10, డిసెంబర్ 2024, మంగళవారం

భగవద్గీత - నేటి ఆవశ్యకత*

 


*భగవద్గీత -  నేటి ఆవశ్యకత*


మన దేశంలో ఈ మధ్యకాలంలో కొన్ని వింత ప్రచారాలు చూస్తున్నాం.‌ భారతీయులకు ప్రత్యేకంగా హిందువులకు నీతి మార్గం, సర్వమత సహనం  నేర్పుతామని ప్రగల్భాలు పలికేవారు, దానికి వంత పాడే  పనికిమాలిన లౌకికవాదులను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కావట్లేదు. అటువంటి వారు హిందూ ధర్మ విచ్చిన్నానికి కృషి చేస్తూ మతాంతికరణలపై దృష్టి సారించినవారు అని గ్రహించాలి. అటువంటి వారు ఎంతటి దృష్టాత్ములో ఊహించుకోండి. ఉత్కృష్టమైన సనాతన ధర్మాన్ని వీడి పర ధర్మాన్ని స్వీకరించేవారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆచరణలో ఏదైనా లోపాలు ఉన్నా కూడా స్వధర్మం శ్రేయస్కరమైనది. స్వధర్మంలో మరణించడమైనా మంచిది కాని పర ధర్మం భయహేతువు అన్న విషయాన్ని గ్రహించాలి. భగవద్గీత మనకి ఏమి చెబుతోంది, స్వభావం చేత సంప్రాప్తమైన ధర్మాన్ని ఆచరించేవాడు ఉన్నతుడు అని. ఎవరు ఎవరిని స్వధర్మపరిత్యాగం చేసేటట్లు చేయకూడదని, ఏ కారణం చేతనైనా తాము గాని తమ పుర్వీకులు గాని స్వధర్మాన్ని పరిత్యజిస్తే దానిని పునః పరిగ్రహించడానికి మనం ప్రయత్నించాలని సూచిస్తోంది.


ఇక అసలు విషయానికి వద్దాం. 

హిందువులకి సర్వమత సహనాన్ని నేర్పుతామనేవారు ముందుగా వారి జాతి చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటే మంచిది. ప్రపంచంలో అన్ని జాతుల వారు ముక్తకంఠంగా అంగీకరించే గ్రంథము ఏదైనా ఉంది అంటే అది ఒక భగవద్గీత మాత్రమే. భగవద్గీత ఆధ్యాత్మిక మార్గాన్నే కాదు శాంతియుతమైన లౌకిక జీవన విధానాన్ని కూడా బోధిస్తుంది. అందుకే ప్రపంచంలో ఏ మతం వారైనా నిర్దిష్టమైన ప్రమాణాలతో ఆలోచించేవారు అందరూ కూడా భగవద్గీత  స్థానాన్ని అద్వితీయంగా భావిస్తారు. 

ఇతర మతాల సిద్ధాంతం one man's god is another devil, అంటే ఒకరి దేవత మరొకరికి దయ్యమని. సనాతన హిందూ ధర్మం దానిని నిరాకరిస్తుంది. 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు "ఏ  భక్తుడైనా సరే తాను నమ్మిన స్వరూపాన్ని శ్రద్ధాపూర్వకంగా ఆరాధిస్తాడో వానికి ఆ ఆరాధన ఫలితాన్ని నేను  అందజేస్తాను అని  చెప్తాడు.  ఇంతకన్నా లౌకికవాదం ఏం కావాలి? ఇంతకన్నా సర్వమత సమానం ఏం కావాలి?. 


*యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి ।*

*తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్||*


భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను. అలాగే 

*స తయా శ్రద్ధయా యుక్తః*

 *తస్యారాధనమీహతే ।*

*లభతే చ తతః కామాన్మయైవ*

 *విహితాన్హి తాన్ ।।*

.. అతని భక్తి యొక్క ప్రయోజనాలను సమకూర్చేది నేనే అని చేబుతాడు.  

భక్తులు ఏ మార్గాన్ని ఎన్నుకున్నా వారి ప్రయాణం చివరికి చేరేది నా మార్గాన్నే అంటూ అన్ని ధర్మాలు ఒకటే అని స్పష్టంగా తెలియజేశారు. ఇంతటి విశాల దృక్పథం కల సనాతన ధర్మం ఇంత గొప్పదో తెలుసుకోండి. దానిని ఆచరిస్తున్న భారతీయుల హృదయాలు ఎంతటి పవిత్రమైనవో ఆలోచించండి. అటువంటి భారతీయులకు సర్వమత సమానత్వాన్ని బోధిస్తామనేవారు ఎంతటి దుస్సాహసానికి పాల్పడుతున్నారో తెలుస్తోంది. అటువంటి వారికి అడ్డుకట్ట వెయ్యాలి, లేకుంటే వారి అబద్ధాలే  నిజం అని నమ్మే స్థితిలోకి ప్రజలు వెళతారు. అలా చేయాలి  అంటే మనకి మన సనాతన ధర్మం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. దాని కొరకు మనందరం భగవద్గీతను తప్పక చదవాలి. అందరితో చదివించాలి. కంచి పరమాచార్య గారు చెప్పినట్టు మానవుని ప్రతీ సమస్యకి పరిష్కారం భగవద్గీతలో కనిపిస్తుంది. 

స్వధర్మాన్ని ఆచరించడమంటే ధర్మాన్ని కాపాడుతున్నట్టే.‌

సర్వేజనా సుఖినోభవంతు. 


మృశి

10.12.2024

కామెంట్‌లు లేవు: