*దేవాలయాలు - పూజలు 12*
దేవాలయాలలో పూజల అనంతరం అర్చక స్వాముల వారు మనకిచ్చే పావనోదకమే /అభిషేక (మన్త్ర,తన్త్ర విగ్రహాలచే పునీతమైనవి) *తీర్థం*. తీర్థం అంటే తరింప జేసేది అని అర్థం. పాపాల ప్రవాహం నుండి జీవుడిని అవతల (అలౌకిక) గట్టుకు చేర్చేదే *తీర్థం*. సకల కల్మశ ప్రభావాలను ఉత్తరింపజేసేదే గంగ (జలము). దురితములను అంటే పాపాలను క్షయింపజేయగల గలదె *తీర్థం*. పావన గంగా జలమైనా, భగవత్ సన్నిధిలో ఇచ్చే తీర్థమైనా, భక్తి పూర్వకంగా మాత్రమే గాకుండా *అనుగ్రహపూర్వకంగా* అర్చక స్వాములిచ్చినా, ఇతర పెద్దలు, మహాభావులు ఇచ్చినా ఆ తీర్థం *మహా తీర్థమవుతుంది*.తప్పనిసరిగా భక్తులు స్వీకరించాల్సిందే. తీర్థాలు ఎన్ని రకాలో గత వ్యాసంలో తెలుసుకున్నాము.
*ప్రసాదాలు* భగవంతునికి నివేదించిన *నైవేద్యమే*, భగవంతుని దృష్టి పథాన నిల్చి దోషరహితమై నిర్మలమై దైవత్వమై పూజల అనంతరం భక్తులకు అందజేసినప్పుడు
ఆ పదార్థాలే, ఆ వంటకాలే *ప్రసాదాలుగా* పరిగణింప బడుతాయి. అమిత భక్తితో స్వీకరించే ప్రసాదాల వలన భక్తులలో పారమార్థిక ఆనందము, తన్మయము, అంతరంగ సామరస్యము, బుద్ధి ప్రకాశము కలగడమే గాకుండా *పరతత్వాన్ని దర్శింప జేసేది కూడా ప్రసాదమే*. *ప్రసాదం* భగవత్ అనుగ్రహ సంకేతం, అత్యంత పవిత్రమైన పదార్థం. *ఏ రూపంలో ఉన్నా భగవత్ నైవేద్య పదార్థాలను భక్తులు స్వీకరించినప్పుడు "ప్రసాదం" అని మాత్రమే వ్యవహరించాలి*.
ఈ మధ్య కాలంలో దేవాలయం నుండి వస్తున్న భక్తులు కొందరు *పులిహోర, కొబ్బరి* ఇస్తున్నారు అని అనడానికి అలవాటు పడ్డారు. *ఆలా అనడం కూడదు*. *పులిహోర ప్రసాదం, దద్దోజనం ప్రసాదం, పాయస ప్రసాదం, కొబ్బరి ప్రసాదం అని అనవల్సిందే*. అదే సనాతన సంప్రదాయము.
*దేవతలందరికీ ఒకే రకమైన నైవేద్యం ఆనవాయితి కాదు.*. వివిధ దేవతలకు వివిధ ప్రాంతాలలో, వివిధ సందర్భాలలో (అనగా పండుగలు, పబ్బాలు, నవరాత్రులు, ద్వాదశ ఏకాదశులు ఇతరత్రా)
వివిధ రకాల నైవేద్యాలను అర్పించడం, సమర్పించడం జరుగుతూ ఉంటుంది. *ఆ నైవేద్యములే భక్తులకు ప్రసాదముల రూపంలో భక్తులకు అందజేయబడుతాయి*.
*మాన్యులకు విజ్ఞప్తి*
*దేవాలయములు - పూజలు* అను అంశముపై ధారావాహిక వ్యాసంగము బహు సున్నితమే గాకుండా బహు విస్తృతము, క్రమానుసారము, ప్రామాణిక, సుస్థాపిత విశేషముగల విషయము కాబట్టి, ఈ గ్రూప్ లోని మాన్యులు.... ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. ఆగమ శాస్త్రాల ,పురాణేతిహాసాల మరియు శృతి , స్మృతి , ఉపనిషత్ప్రామాణికతను అందజేయగల్గుతే చదువరులకు మరింత జ్ఞానదాయకంగా ఉంటుంది.
ధన్యవాదములు.
*(సశేషము)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి