30, డిసెంబర్ 2020, బుధవారం

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



పరమేశ్వరా ! నీదు పాదముల్ దర్శి0ప

            కిటిరూప మెత్తె నా కేశవుండు

శీర్ష భాగంబైన శిరమును దర్శింప

            హంసగా మారె నయ్యబ్జభవుడు

యిర్వురు వారలు యెంత శ్రమించినా

             హర పద శిరములన్నరయరైరి     

వారి కసాధ్యమై పరగిన కార్యంబు 

          శివ శివా నేనెట్లు చేయ గలను ?             

శ్రీకరా ! నేను నిన్నెట్లు చిత్తమందు

దివ్యమౌ రీతి నిక్కంబు తెలియ గలను ?

తెలియ పరచుము శంకరా ! తెల్లముగను

భక్త వత్సల ! పరమేశ ! పాహి పాహి ! 99 #



భవసేవ మగ్నులౌ బ్రహ్మాది దేవతల్

           స్తుతియించ బడదగు స్తుత్య వరుల

గణనమ్ము సల్పెడి క్షణములందున వారు

            నిను నట్గ్రగణ్యుగా నెంచినారు

మాహాత్మ్యవంతుల మహనీయపురుషుల

           చిద్విచారంబును చేయు నపుడు

ధాన్య పొల్లు పగిది తామంత విడిపోగ

           నికర ధాన్యము వోలె నిల్తు వీవు

ఉత్తమోత్తమ ఫలముగనుండినటుల

           విశ్వ దేవతలెల్ల వేద్యు లైరి

యిందు సత్యేతరము లేదు యిందు మౌళి !

స్తోత్ర మించుక లేదయ్య శోభితాంగ !

సర్వమంగళ దాత ! యో సకలవినుత !

భక్త పరిపాల ! శంకరా ! పాహి పాహి ! 100



                           శుభము

                    మంగళం. మహత్


        ✍️గోపాలుని మధుసూదన రావు🙏

కామెంట్‌లు లేవు: