10, డిసెంబర్ 2024, మంగళవారం

కుతూహలం

 ఇండియా లో సందుకో గుడి ఉంటుంది.  భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు అని పాశ్చాత్య దేశం లో ఓ మేధావికి కుతూహలం పుట్టి.దీనిమీద 

 

డాక్యుమెంటరీ వ్రాయాలి అనుకుని వెంటనే మన రాష్ట్రానికి వచ్చాడు. ఆరోజు రెస్ట్ తీసుకుని ఏ దేవాలయానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగా వస్తుందో తర్జన భర్జనలు పడి హోటల్ ఓనర్ కి  

విషయం చెప్పి అడిగితే మామూలు రోజుల్లో ఎక్కువ గా రద్దీ వుండని. ఈ మేధావికి కావలసిన సరైన సమాచారం ఇచ్చే జ్ఞాని అయిన పూజారి వుండే శివాలయానికి వెళ్ళమని చెప్పాడు.


మర్నాడు తీరికగా హోటల్ ఓనర్ చెప్పిన శివాలాయనికి ఆ మేధావి డాక్యుమెంటరీ కోసం వచ్చాడు.. అక్కడ పూజారి గారు ఎర్ర పట్టువస్త్రం లాటిది కట్టుకుని వున్నారు.. ఆ ప్రక్కన మరో భారీకాయం టేబుల్ దగ్గర  కుర్చీ లో కూర్చుని ఉన్నాడు. ఆ ప్రక్కన రెండు చేతులకి 10 ఉంగరాలు పెట్టుకుని మరో భారీ కాయం ఉంది.. భక్తులు వస్తున్నారు ఆ రెండో భారీ కాయం అప్పుడప్పుడు వచ్చే భక్తులపై ఏవేవో అరుస్తున్నాడు.. 

 

భక్తుల రద్దీ అయిన తర్వాత మన మేధావి పూజారి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళాడు.. ఇంగ్లీష్ భాష లో మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి అన్నాడు...పూజారి గారు యం ఏ చదువుకున్నారు. ఒంటి గంటకి ఫ్రీ అవుతాను వీళ్లిద్దరూ కూడా వెళ్ళిపోతారు వైట్ చెయ్యండి అని ఇంగ్లీష్ భాష లో చెప్పి దర్శనం చేయించి తీర్థం ఇచ్చి శఠగోపం పెట్టేసారు..  


అది మొదటి  భారీ కాయానికి అర్ధం కాలేదు..రెండో భారీ కాయం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్ లో ఎదో చూస్తున్నాడు ..మొదటి భారీ కాయం ఏంటట అని గర్జించాడు. అబ్బే ఏమీ లేదు చిన్న ఇంటర్వ్యూ కావాలట అని పూజారిగారు చెప్పారు, దానికి ఆ భారీ కాయం ఇక్కడ ఇంటర్ చదివే వాళ్ళు ఎవరూ లేరని చెప్పండి. ఈ లోపల ఒంటి గంట అయ్యింది ఆ రెండు భారీ కాయాలు సాయంత్రం 5 గంటలకు వస్తాం అని చెప్పి తమ స్వంత  కార్లలో 

వెళ్లిపోయారు.. పూజారి గారు గర్భ గుడికి తాళం వేసి గుడి ఆవరణ ల్  ఓ చల్లని చెట్టు క్రింద బెంచి పై ఆ మేధావిని కూర్చోబెట్టి తాను కూర్చుని ఇప్పుడు అడగండి మీకు ఏం కావాలో అన్నారు.. అప్పుడు మేధావి సార్ మీకు భక్తులు డబ్బు, కానుకలు చాలా ఇస్తారు అవి దేముడు మీరు ఎలా పంచుకుంటారు అని అడిగుతూ పూజారి గారిని నిశితంగా పరిశీలించాడు. పూజారి గారు బాగా బక్కగా ఉన్నా మంచి ఆరోగ్యం తో వున్నాడు.. 


భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు. అసలు ఆడబ్బంతా ఏమి చేస్తారు? అని అడిగాడు మేధావి పూజారిగారిని. 

పూజారి గారు డబ్బు, కానుకలు అని పేలవంగా ఓ నవ్వు నవ్వాడు.. అది పూర్వ వైభవం నాయనా గుళ్ళకి మాన్యాలు ఉండేవి రాజులు పూజారులకి ఎకరాలు పొలాలు ఇచ్చేవారట. ఇప్పుడు చాలామంది పూజారులకి  రోజు గడవడం కష్టంగా ఉంది నాయనా అన్నారు.  


ఇంటరెస్టింగ్ గా ఉంది విపులం గా చెప్పండి అన్నాడు మేధావి. డబ్బు,  కానుకలు  ఒకప్పటి మాట నాయనా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు..నేను ఎం ఏ చదివాను ఉద్యోగం కూడా వచ్చింది ఈ అర్చకత్వం అనువంశికం గా వస్తోంది మా నాన్నగారు ఓ 40 ఏళ్ల క్రితం చనిపోవడం వల్ల నాన్నగారి భాద్యత ఉద్యోగం వదిలి నేను తీసుకున్నాను.. ప్రస్తుత పరిస్థితి లో ప్రతీ గుడి కి పాలక మండలి ఉంటుంది ఈ గుళ్లు పై వచ్చే ఆదాయ పర్యవేక్షణ కి ఓ ప్రభుత్వ శాఖ ఒకటి ఉంటుంది. ఆదాయం ఉన్న ఏ గుడి అయినా ఆ ప్రభుత్వ శాఖ ఆధీనం లో కి వచ్చేస్తుంది.     ఇందాక గుడిలో  పది ఉంగరాలు పెట్టుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాఁట్సప్ చూస్తున్నవాడు ఆ ప్రభుత్వ శాఖ ఉద్యోగి. వచ్చిన భక్తులని డబ్బులు కానుకలు హుండీ లో వెయ్యండి అని గదమాయిస్తూ ఉంటాడు. ఇప్పటి దాకా ఎంత మింగాడో వాడికే తెలియదు. ఉద్యోగం లో చేరిన క్రొత్తలో వాడికి సైకిల్ కూడా లేదు ఈ రోజు ఓ కారు మూడు ఫ్లాట్ లు ఉన్నాయి. రూల్ ప్రకారం భక్తులు  పళ్ళెము లో వేసినవి మాకు చెందుతాయి హుండీ లో వేసినవి మాకు చెందవు.  ప్రతీ భక్తుడు హుండీ లో నే కానుకలు వేసేలా  చూడడమే వాడి  కర్తవ్యం.దేవాలయాల ఆస్తులు వాటి పై వచ్చే రాబడి అవి ఇవి చూస్తుంటాడు  ఇక భక్తులు పెద్దనోట్లు హుండీ లో వేసి చిల్లర,దొంగ నోట్లు చిరిగి అతికించబడిన నోట్లు మా పళ్లెం లో వేస్తారు..ఓ అరవై మంది పేర్లు చెప్పి అర్చన చేయిస్తారు కానీ సర్వే జనాః సుఖినో భవంతు అని ఒక్కడూ అడగడు. ఒకవేళ ఎవరైనా దైర్యం గా పెద్ద నోటు పళ్లెం లో వేస్తే అది వీరు చూస్తే ఆ రోజు మాకు నరకమే… ఇక ఎవరైనా భక్తులు అమ్మవారికి ఖరీదైన చీర పెడితే ఆ ప్రభుత్వం నియమించిన ఉద్యోగి తన కర్తవ్యం మర్చిపోయి ఆ చీరని లటుక్కుమని మాయం చేస్తాడు..  ఇక మొదటి భారీకాయం పాలక మండలి చైర్మన్,, సారా కాంట్రాక్టర్.. భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలు ఈయన ఇంట్లో నే ఉంటాయి. ఏదో ఉత్సవాలకు మాత్రామే బయటకు వస్తాయి..  

 

ఇక అన్నీ వేలం పాట లే. గుడిముందు కొబ్బరి కాయల దుకాణం నించి ప్రతీది వేలం వేస్తారు.. టిక్కట్లు అమ్మకం లో కుంభకోణాలు, ప్రసాదం కౌంటర్ లో కుంభకోణాలు. అమవారికి భక్తులు పెట్టే చీరలు జాకెట్ ముక్కలు కూడ వేలం వేస్తారు.. 

చివరికి భక్తులు కొట్టే కొబ్బరి కాయ కి కూడా వేలం పాటే. కాయలో క్రింద సగం భక్తుడు కి ఇవ్వాలి. పై భాగం ఎవరో హోటల్ వాళ్ళు వేలం పాడుకుంటారు. ఆ సగం చిప్ప కూడా మాకు దక్కదు.. చాలీ చాలని జీతం ఇస్తారు, అందులోనే నైవేద్యం మేమే వండాలి

ఈ పూజరిని ఎలా ఎప్పుడు పీకేయ్యాలా, మనకి అనుకూలం గా ఉండేవారిని ఎలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తారు.. ఆ ప్రభుత్వ ఉద్యోగి మా చేత చెప్పులు కూడా మోయిస్తాడు. దొంగ తనాలు అంటకడతారు కొందరు పూజారులు వీళ్ల టార్చెర్ భరించలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.. నాయనా.

 

గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పరాయి రాష్ట్ర దేముళ్లపై పడుతున్నారు.. చిన్న దేవాలయాల పరిస్థితి ఘోరం గా తయారయ్యింది.. రామాలయాలు వీళ్ళకి శ్రీరామనవమి నాడే గుర్తుకువస్తాయి. రామాలయం లో పని చేసే పూజారుల పరిస్థితి మరీ ఘోరం.. ఈ సందు చివరన ఉంది అక్కడికి కూడా ఓ  సారి వెళ్లి చూడండి.


 

మధ్యలో మేధావి.. మరి ఎలా బ్రతుకుతున్నారు.. 

 

నమ్ముకున్న దేముడిని పూజారి వదిలే ప్రసక్తి లేదు.

కొంచెం  ఆయుర్వేదం, హోమియోపతి, జాతకాలు, వాస్తు జ్ఞానం ఉంటుంది భక్తుల కు నమ్మకం ఎక్కువ.

పల్లెటూళ్ళలో  ఎవరికైనా జ్వరం వస్తే ముందు గుడి పూజారి దగ్గర కే వెళ్లేవారు ఆయన నేర్చుకున్న వైద్య జ్ఞానం తో మందు ఇస్తారు.. కొందరు భక్తులు పూజారి కి ఇస్తే మంచిది అని భావించి మాకు గుప్తం గా సాయం చేస్తుంటారు.. 

 

దారుణం ఏమిటంటే 1983 నించి కంచె లా దేవాలయాలని కాపు కాయవలసిన ప్రభుత్వమే దేవాలయాల ఆస్తులపై పడుతోంది.. 

 

దేముడి సొమ్ము తినే ఎవరైనా సరే ఆఖరికి పొందేది అధోగతే..


మరి ఇవన్నీ చూసి మీ దేముడుకి కోపం రాదా ఆయన ఏమీ చెయ్యడా.. అని మేధావి అడిగారు.. 

 

మంచి ప్రశ్న వేశావు నాయనా.. నీకు కోట్ల ఆస్తి ఉంది లేక లేక నీకు ఓ కొడుకు పుట్టాడు. వాడికి నువ్వు వాడి ప్రధమ జన్మదినానికి ఓ 10 లక్షలు పెట్టి చైన్ చేయించి మెడలో వేస్తావు, ఓ 5 లక్షలు పెట్టి వజ్రాల ఉంగరం చేయించి వెలికి పెడతావు. ఓ 10 వేలు పెట్టి బట్టలు కొని వేస్తావు. బర్త్ డే పార్టీ కి పుర ప్రముఖుల్ని పిలుస్తావు సాయంత్రం పార్టీ పెడతావు.. 

అందరూ వస్తారు. బుగ్గలు నిమిరి ముద్దులు పెడుతుంటారు. కానీ వాడి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాయి.. నువ్వు చేయించిన బంగారం కానీ వజ్రాల ఉంగరాలు కానీ 10 వేలు పెట్టి కొన్న బట్టలని వాడు పట్టించుకోడు.. 


పార్టీ కి పెద్ద వాళ్ళు వస్తారు అని ఎక్కడో రూమ్ లో బంధించబడిన  రోజూ తనతో ప్రేమగా ఉంటూ తనని ఆడించే లాలించే  తాతా నానమ్మ, తోటమాలి ల కోసమే వాడి కళ్ళు వెతుకుతుంటాయి..


 ఆ విధం గానే దేముడు కూడా తనే లోకం గా బ్రతికే భక్తుల కోసమే ఎదురు చూస్తుంటాడు. ఈ మాన్యాలు, ఆస్తులు ఆభరణాలు ఆయన పట్టించుకోడు.. నీ ఆనందానికి నువ్వు నగలు గట్రా చేయిస్తున్నావు, ఆయన ఏన్నడూ నాకు ఫలానా ది కావాలి అని అడగడు.. ఆయన సృష్టించిన వాటిని ఆయనకే ఇవ్వడం ఏమిటి.. మీ దేముడు ఏమీ చెయ్యడా అని ఆడిగావు మా అమ్మవారు ఊరికి కాపలా కాస్తూ ఉంటుంది. అయ్యవారు స్మశానం లో కూర్చుంటాడు.

ఎవరు పోయినా బంధు, మిత్ర జనం స్మశానం వరకే వస్తారు అక్కడ నించి అయ్యవారు చూసుకుంటారు..అని చెప్పారు.. ఈ లోపల పూజారి గారు పులిహోర చక్రపొంగలి ఆ మేధావికి పెట్టి మంచినీళ్ళు ఇచ్చారు. 

 

మేధావి మస్తిష్కాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన మేఘం ఆవరించింది..

 

మరి మీ దేముడికి వీళ్ళు మంచివాళ్ళు కాదు నా సొమ్ము తినేస్తారు అని ముందే తెలియదా అని అడిగాడు.. 

 

చూడు నాయనా దైవ వాసన లేనిదే ఆయన ప్రమేయం లేకుండా ఆయన సన్నిధి లో ఉండటం ఎవరికీ సాధ్యం కాదు.. పైగా దేముడు ఎవరి ఋణమూ ఉంచుకొడు.. వీరు గత జన్మలలో ఉత్సవాలలో పల్లకీ లు మోసే వాళ్ళో, త్యాగరాజు అన్నమాచారి కీర్తనల కచేరీ లో  వెనక నించి చిడతలు, సన్నాయి, తాళాలు వేసే వారో రకరకాలైన దైవ సేవలలో పాలు పంచుకున్నవారో అయ్యివుంటారు వారు సేవ చేశారు, దానికి ఫలం ఈ విధం గా ఇచ్చాడు. ఈ సదవకాశాన్ని ఇప్పుడు వారు దుర్వినియోగం చేసుకుంటున్నారు.. 


 

మరి  ఉత్తమ మార్గం లో కి పోవాలంటే ఏమి చెయ్యాలి అని మేధావి అడిగాడు.. 

 

బాబూ ముందు తల్లి తండ్రులకి సేవ చెయ్యాలి..

మానవసేవ ని మించింది లేదు.. ప్రతిఫలం మీద కోరిక లేకుండా, తిండి లేనివాడికి అన్నదానం, చదువుకునే స్తోమత లేనివారికి విద్యాదానం లాటివి చేస్తే ఉత్తమ మార్గం లో కి వెళ్లడం సాధ్యం అని చెప్పారు పూజారి గారు. 


 

మేధావి లేచి బ్యాగ్ లోంచి పూజారిగారికి ఇవ్వడానికి చాలా డబ్బు తీశాడు.. పూజారిగారు అది నాకు వద్దు. మా అబ్బాయి బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నాడు నాకు డబ్బు.పంపిస్తున్నాడు. ఈ సందు చివర రామాలయం ఉంటుంది ఆ ప్రక్కనే పాక లో పూజారిగారు వుంటారు. 

 

రామాలయ పూజారుల పరిస్థితి అంతగా బాగోలేదు. ఆయన చాలా  ఆర్ధిక ఇబ్బందులతో వున్నారు. ఆయనకి ఇమ్మని చెప్పారు. 


 

ఆయన చెప్పిన విధంగా నే ఆ సందు చివర రామాలయం ప్రక్కన ఉన్న పాకలోకి మేధావి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో  పరిస్థితి చూసి నేను చాలా పోరబాటుగా ఆలోచించాను అనుకుని వృద్ధ పూజారి గారిని కలిసి జరిగినది అంతా చెప్పి నాకు ఇంకా జ్ఞానం కావాలి అని మేధావి అడిగాడు.


ఆయనకు ఆయన ఆర్ధిక సమస్యలు అన్నీ తీరిపోయి సుఖం గా బ్రతకడానికి  సరిపోయే డబ్బు ఆయన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆతిధ్యం స్వీకరించాడు.  పూజారిగారు నా కష్టాలు చూసి రాముడే ఈయనని ఈ విధం గా పంపాడు అనుకున్నాడు.. మేధావి గారు  పూజారి గారిని  కదిలిస్తే ఆధ్యాత్మిక విషయాల మీద  చాలా  ఇన్ఫర్మేషన్ దొరికింది.


 

 

నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారిగారు.


ఒక్క రోజులో ఒక చిన్న సంభాషణ ఒక పెను మార్పు తెచ్చింది. ఇంతమంది జ్ఞానులు చుట్టూ వున్నారు వివిధ రకాలైన మాధ్యమాలద్వారా జ్ఞానం మనచుట్టూ పారుతూనే ఉంటుంది.. అయినా మన జనాలలో మార్పు ఎందుకు రాదో ఎవరికీ అర్థం కాని ప్రశ్న…..

ఇది మన పూజారుల పరిస్థితి .


నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారిగారు.

 

సత్యాన్వేషణ కోసం మేధావి కాశీ వెళ్ళిపోయాడు.. (శంకరకృప ఆధ్యాత్మిక పత్రికనుంచి సేకరణ )

కామెంట్‌లు లేవు: