9, జులై 2024, మంగళవారం

భగవంతునిపై నమ్మకం*

 *భగవంతునిపై నమ్మకం*


ఆ గురువుగారు ఎల్లప్పుడు అంటే వారానికి ఒక సారైనా సత్సంగాన్ని నిర్వహిస్తూనే వుంటారు. వారికి ఆ కాలనీలో ఎందరో శిష్యులు ఉన్నారు. గురువు గారు ఏదో కాషాయ వస్త్రాలు ధరించిన వారు కాదన్నట్టు. శిష్యులంటే ఆ కాలనీ వాస్తవ్యులే. ఆ గురువు గారు ఆధ్యాత్మికంగా ఎంతో విలువైన విజ్ఞానాన్ని సముపార్జించినవారు. ఆ శిష్యబృందం అంతా వయోవృద్ధులు, వారి ప్రవచనాలకు చెవి కోసుకొంటారు. 


ఒకానొక సత్సంగ సమయాన్న ఒక వ్యక్తి కనబడలేదు. వెంటనే వాకబు చేయగా వారు కొంత అస్వస్థతకు లోనయ్యారని ఇంకా కోలుకోవడానికి సమయం పట్టగలదని తెలిసింది. 


వెంటనే గురువు గారు ఆనాటి సత్సంగ సమయాన్ని ఆ అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రులు త్వరగా  కోలుకోవడానికి ప్రార్థిద్దాం అని చెప్పగా అందరూ సరేనని భగవత్ప్రార్థనలో నిమగ్నమయ్యారు. అంటే ఆ మిత్రుని తలుచుకుంటూ వారి ఆరోగ్యం కుదుట పడాలని ఆలోచిస్తూ కొద్ది సేపు కళ్ళు మూసుకొని మౌనంగా భగవంతుని వేడుకొన్నారు. 


ఆ సత్సంగంలో ఒకానొక సభ్యుడికి ఇలాంటివాటిపై నమ్మకం లేదన్నట్టు. వెంటనే వారు మీరందరూ వేడుకున్నంత మాత్రాన వారు కోలుకోగలరా అని వేళాకోళం చేసారు. 


అంతే, ఆ గురువుగారు కోపం ప్రదర్శిస్తూ ఆ సభ్యుడితో మీకేమైనా మతి పోయిందా, ఏదో ఒక మంచి పనిచేయడానికి పూనుకొంటే ఇలా అపశకునంగా మాట్లాడటమేంటి, మీకు భగవంతునిపై  నమ్మకం లేకపోతే ఇక మీదట మీరు రానక్కరలేదు అని చెడామడా చెప్పేసారు. 


ఆ సభ్యుడు కూడా మిక్కిలి కోపంతో నాకు బుద్ధి లేదంటారా, మీరు క్షమాపణ అడగకపోతే మిమ్మల్ని నేను కొట్టగలను సుమా అని అరిచాడు. 


వెంటనే గురువు గారు *నేను కావాలనే లేని కోపాన్ని ప్రదర్శిస్తూ కేవలం మీకు మతిపోయిందానని అడిగినంత మాత్రానే నేను చెప్పింది నిజమన్నట్టు మీకు మతిపోయినట్టే అనుకొని కోపం వచ్చింది కదా, అంటే నా తిట్టుపై నమ్మకం ఉంచికదా నాపై విరుచుకుపడుతున్నారు. మీరు ఇంతగా మాపై విశ్వాసం కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు భగవంతునిపై మాకు నమ్మిక కలగడంలో తప్పేముంది. వారు తప్పక మా ప్రార్థనలకు తొలి ఒగ్గగలరని మాకూ పూర్తి విశ్వాసము ఉంది* అని అన్నారు. 


అంటే భగవంతునిపై నమ్మకం ఉంచి ఏది ప్రార్థించినా తప్పక నెరవేరగలదన్న పూర్తి విశ్వాసం ఎంతైనా అవసరం.

కామెంట్‌లు లేవు: