*పురాణ, ఇతిహాస, ప్రాచీన గాథల అంశాలకు సామాజిక అన్వయము - లక్ష్మీ దేవి ఆరాధన*
భక్తి అనగా భగవత్ మూర్తుల ఎదురుగా ఉండి, పువ్వులతో పూజసల్పి, నైవేద్యము సమర్పించడము మాత్రమే కాదు, భగవత్ ఉనికిని అనుభవ సిద్ధము చేసుకుని, ఆ శక్తిని అర్థ యుక్తంగా అవగాహన చేసుకోవాలి. స్తోత్రాలను పఠించేటప్పుడు దైవ భక్తితో పాటు వాటిలోని కవితా సౌందర్యాన్ని గమనించాలి మరియు శబ్ద సౌష్టవం పై దృష్టి పెట్టాలి. దేవీ దేవతల స్తోత్ర మాత్రాన అభీష్టములు సిద్ధించవు. *కనకధారా* స్తోత్రము ద్వారా *లక్ష్మీ కటాక్షము* పొందడం శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారికే మాత్రమే సాధ్యమైనది. *శ్రద్ధ భక్తి సమన్వితః* అని శాస్త్ర వచనము.
లక్ష్మీ అను పదము వినగానే లక్ష్మీ దేవి సకల సంపదల ప్రదాయినిగా జనసామాన్యాలు భావించి వెంటనే *విష్ణు పత్నిమ్, ప్రసన్నాక్షిం, నారాయణ సమాశ్రితామ్*
అని స్మరిస్తారు, ఇది సర్వ సాధారణము. లక్ష్మీ పద పరిశీలన గావించుదాము. లక్ష్మీ = లక్ష్యము = విజయము = సంపద.
సంస్కృతములో *లక్ష్మీ* అన్న పదానికి మూల ధాతువు *లక్* అనగా పరిశిలించుట, ఇదే ధాతువు ను *లక్ష్యము*
అను పదములో కూడా చూస్తాము.
*లక్ష్మీ* పదముకున్న నానార్థములలో లక్ష్యము, గురి, బుద్ధి, సంపదలు, సౌభాగ్యము, విజయము, ధైర్యము మొదలగునవి.
*లక్ష్మీని* వేదాలలో *లక్ష్మాయితి లక్ష్మీ* అంటారు... *అనగా జనులను ఉద్ధరించే లక్ష్యము కలది*. పండితులు, పెద్దలు *ఆలక్ష్యము* కూడదు అని హెచ్చరిస్తారు. *ఆలక్ష్యము* అనగా *శ్రద్ద* లేనిది అని చెప్పుకునవచ్చును.
ఆ మాటకొస్తే *శ్రద్ద లేని* జీవితమే కూడదు.
పెద్దవాళ్ళు అంటూవుంటారు *పెందలకడ (ఉదయము) లేస్తే లక్ష్మీ ప్రదమని*.
ఒక్కసారి ఆలోచిద్దాము.....ఉదయమే లేవడము వలన *మనము* త్వర త్వరగా పనులు ముగించుకుని, మన *ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున వచ్చును*. *విద్యార్థులు* ఉదయమే లేచి చదువుకుంటే *అభివృద్ది చెందుట* తథ్యము, తద్వారా *ఉన్నత ఉద్యోగాల ప్రాప్తి*. ఒక యాజ్ఞికుల వారు ప్రాతః కాలంలోనే లేచి, స్నాన, సంద్యావందన పూజలు ముగించుకుని, ఇతరుల ఇళ్లలలో పూజలు, వ్రతాలు, సంప్రదాయ వ్యవహారములు చేయుట వలన ఆధ్యాత్మికముగా మరియు ఆర్థికముగా (లక్ష్మీ పరంగా) బలపడుట నిశ్చయము.
ప్రతి వ్యక్తి జీవితములో *ఒక లక్ష్యము, గమ్యము, శ్రద్ధతో* ప్రయాణించిన అదియే *లక్ష్మీ ప్రదము*. *లక్ష్యము* వైపు తీసుకుని పోయేదే *లక్ష్మీ*.
*పురాణ, ఇతిహాస ప్రాచీన గాథలను* దైనందిన జీవితములో అన్వయించుకొని జీవిత పథమును మరింత సుగమము, ఫలప్రదము చేసుకొనవచ్చును.
మనమందరము గ్రహించ వలసినదేమనగా *లక్ష్మీ* (సంపదలు, సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు) రావలెనన్న, జీవితములో *లక్ష్యము* (శ్రద్ద, గురి, గమ్యము) ఉండవలసినదే.
లక్ష్మిలలో *అష్ట లక్ష్మీల* గురించి పరిశీలిద్దాము.
1) *ఆది లక్ష్మీ* శ్రీ మహా విష్ణువును భర్తగా చేపట్టిన లక్ష్మీ.... ఆది లక్ష్మీ. అర్థము...విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు. విశ్వ వ్యాప్తంగా లక్ష్యము, ప్రయత్నము, శ్రద్ద ఎక్క డ ఉంటాయో అక్కడ లక్ష్మి (సంపదలు) ఉంటుందని చెప్పడమే ఆది లక్ష్మీ *పదమునకు* సంకేతము.
2) *ధైర్య లక్ష్మీ* జీవిత సమరములో ఆటు పోట్లను ఎదుర్కొనే ధైర్యమును కల్గి ఉండడమే ధైర్య లక్ష్మీ.
3) *ధాన్య లక్ష్మీ* సర్వ మానవాళికి ఆకలి తీర్చే శ్రమ, ప్రయత్నమే ధాన్య లక్ష్మీ.
4) *గజ లక్ష్మీ* రాజ లాంఛనాలకు, వైభోగాలకు నిలువెత్తు నిదర్శనము గజము. అంటువంటి భోగ భాగ్యాల కొరకు కృషి చేయడమే గజ లక్ష్మీ.
5) *సంతాన లక్ష్మీ* ఎన్ని సంపదలున్నా సంతానము లేకపోవడము, జీవితమే శూన్యమనిపించును. జగత్ కళ్యాణము ఉండదు. సంతాన ప్రయత్నాలే సంతాన లక్ష్మీ.
6) *విజయ లక్ష్మీ* జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలతో పోరాటమే విజయ లక్ష్మీ.
7) *విద్యా లక్ష్మీ* అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞాన మార్గాన్ని చూపించే విద్యను సంపాదించడమే విద్యా లక్ష్మీ.
8) *ధన లక్ష్మీ* "ధనం మూలమిదం జగత్" అనునది లోకోక్తి. జీవితావసారాలు తీరుటకు ధన సంపాదన ప్రక్రియనే ధన లక్ష్మి.
*లక్ష్మీ ప్రసన్నమునకు కష్టే ఫలి సూత్రమే ముఖ్యము*
పురాణాలు, శాస్త్రాలు నిర్దేశించే వ్రతాలు, నోములు, దైనందిన పూజలు నిరర్థకమా అంటే కానే కాదు.
*శాస్త్ర విహితము, సశాస్త్రీంగా చేసే ఏ కార్యమైనా లక్ష్యమును సూచించేదే* ఎటొచ్చి ఆ కార్య క్రమాలన్ని..... *శ్రద్దా భక్తి సమన్వితః మరియు మనసా వాచా కర్మణా* ప్రతిపాదికపై ఉంటేనే అనుకున్న లక్ష్యములు సాధించగలము.
*ప్రతి పూజలో ఆడంబరములు తక్కువ, ఆధ్యాత్మికత ఎక్కువ ప్రతిబింబించ వలెను*
చివరిగా....
ఋషులు, పారమార్థికులు *ఆలక్ష్మీ నాశమామ్యహం* అని భగవంతుణ్ణి కోరుతారు. అనగా తమను అశ్రద్ద, లక్ష్యము చెరనీయరాదు అని.
*అలక్ష్మీర్కే నమృతాం*
అనగా సకల దారిద్య్రములను నశింప జేయుము..... అని భగవంతుని కొరుదాము.
*కృషితో నాస్తి దుర్భిక్షం* అని కూడా విని యున్నాము.
ధన్యవాదములు.
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి