🙏భవభూతి మహాకవి🙏
భవభూతి పేరు తలచుకుంటే చాలు ఒళ్ళు పులకరిస్తుంది. విలక్షణము విశేష ప్రజ్ఞ కలిగిన కవి.
నాటకాలలో లక్షణ శాస్త్ర ప్రకారం ప్రధాన రసం శృంగారరసం గాని వీర రసం ఉండాలి మిగిలిన రసాలు అంగ రసాలు గానే ఉండాలి ప్రధాన రసంగా ఉండకూడదు. కానీ భవభూతి కరుణ రసాన్ని ప్రధానం చేసి ఉత్తరరామ చరిత్ర నాటకం వ్రాశాడు. లాక్షణికులు విమర్శించినా లెక్కచేయలేదు. అయితే నాటక ప్రపంచంలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు గడించింది. నూతన ప్రయోగం చేసి విజయం సాధించిన ఘనుడు భవభూతి.
సంస్కృత మహాకవుల ఘనసంప్రదాయ పరంపరలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, బాణుడు, దండి, భాసుడు, మొదలైన అద్భుత శారదా సంతతిలో ఒక దివ్యకర్పూరకళిక భవభూతి మహాకవి ఒకరు.
ఈ ఉత్తర రామాయణాన్ని భవభూతి ఆయన ఒక చోట కరుణ రసం ఒక్కటే రసం అని చెప్పాడు.
శ్లోకం. ఏకో రస కరుణ ఏవ నివర్తి ఖేదా
భిన్న పృథగ్ పృథగి వాశ్రయతే వివర్తా
ఆవర్త బుద్బుద తరంగ మాయాన్ వికారాస్
అంభో యధా సలిల మే వహి తత్సమస్తం
కరుణకు భావస్థాయి శోకం. ఎందుకంటే వాల్మీకి మొదటి శ్లోకం
“మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః|
యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం||”
ఓ కిరాతుడా! కామమోహితమైన క్రౌంచమిథునం లోని ఒక పక్షిని చంపి, నీవు శాశ్వతమైన అపకీర్తిని పొందావు, అంటూ శోకతప్త హృదయుడైన వాల్మీకి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కాని తన మనస్సును కరుణరస పూరితమైన దృశ్యంనుండి మరల్చుకోలేక మథనపడసాగాడు. అతని మానసికస్థితిని గమనించిన బ్రహ్మ, వాల్మీకితో ‘నీవు శోకంతో ఉచ్చరించినది ఛందోబద్ధమైన శ్లోకమైంది. నీవు రామచరితమును రచింపుము. అది పర్వతాలు, నదులు ఉన్నంతవరకు శాశ్వతకీర్తిని సంపాదిస్తుంది’ అన్నాడు
వాల్మీకి మొదటి శ్లోకం కరుణ నుంచే ఉద్భవించింది. దాశరధీ కరుణా పయోనిధీ అని జనులు రాముడ్ని ప్రార్ధించడం అందుకే. ఈ ఉత్తర రామాయణంలో సీతా రాముల వియోగం, నిర్యాణం కారణంగా కరుణ రసం పతాక స్థాయిలో ఉంది. తిక్కన సోమయాజి నిర్వచనోత్తమ రామాయణం ( వచనం లేని, కేవలం పద్యకావ్యం) రచించాడు. తరువాత కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని చంపూ కావ్యంగా రాసాడు. నిజంగానే కవి అనేవాడు రాముడి మాట తలవకుండా ఉండలేడు. అంత శక్తి ఆకర్షణ ఉన్నవాడు రాముడు.
భవభూతి పేరు నుంచి ఆయన కాలం నిర్ణయంవరకు అన్నీ నిర్వివాదంగా చెప్పడం కష్టమనేచెప్పాలి. వీరు దక్షిణ భారతదేశంలోని పద్మపురంలో, వైదిక అనుష్ఠానపరులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేరు. వాజపేయయాగం చేసిన ఒక మహాకవి వీరి వంశపరంపరకి చెందినవారని చరిత్ర చెపుతోంది. ఈ వాజపేయ యాజివర్యుల తరంనుంచి లెక్కిస్తే భవభూతి ఐదవతరానికి చెందినవాడు. ఆ పరంపరలో భట్టగోపాలురవారు జన్మించేరు. వీరు వైదిక, లౌకిక విద్యలలో ఆరితేరి,అఖండఖ్యాతిని ఆర్జించేరు. వీరి పుత్రుడు నీలకంఠుడు కూడా తండ్రి అడుగుజాడలలో నడిచి అంతగానూ గణుతికెక్కేడు. నీలకంఠుడి కుమారుడే భవభూతి. ఐతే భవభూతి అసలుపేరు శ్రీకంఠుడు అనే వాదంవుంది. కొన్నిచాటూక్తులవల్ల ఇది నిజమేమోననిపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం:—
“తపస్వీ కాం గతోsవస్థాం
ఇతి స్మేరాననావివ |
గిరిజాయాః స్తనౌ వన్దే
భవభూతి సితాననౌ” ||
“భవాత్ శంకరాద్వా భూతిః కావ్యనిర్మాణ దక్షతా విభూతిః ప్రజ్ఞా వా
సంప్రాప్తత్వేన భవభూతిరితి” |
“భవుడు అంటే శంకరునినుంచి, కావ్యనిర్మాణదక్షత అనే ఐశ్వర్యం లేక ప్రజ్ఞని పొందడంచేత భవభూతి అనే (పేరు వచ్చింది).” అని కొందరు నిర్వచించేరు.
భవభూతి తనరూపకాలు కాలప్రియానాథదేవ మహోత్సవాలలో భాగంగా ప్రదర్శితమైనట్లు చెప్పేడు. ఈ దేవుడు యమునాతీరంలోని “కాల్పి” లేక ‘కాలప్రియ’ లోవున్న సూర్యదేవుడని చరిత్ర నిర్ణయం.
సంస్కృతకవి ఐన భవభూతి, ప్రాకృత కవి ఐన వాక్పతిరాజు సమకాలికులే కాక వీరిద్దరూ యశోవర్మమహారాజు పాలించిన కనోజురాజ్యంలో ఆస్థానకవులుగా ప్రశస్తి పొందేరని చరిత్ర చెపుతోంది. వాక్పతిరాజు, భవభూతి రచనలగురించి ఇలాగ అన్నాడు:—
“సాగరసదృశాలైన భవభూతి రచనలు ఆఖ్యానరచనకు మార్గదర్శకాలు“. భవభూతి గురువు “జ్ఞాననిధిపరమహంస” అని తెలుస్తూంది. భవభూతి సాహిత్యంలోనేకాక వేద, వేదాంగాలలోను, వివిధశాస్త్రాలలోను అపారజ్ఞానం కలవాడు. ఆయన సాహిత్యంలో అనేకగ్రంథాలు రచించడమేకాక, అనేకశాస్త్రగ్రంథాలుకూడా వ్రాసిన దాఖలాలువున్నా,
1. “మహావీరచరితమ్ ” |
2. “మాలతీమాధవమ్ ” |
3. “ఉత్తరరామచరితమ్ ” |
అనే ఈ మూడు గ్రంథాలు మాత్రమే మనకి మిగిలేయి. మిగిలిన గ్రంథాలలోని శ్లోకాదులు అనేక ఇతర రచయితల రచనలలో ప్రాస్తావికంగానో లేక ఉదాహరణప్రాయంగానో మనలని పలకరిస్తాయి. వారి “మహావీరచరితమ్ ” రాముడి కథనే ఉత్తరకాణ్డ ముందు జరిగినది నాటకంగా మలచి మనముందుంచింది. “ఉత్తరరామచరితమ్ “లో వాల్మీకి ఉత్తరకాండలోని కథనే దృశ్యకావ్యరూపంలోపరమరమణీయంగా భవభూతి మనకి అందించేడు. కాళిదాసు, భవభూతి, భాసుడు,శూద్రకుడు వంటి నాటకకర్తలు సంస్కృత సాహిత్యంలో విశేష ఖ్యాతి గడించారు.. సోమదేవుడు, ధనంజయుడు, కుంతకుడు, క్షేమేంద్రుడు, మమ్మటుడు, మహిమభట్టు మొదలైనవారెందరో కవులు, లాక్షణికులు భవభూతిని శ్లాఘించి, వారి రచనలలోని అనేక శ్లోకాలని తమ-తమ గ్రంథాలలో ఉదాహరణాత్మకంగా వినియోగించుకున్నారు. వీటి అన్నింటిని అనుసరించి చూస్తే భవభూతి రచనాకాలం క్రీ.శ.700—730 ప్రాంతంగా చరిత్ర నిర్ణయం చేసింది. కవి,లాక్షణికుడు ఐన రాజశేఖరుడు తాను భవభూతికి అపరావతారంగా వర్ణించుకునేస్థాయికి, ఆయనకి భవభూతి పట్ల ఆరాధనాభావం వుంది.
తన తరవాత కాలంలో ఎంతో కీర్తి, ప్రతిష్ఠలు పొందిన భవభూతి, తన జీవితకాలంలో జనబాహుళ్యంలోను, రాజాస్థానాలలోను, సమకాలీన కవులలోను కూడా పేరు -ప్రఖ్యాతులు సంపాదించేడు. కాని కొందరు విమర్శకులు లేక రంధ్రాన్వేషకుల కాఠిన్యానికికూడా ఆయన గురి ఐనట్లు ఆయన రచనలలోని వారి ప్రతిస్పందనలు నిరూపిస్తున్నాయి. కవులకి, కళాకారులకి చరిత్రలో ఇవి క్రొత్త అంశాలు ఏమాత్రమూకాదు. మహాకవి భవభూతి మహామృదుహృదయుడు కావడంవల్ల వాటికి అంతగా నొచ్చుకున్నాడు. ఆయన బోధ, సందేశము మాత్రం అనితర సాధ్యమైన పని.
వాల్మీకి రామాయణంలోని ఉత్తర రామాయణ కథను ఇతివృత్తంగా గ్రహించిన భవభూతి ఆ మూలకథలో అనేక మార్పులు ప్రవేశపెడుతూ, కొత్త పాత్రలను కల్పిస్తూ, కొత్త కల్పనలను చేరుస్తూ ఉత్తరరామచరిత్ర నాటకాన్ని అద్వితీయంగా రచించాడు. మూలకథకు భిన్నంగా ఉత్తరరామచరిత్ర నాటకంలో సృష్టించిబడిన ప్రధాన మార్పులు, కల్పనలు చూద్దాము.
వాల్మీకి ఉత్తరరామాయణ కథ సీతా మరణంతో విషాదాంతం కాగా భవభూతి 'ఉత్తరరామచరిత్ర' సీతారాముల పునఃకలయికతో సుఖాంతం అవుతుంది.
వాల్మీకి ఉత్తరరామాయణ కథ సీతా ప్రాధాన్యంతో సీతా చరిత్రగా కొనసాగితే, భవభూతి 'ఉత్తరరామచరిత్ర' రాముడు ప్రధానంగా రామచరిత్రగా కొనసాగుతుంది.
మూలకథలో లేని ఆత్రేయి, తరళ, వాసంతి, తమస వంటి కొత్త పాత్రలు నాటకీయత కొరకు ఉత్తరరామచరిత్రలో కల్పించబడ్డాయి.
మూలకథకు భిన్నంగా కొత్త సన్నివేశాలను కల్పించబడ్డాయి: ఉదాహరణకు
వాల్మీకి ఆశ్రమంలో విదిచిపెట్టబడిన సీత గంగానదిలో దూకడం, గంగానదిలోనే ప్రసవించడం,
పాతాళలోకంలో సీత ఎవరికీ కనబడకుండా వుండటం,
పాతాళలోకంలో సీత భూదేవి, గంగలతో కలసి వుండటం,
రాముని విరహవేదనను, సీతావియోగ విలాపాన్ని అత్యంత కరుణరసభరితంగా వర్ణించడం
బాలుడైన చంద్రకేతువును యాగాశ్వానికి రక్షణగా పంపడం
సీతారాముల కలయిక సన్నివేశం మొదలైనవి
.
నభూతో నభవిష్యతిగా కరుణరసానికి పట్టం కట్టిన ఈ నాటకంలో చిత్రితమైన మహోన్నత పాత్రలు, ఉదాతమైన విలువలు, కళాత్మకత, అత్యంత కరుణరస ప్లావితమైన కథా సంవిధానం మొదలైనవి ఈ నాటకాన్ని మహత్తర నాటక కావ్యంగా, సంస్కృత సాహిత్యంలో అత్యధిక నాణ్యత సరసన సమున్నతంగా నిలబెట్టాయి. ఈ సంస్కృత నాటకం అన్ని భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర యూరోపియన్ భాషలలో సైతం అనువదించబడింది. ఈ నాటక రచనలో భవభూతి చూపిన ఒరవడి ఇతర నాటక కర్తలకు ప్రేరణ కలిగించింది.
భవభూతి రచించిన ఉత్తరారామచరిత్ర నాటకాన్ని ఆదర్శంగా తీసుకొన్న తరువాత తరం కవులు భవభూతి వలె మూల రామాయణంలో మార్పులు చేరుస్తూ, కొత్త సన్నివేశాలను సృష్టిస్తూ, మూలకథకు భిన్నంగా సరికొత్త రూపాలలో సంస్కృత రామాయణ నాటకాలను రాయడం ప్రారంభించారు. వీరిలో శక్తి భద్రుడు (ఆశ్చర్యచూడామణి), మాయురాజు (ఉదాత్త రాఘవం), రాజశేఖరుడు (బాల రామాయణం), దిజ్ఞాగుడు (కుందమాల) మొదలైనవారు ముఖ్యులు. అయితే భవభూతి పెట్టిన ఒరవడిలో అనుకరిస్తూ వచ్చిన తదనంతర రామాయణ నాటకాలలో దిజ్ఞాగుని "కుందమాల" లాంటివి కొన్ని తప్ప మిగిలినవి అంతగా ప్రజాదరణను పొందలేకపోయాయి.
కుందమాల గురించి వేరే వ్యాసం వ్రాస్తాను.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి