9, జులై 2024, మంగళవారం

వివేక చూడామణి

 *వివేక చూడామణి విశిష్టత* 


అద్వైత సిద్ధాంతాన్ని సుస్పష్టం గా తెలియ చెప్పడానికి శ్రీ ఆదిశంకర భగవత్పాదులు రచించిన ఉత్తమ గ్రంథాలలో వివేక చూడామణి కూడా ఒకటి. ఈ గ్రంథంలో ఆయన వివిధ సిద్ధాంతాలు వాటి యొక్క అన్ని దశలను సంక్షిప్తంగానే కాకండా స్పష్టంగా వివరించారు. ప్రధానంగా ఈ గ్రంధంలో వేదాంత తత్త్వాన్ని తెలుసుకోవటానికి కావలసిన యోగ్యతను, జ్ఞాని అయిన శిష్యుడు తన గురువుని తత్త్వాన్ని అడిగే విధానాన్ని, అటువంటి శిష్యునికి తత్త్వాన్ని సక్రమంగా బోధించే గురువుయొక్క న్యాయాన్ని చెప్పారు. 

మన పరమ గురువు జగద్గురువులు శ్రీశ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఈ గ్రంథంపై చక్కని ఉపన్యాస భాష్యం రాశారు. దాని ద్వారా ఈ గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. శ్రీ శంకర భగవ త్పాదులు ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని చివరి శ్లోకంలో చెప్పారు.

అంటే మోక్షమార్గం గురించి ఈ గ్రంథంలో చెప్పబడింది. అంటే, భగవత్ భక్తులకు ఆ మార్గం గురించి ప్రధానంగా చెప్పారు.

మోక్షం పట్ల ఆసక్తి ఉన్నవాడు విషంలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టాలి. తృప్తి, దయ, ఓర్పు, నిజాయితీ, శాంతి, నియంత్రణ ఇత్యాది విషయాలను అమృతాన్ని సేవించినట్లే అలవర్చుకోవాలి. ఈ యోగ్యతను పొందినవాడు మాత్రమే మోక్షమార్గంలో ప్రవేశించగలడని అర్థం. 

ఎన్నో అద్భుతమైన విషయాలతో కూడిన ఈ వివేకచూడామణిని అందరూ చదవండి. బాగా అర్ధంచేసుకుని భగవత్ ప్రసాదమైన ఈ జీవితానికి న్యాయం చేయండి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

కామెంట్‌లు లేవు: