🙏వరలక్ష్మీ మాత 🙏
హరికిన్ బట్టపు దేవివి
సిరిసంపద లిచ్చు మాత ! శ్రితజనవల్లీ !
కరుణను జూడుము నిరతము
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 01
నిరుపేదగు బ్రాహ్మణికిని
సిరిసంపద లీయ దలచి శ్రీశంకరులే
కరుణకు నిను ప్రార్థించెను
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 02
హరినురమును వీడియు నీ
నరులను గాపాడ నీవు నారాయణి వై
కరవీరపురము నుంటివి
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 03
నరపతి జనకుని యింటను
ధరణిని చీల్చంగ బుట్టి దశరథసూనున్
బరిణయమాడిన సీతా!
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 04
నరపతి యాకాశ నృపతి
ధర కర్షణ చేయు వేళ దుహితగ కల్గీ
సిరివాసుని పెండ్లాడిన
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 05
కరు లిరు వైపుల నిలచియు
విరులను వెదజల్లుచుండ వేడుక తోడన్
సిరులను నిచ్చెడు తల్లీ
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 06
సుర లసురులు సుధ కొఱకును
తరియించగ కడలి బుట్టి తామర యందున్
హరి నురమున నిలచిన యో
వరలక్ష్మీ మాత ! నీకు వందనమమ్మా! 07
✍️గోపాలుని మధుసూదనరావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి