30, డిసెంబర్ 2020, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*769వ నామ మంత్రము* 30.12.2020


*ఓం యజ్ఞరూపాయై నమః*


విష్ణుస్వరూపురాలు (నారాయణి), యజ్ఞములే తన స్వరూపంగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యజ్ఞరూపా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం యజ్ఞరూపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు  ఆ తల్లి సుఖసంతోషములను ప్రసాదించును. ఆత్మానందానుభూతిని కలుగజేయును.


హరివంశమునందు పద్మపురాణములో శంకరుని ఆపాదమస్తకమూ యజ్ఞాంగములతో సమానముగా వర్ణింపబడినది. పరమేశ్వరుని అర్ధాంగి యగుటచే పరమేశ్వరికూడా యజ్ఞస్వరూపురాలుగా చెప్పబడినది. గనుక పరమేశ్వరిని *యజ్ఞరూపా* యని అన్నాము.


యజ్ఞములు  *పాకయజ్ఞములు, హవిర్యాగాలు, సోమ సంస్థలు* అని మూడు ప్రధాన రకములు గలవు.


*పాక యజ్ఞాలు*


1) ఔపాసన, 2) స్థాలీపాకము, 3) వైశ్వదేవము, 4) అష్టకము, 5) మాస శ్రాద్ధము,  6) సర్పబలి, 7) ఈశాన బలి.


*హవిర్యాగాలు*


1) అగ్నిహోత్రాలు, 2) దర్శపూర్ణిమాసలు, 3) అగ్రయణం, 4) చాతుర్మాస్యాలు, 5) పిండ, పితృ యజ్ఞాలు, 6) నిరూఢ పశుబంధము, 7) సౌత్రామణి


*సోమ సంస్థలు*


1) అగ్నిష్టోమము, 2) అత్యగ్నిష్టోమము, 3) ఉక్థము, 4) అతిరాత్రము, 5) ఆప్తోర్యామం,  6) వాజపేయం, 7)  పౌండరీకం


*పంచమహాయజ్ఞములు*


పంచ మహాయజ్ఞములు అనగా హిందూ ధర్మశాస్త్రాలననుసరించి గృహస్థు ఆచరించవలసిన ఐదు యజ్ఞములు.


*బ్రహ్మ యజ్ఞము* ఈ యజ్ఞము ద్వారా గృహస్థుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్థుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు. బ్రహ్మ యజ్ఞమనగా వేదాధ్యయనము. రామాయణ, భాగవతాద్యుద్గ్రంథములను పఠించడం.


*దేవ యజ్ఞము* ఇవి భగవదనుగ్రహం కోసం, ఇష్టకార్యార్ధ సిద్ధి కోసం చేస్తారు. గృహస్థులయితే తమ గార్హపత్యాగ్ని లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులయితే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇక శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది.  దేవ యజ్ఞమనగా ఆజ్యము, లాజలు (పేలాలు) వంటితో హోమం జరిపించుట


*పితృ యజ్ఞము* ఇవి తమను వదలి పరలోకమునకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు.  *ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి  యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని చెప్పెదరు*. పితృ యజ్ఞమనగా శ్రాద్ధము, తర్పణములు మొదలైన కార్యక్రమాలు జరిపి పూర్వీకులను సంతృప్తి పరుచుట.


*భూత యజ్ఞము*  తనతో పాటుగా ఈ భూమిమీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను నడుచుకోవాలి. భూత యజ్ఞమనగా సకల భూతములకు బలిదానములు ఇచ్చుట


*నృయజ్ఞము* ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా చూసుకోవాలి.  ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు. నృయజ్ఞమనగా అతిథి పూజాదులు నిర్వర్తించడం.


పైన చెప్పిన వివిధరూపాలైన యజ్ఞములన్నియు సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపమే గనుక శ్రీమాత *యజ్ఞరూపా* యని అనబడినది.


*యజ్ఞోవై విష్ణుః* వేదములో యజ్ఞమే విష్ణువని చెప్పబడినది. భగవద్గీతలోకూడా తానే యజ్ఞస్వరూపుడనని భగవానుడే చెపుతాడు. జగన్మాత విష్ణుస్వరూపిణి గనుక *యజ్ఞరూపా* యని అన్నారు.


జగన్మాతకు నమస్కరించు నపుడు *ఓం యజ్ఞరూపాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: