మహాభారతంలో భీష్ముడిని ధర్మరాజు పితామహా ! రాజు దండనీతిని ఎలా అమలుచేయాలో తెలియచెయ్యండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా ! కృతయుగం నుండి రాజు దండనీతిని ధర్మమైన పద్ధతిలో అమలు చేస్తున్నాడు. రాజు దండనీతిని ధర్మబద్ధంగా ఆచరించడం వలన ధర్మనిరతి పెరుగుతుంది. మనం చేసే కర్మలు సత్ఫలితాలను ఇస్తాయి. ఋతువులు చక్కగా శుభం చేకూరుస్తాయి. ప్రజల జీవితకాలం పెరుగుతుంది. దున్నకుండానే భూమి ఫలసాయం అందిస్తుంది. తరువాత వచ్చిన త్రేతాయుగంలో ధర్మం క్షీణిస్తూ వచ్చి మూడు పాదాలతో నడుస్తుంది. ప్రజలు దానితోనే సంతృప్తి పడతారు. ఇక ద్వాపరయుగంలో రాజు ధర్మాన్ని రెండు పాదాలతో మాత్రమే నడుపుతాడు. ప్రజలు దానితో సంతృప్తి పడతారు. ఇక రాబోవు కలి యుగంలో రాజులో ధర్మాచరణ మీద శ్రద్ధ క్షీణిస్తుంది. ప్రజలలో అధర్మం పెరుగుతుంది. వర్ణాశ్రమధర్మాలు గతి తప్పుతాయి. ఇదంతా కాలగతిలో జరిగే మార్పులను అనుసరించి జరుగుతుంది కాని రాజైన వాడు రాజు ధర్మాన్ని కృతయుగంలో లాగా ఆచరించిన ధర్మంవర్ధిల్లి నాలుగు పాదములతో నడుస్తుంది. లేకున్న కాలగతిలో క్రమక్రమంగా క్షీణిస్తుంది. రాజు ప్రజలు చేసే తప్పులను జాగ్రత్తగా పశీలించాలి. ఎవరైనా తనను తాను పొగొడుతున్నాడంటే అతడికి మదము, అహంకారం, లోభము, దుర్మార్గం ఎక్కువగా ఉంటుందని తెలుసు కోవాలి. అవి లేని వాడు తనను తాను పొగుడుకొనడు. సజ్జనుడైన రాజు నియమ నిబద్ధంగా జీవిస్తాడు. అతడికి పరాక్రమం ఉంటుంది కాని గర్వం ఉండదు. అతడు పరస్త్రీని కోరడు, కోపించడు, సామంతులను ధనం కొరకు వేధించడు. రాజుకు వేదవేదాంగ పారతుడైన పురోహితుడు అవసరం. పురోహితుడు ఎప్పుడూ పురంలో ఉంటూ పురం క్షేమం కోరుతూ రాజును సక్రమ మార్గంలో నడిపించాలి. సామంత రాజుల నుండి కప్పం, కానుకలు స్వీకరించే పనిని రాజు దయ, కరుణ, చతురత కలిగిన మంత్రులకు అప్పగించాలి. రాజు పన్నుల కొరకు ప్రజలను పీడించడం ఆవు పొదుగును కోయడంతో సమానం. తోటమాలి చెట్ల నుండి పండ్లు కోసినంత సున్నితంగా రాజు ప్రజల నుండి పన్నులను వసూలు చేయాలి. ముందు ప్రజలకు అవసరమైన సౌకర్యములు, రక్షణ కల్పించిన తరువాత ప్రజల నుండి పన్నులు గ్రహించాలి. అది రాజుకు ముఖ్యమైన బాధ్యత. ఎన్ని యజ్ఞ, యాగములు దానితో సరి తూగవు.
*బ్రాహ్మణ క్షత్రియులు:*
తిరిగి భీష్ముడు ధర్మనందనా ! ఇలాదేవికి పురూరవుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు ఈ భూమినంతా పాలించాడు. అతడు ఒక నాడు వాయువును భూమి బ్రాహ్మణ, క్షత్రియులలో ఎవరి సంపదగా విరాజిల్లుతుంది అని. వాయుదేవుడు బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారు. ఉత్కృష్టమైన ముఖం నుండి జన్మించిన బ్రాహ్మణుడు ఈ భూమి మీద ఉన్న సకలసంపదలను అనుభవించుటకు వాటిని దానం చేయుటకు అర్హుడు. దండనీతిని అమలుచేయుటకు క్షత్రియుడిని, సహజంగా శాంతి కాముకుడైన బ్రాహ్మణుడిని అతడి పురోహితుడిగా నియమించాడు. అటువంటి పురోహితుడికి సకల సంపదలను సమకూర్చి అతడి అడుగు జాడలలో రాజ్యపాలన చేయు రాజు ఈ లోకంలో పరలోకంలో సుఖసంతోషాలు పొందగలడు. ప్రజల యొక్క భయమును పోగొట్టి రక్షించడమే రాజు యొక్క పరమధర్మం అని వాయుదేవుడు పురూరవునికి చెప్పాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
*బ్రాహ్మణ ధర్మం:*
తరువాత భీష్ముడు ధర్మనందనా ! పూర్వం శుక్రాచార్యుడు పురోహితుడికి చెప్పిన మాటలు నేను నీకు చెప్తాను. రాజు పురోహితుడి ఆధ్వర్యంతో యజ్ఞ, యాగాదులు చేసి దేవతలను, గరుడ, గంధర్వ, విద్యార్ధులను తృప్తిపరచవలెను. పురోహితుడు లేని రాజ్యాన్ని రాక్షసులు, పిశాచాలు పీడిస్తాయి. రాజుకు అను దినము కలిగే అశుభములను పురోహితుడు శాంతి హోమములతో రక్షించి శత్రు రాజులను పురోహితుడు మంత్ర తంత్రములతో నాశనం చేస్తారు. కనుక ధర్మనందనా ! నీవు ఉత్తముడైన పురోహితుడిని నియమించి రాజ్యపాలన చెయ్యి అన్నాడు భీష్ముడు. కాని పరిశుద్ధుడు కాని పురోహితుడు రాజుకు హాని కలిగించి తానూ నాశనం ఔతాడు. కనుక రాజు బుద్ధిమంతుడు, ఆరోగ్యవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు అయిన బ్రాహ్మణుడిని నియమించుకోవాలి. సకల కార్యములలో రాజు, పురో హితుడు ఒకే మాట మీద నిలిచి ఆ కార్యమును నిర్వర్తించాలి. ధర్మనందనా ! దీని గురించి ఒక ఇతిహాసం చెప్తాను విను. బ్రాహ్మణుడికి క్షత్రియుడికి ఉన్న సంబంధం గురించి కశ్యప ప్రజాపతి ఇలుడికి ఇలా చెప్పాడు. క్షత్రియుడు బ్రాహ్మణుడి నుండి పుట్టాడు. బ్రాహ్మణుడు క్షత్రియుడి వలన నియమించ బడతాడు. కనుక బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఒకరి మీద ఒకరు ఆధార పడి జీవిస్తారు. రాజు పురోహితుడు ఒకరిని ఒకరు గౌరవించుకుంటే ప్రజలు వారిని గౌరవిస్తారు. అధర్మం ప్రజ్వరిల్లుతుంది. రాజు పురోహితుల మధ్య సఖ్యత లేకున్న రుద్రుడు ఆగ్రహిస్తాడు. రుద్రుడు ఆగ్రహిస్తే ప్రపంచం సర్వనాశనం ఔతుంది.
*ముచికుందుడు:*
భీష్ముడు ఇంకా ఇలా చెప్పాడు కుబేరుడు పురోహితుడు ఎలా ఉండాలన్న విషయం ముచికుందుడు తో ఇలా చెప్పాడు. పూర్వకాలంలో ముచికుందుడు అనేరాజు రాజ్య కాంక్షతో కుబేరుడి మీద దండెత్తాడు. కుబేరుడు తన సైన్యమును పంపి ముచికుందుడిని ఓడించాడు.*ికి కోపం వచ్చి తన ఓటమికి కారణం పురోహితుడని అనుకుని అతడిని నిందించాడు. ముచికుందుడి పురోహితుడు ముచికుందుడి చేత హోమములు, పూజలు, తపస్సు చేయించి తన మంత్రశక్తితో ముచికుందుడి సైన్యాలకు బలపరాక్రమాలను చేకూర్చాడు. ముచికుందుడు తిరిగి తన సైన్యముతో కుబేరుడి మీదకు దండెత్తాడు. అప్పుడు కుబేరుడు ముచికుందుడితో నీవు నీ పురోహితుడి మంత్రశక్తితో, తపో బలంతో నా మీద యుద్ధానికి వచ్చావు కాని నీ స్వశక్తితో రాలేదు అని అవహేళన చేసాడు. అప్పుడు ముచికుందుడు కుబేరునితో బ్రాహ్మణుడు, క్షత్రియుడు వేరు వేరు కాదు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు అని ఆ బ్రహ్మ అనుగ్రహించాడు. మారు మాటాడక నాతో యుద్ధానికి రా అన్నాడు. కుబేరుడు నీతో నేను యుద్ధం చేయను. నీకు కావలసింది నా రాజ్యమే కదా ! దానిని తీసుకో అన్నాడు. ముచికుందుడు నీ దయాబిక్షతో వచ్చే రాజ్యం నాకు వద్దు. నిన్ను జయించి నీ రాజ్యం తీసుకుంటాను అన్నాడు. ముచికుందుడి పరాక్రమానికి సంతోషించిన కుబేరుడు నేను ఓడాను అని అంగీకరించాడు. ముచికుందుడు సంతోషించి ఈ సమస్త భూమండలాన్ని అనేక సంవత్సరాలు పాలించాడు. కనుక ధర్మనందనా ! నీవు ఎల్లప్పుడూ ఈ ప్రజలకు అభయ హస్తమిచ్చి, రక్షించి ఈ భూమిని పాలించుటయే రాజధర్మం అని భీష్ముడు చెప్పాడు.
*బ్రాహ్మలను దండించే విధానం:*
ధర్మరాజుభీష్ముడితో పితామహా ! బ్రాహ్మణులు మొదలైన వారు తమ తమ వృత్తి ధర్మములు కుల ధర్మములు విడిచి ప్రవర్తించిన ఏమి చేయవలెను. వివరించండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా ! ఆపదలు సంభవించిన సమయంలో ఏ కులము వారైనా తమ తమ కుల ధర్మములను విడిచి ప్రవర్తించిన వారికి ఏ పాపం అంటదు. కాని క్షత్రియుడు పట్టవలసిన కత్తి బ్రాహ్మణుడు పడితే అతడు తన బ్రాహ్మణత్వం కోల్పోయి క్షత్రియుడౌతాడు. అలాగే బ్రాహ్మణుడు తన కులధర్మం వదిలి వైశ్యధర్మమైన వ్యాపారం చేపడితే అతడు వైశ్యుడు ఔతాడు. అలాగే బ్రాహ్మణుడు ధనార్జన నిమిత్తం ఒకరికి ఊడిగం చేసిన అతడు శూద్రుడు ఔతాడు. ఇలాగే తక్కిన వారు కూడా వారి ధర్మం వీడి పరధర్మం ఆచరించిన కులహీనులు ఔతారు. అటువంటి వారు మరలా తమతమ కర్మలను ఆచరించుటకు అర్హులు కారు. రాజు ఈ విషయములు అన్ని తెలుసుకుని ఎవరూ తమ ధర్మం తప్పకుండా చూడాలి. ప్రజలు సంపాదించుకున్న పుణ్యములో కాని పాపములో కాని నాలుగవ వంతు రాజుకు చేరుతుంది. కనుక వర్ణాశ్రమ ధర్మములు తప్పి చరించిన పాపములో నాల్గవవంతు రాజుకు చేరుతుంది కనుక రాజు అనుభవించాలి అన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి