన్నిహిత్య ముండటమే దీనికి కారణం. ''ద'' ''ర''గా మారగలదు. కనుక 'ల', 'ద'లకు శబ్దపరంగా మారగలదు కదా! ''ల'', ''ళ''లు దగ్గర శబ్దాలు. 'ల'కి, తమిళ శబ్దం ''ళ'' (zha)కి గల సాన్నిహిత్యాన్ని వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క వేదం బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలనూ, ఆయా భాషల లక్షణాలనూ గమనిద్దాం. ఈ రోజులలో వేదాలు ఆర్యులవనీ, ద్రవిడ సంస్కృతి దానికి భిన్నమనీ ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి సమిష్టిగా ద్రవిడ ప్రాంతమని చెప్పబడే మూడు ప్రాంతాలను తీసికుందాము. అంటే తమిళం, తెలుగు, కన్నడ భాషలను. సంస్కృతంలో ''ప్రవాల''మనే శబ్దముంది. ఇదే - తమిళంలో ''పవళం'', తెలుగులో ''పగడం'' కన్నడంలో ''హవళ''. ''ప్రవాల'', తమిళంలో 'పవళం' అయింది తెలుగులో 'పగడ'మయింది. 'వ', 'గ'గా మారింది. 'ప్రవాల' కన్నడంలో ''హవళ''గా మారినప్పుడు మొదటి అక్షరమే మారుతుంది.*



 *''ప్ర'' అన్న అక్షరం తెలుగులో, తమిళంలో ''ప''గా మారటం పెద్ద మార్పుకాదు. కాని కన్నడంలో అది ''హ'' అవుతుంది. ఇది ఆ భాష ప్రత్యేక లక్షణం. ఇతర భాషలలోని ''ప'' కన్నడంలో - 'హ'గా మారుతుంది. ''పంప'' ''హంప''గా ఇంకా ''హంపి''గా మారుతుంది. ఆర్య, ద్రావిడ అంటూ రెండు జాతులుగా కాకపోయినా భాషలను సంస్కృతంలో సంబంధమున్న భాషలనీ, కేవలం ద్రావిడ భాషలనీ వర్గీకరిస్తారు. ఇప్పటి పరిశోధనలననుసరించే ఈ వర్గీకరణం. ఇంకా కొంత పరిశోధన జరిగితే ఈ వర్గీకరణ మనకవసరమేమో ననీ, అన్ని భాషలకూ మాతృక ఒకటేనేమోననీ కూడ నిరూపించవచ్చును. పశ్చిమ భారతంలో, కర్నాటకతో సహా, ప్రాచుర్యంలో ఉండేది ఋగ్వేదం. ఋగ్వేదంలో ''ళ'' శబ్దం ఎక్కువ వాడుకలో ఉంది. ద్రావిడభాష అని అందరూ అనుకునే కన్నడలోకి ''ళ'' అట్లా వచ్చింది.*


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: