9, జులై 2024, మంగళవారం

సామాజిక అన్వయము

 *పురాణ, ఇతిహాస, ప్రాచీన గాథలకు సామాజిక అన్వయము  - సుందరాకాండ* 




సుందరకాండ పారాయణము చేస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయని లోక ప్రతీతి. సుందరకాండ రామాయణములో ఐదవ కాండ. సుందరకాండను *పారాయణకాండ* అని గూడా అంటారు. సుందరకాండలోని ముఖ్యాంశాలు...శ్రీ ఆంజనేయ స్వామి సాగరమును లంఘించుట, సీతాన్వేషణ, లంకా దహనము, సీతమ్మ తల్లి జాడను శ్రీ రామచంద్రుల వారికి తెలియ జేయుట.

పైన తెలియ జేసినట్లుగా  సుందరకాండ పారాయణము తో పనులు పూర్తవుతాయని పెద్దలు చెప్పిన ఉద్దేశ్యము కేవలము పారాయణము చేసినంత మాత్రాన *శ్రీ హనుమత్ఛక్తి* క్రిందికి దిగి వచ్చి మన పనులన్నీ పూర్తి చేసిపెడ్తుందని గాదు.

ఆలా చెప్పడములో పెద్దల అభిప్రాయము...సుందరకాండ మొత్తము సావకాశంగా, సావధానంగా, శ్రద్ధగా పారాయణము చేస్తే, కార్య సాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటిని  ఏరకంగా తొలగించు కోవాలో అవగాహన చేసుకుని విజయము వైపు సాగగలము అని.

*నిజానికి ఏ విషయమైనా సంపూర్ణ అవగాహన చేసుకుని ఆచరణలో పెడ్తే కానీ పని ఉండదు*.


ఆటంకములను మూడు విధములుగా  విభజిద్దాము. *సాత్వికాటంకము, రాజసాటంకము, మరియు తమొగుణాటంకము*.

వివరంగా పరిశీలిద్దాము... సాత్వికాటoకము ఏర్పడినప్పుడు మర్యాద పాటించి సాధు వర్తనముతో బయట పడడము (మైనాక పర్వత ఉదంతము). రాజసాటంకము నుండి సూక్ష్మ బుద్ధి మరియు ఉపాయముతో  తప్పించుకోవాలి (సురస రాక్షసి వ్యవహారము). ఇక తమోగుణాటoకాలను ధైర్యము, బల ప్రయోగాలతో ఎదుర్కొన వలసి ఉన్నది (సింహిక ఛాయా గ్రహణి).

 ఇంకో మాటలో చెప్పాలంటే దండనతో బదులు చెప్పాలి.


మనం ఏదైనా గొప్ప కార్యము/లక్ష్యము సాధించాలంటే ఎదురయ్యే ఆటంకాలు ఏరకమైనవో గ్రహించి, ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి. ముఖ్యంగా తీవ్రవాదం లాంటి సమస్యలను, అంతే తీవ్రంగా ఎదుర్కొని ఉక్కు పాదంతో అణచి వేయాలి, అక్కడ సాత్విక, రాజస ఉపాయాలు పని చేయవు.


ఒక వ్యక్తి జీవితానికైనా, మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మకమైన వ్యూహము పనికొస్తుంది.


ఈ రకంగా సుందరకాండలోని  ఘట్టాలను అవగాహన చేసుకుని, మన జీవితానికి అన్వయించుకొని ఆచరణలో పెడితే కాని పని అంటూ ఉండదు.

*అందుకోసరము సుందరకాండ పారాయణము అందరూ చేయాలి, కపీశ్వరుని కార్యసాధకత్వవాన్ని అవగాహన చేసుకుని అనుసరించాలి*.

అందరికీ గల సాధారణ సందేహము...రామాయణము నందున్న తక్కిన కాండలకు తత్కాండాoతర్గత కథా సూచకములైన నామములుండగా, ఈ కాండకు విడిగా *సుందరకాండ* అనుటకు కారణమేమి.

ఈ సందేహ నివారణా సమాధానము... *సుందర హనుమత్ మంత్రమును మహర్షి వాల్మీకి ఈ కాండమున నిక్షేపించడము వలన సుందరకాండ అను పేరు వచ్చినది*.


శ్లోకము....

*సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథః, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం?*.


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: