*గాడిద బ్రతుకు*
ఆ నాలుగు కూడలిలో ఎప్పుడూ ట్రాఫిక్ రద్ధీగానే ఉంటుంది. ఆ కానిస్టేబుల్ వాహనలను అదుపుచేయడానికి వీలుకాక సతమతమవుడం నేను ఎన్నో సార్లు చూసాను. ఆ ట్రాఫిక్కుకు తోడు ఈ రోజు మధ్యాహ్నం గుంపు గుంపుగా జనం అక్కడ గుమిగూడుతున్నారు. ఏమయిందని ఓ సారి దగ్గరికెళ్ళి చూసాను.
ఊరేగింపులా కనబడింది. ఓ గాడిదను కుంకుమ పుష్పాలు పసుపుచందనాలతో సింగారించి ఏదో దేవుని ఛాయాచిత్రాన్ని పుష్పాలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకొని వెళుతున్నారు. గాడిద పై భగవంతుడి ప్రతిమ ఏంటని ఆరా తీయకండి. ఏదో మొక్కుబడి కాబోలు. ఊరి వెలుపుల ఉన్న చెరువు దగ్గర పూజలున్నాయని అందువలనే ఈ ఊరేగింపని ఆ జనసమూహంలో అంటూండగా విన్నాను.
ఆ గాడిదను భగవంతుడిని జనసమూహం మ్రొక్కుకొంటున్నారు. హారతి దీపాలు ప్రసాదాలు సమర్పించుకొంటున్నారు. సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. భక్తుల ఆరాధన నిమిత్తం అక్కడక్కడ ఊరేగింపును నిలిపి అందరికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలా చెరువు దాకు రెండు కిలోమీటర్ల దూరం అధిగమించడానికి వారికి రెండు గంటల సమయం పట్టింది.
నేను కొంతసేపు వీక్షించి నా గృహం వైపు మరలాను. సాయంత్రం మళ్ళీ అటు ఆ నాలుగు రోడ్ల కూడలి వైపు ఏదో పనిమీద వెళ్ళాను. అప్పటికే చెరువు దగ్గర పూజ ముగిసినట్టుంది. జనమంతా వెనుదిరిగి వస్తున్నారు. ఆ గాడిద కూడా ఉంది. కాని ఈ సారి గాడిదపై దేవుడి ప్రతిమ లేదు, అలంకరణ కూడా లేదు. ఇందాకా చూసిన గాడిదేనా ఇది అన్నట్టు కనబడింది. జనమెవ్వరు ఆ గాడిదను పట్టించుకోలేదు. గాడిద కూడా ఏదో చిన్నబోయినట్టు కనిపించింది. వారందరి దృష్టిని తన వైపు మరల్చి మధ్యాహ్నం లాగా అందరితో మ్రొక్కించుకోవాలని ప్రయత్నించడం మొదలెట్టింది. ఓండ్ర పెట్టింది. ఎవరైనా అటువైపు చూస్తే కదా, వారందరూ చూసినా ఈ సారి మ్రొక్కకుండా దాని అరుపులను భరించుకోలేక గాడిదను రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. ఆ ధాటికి తట్టుకోలేక గాడిద పలాయనం చిత్తగించింది.
మన అంటే విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అలాగే మరి. ఉద్యోగాల్లో ఉన్నంత దాకా ఎంతో వైభవాలను అనుభవించాం. దీపావళి వస్తుందంటే ఓ వారం ముందు నుండి ఖాతాదారులు, సరఫరాదారులు, తోటి ఉద్యోగులు ఇలా ఎందరో దీపావళీ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లనీ, డ్రైఫ్రూట్సనీ, తాజాపండ్లనీ బహుకరించేవారు. చాలామటుకు ఇలాంటి బహుమతులను తోటి ఉద్యోగస్తులకు పంచి మిగిలింది ఇంటికి తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఇక ఇంట్లో స్వీట్లు సేవరీలని చేయడం దండగ. వీటితోనే సరిపుచ్చుకొనేవాళ్ళం.
కాని ఇప్పుడు పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. పదవీ విరమణ గావించిన తర్వాత ఇదే మొదటి దీపావళి. ఎవరైనా మన పాత పరిచయాలు, స్నేహితులు, ఉద్యోగులు వస్తారా అని ఎదురుచూడడంతోనే కన్నులు కాయలు కాచాయి. ఒక్కరైనా మన ఇంటివైపు వారి దృష్టిని మరల్చిన పాపానికి పోలేదు. మధ్యాహ్నం దాకా ఇలాగే గడిచిపోయింది. దీపావళి ఎలాగైనా జరుపుకోవాలిగా మరి. ఏదో వీలయినకాడికి స్వీట్లు హాట్లు అని స్వతహాగా చేసుకొన్నాం.
మన విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి ఆ గాడిద పరిస్థితి లాంటిదే. దేవుడి ప్రతిమ తనపై ఉన్నంతకాలం అలంకరణలు, మొక్కుబడులు, నైవేద్యాలు, నమస్కారాలు అన్నీ కొనసాగాయి. ఒక్కసారి భగవంతుని విగ్రహం తన వీపు నుండి తొలగిన తర్వాత దానిని ప్రజలు ఛీ కొట్టిన వాళ్ళే కాని ఎవ్వరు ముట్టుకున్న పాపానికి కూడా పోలేదు.
గాడిద బ్రతుకు అంటే ఇదేనేమో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి