మంటపం-మండపం.
* * *
నిన్న ఒక బంధువు నాకు ఫోన్ చేసి ''పై రెండు పదాలలో ఏది సరి అయినది?''అని అడిగాడు.నేను " 'మంటపం' సంస్కృత పదం.మౌలికంగా అదే సరైనది.అయితే 'మండపం' అని కూడా
వ్యవహారంలో ఉంది. ఎక్కువగా తమిళులు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. రామేశ్వరానికి వెళ్లే రైలు మార్గంలో 'మండపం' అని ఒక స్టేషన్ కూడా ఉంది" అని చెప్పాను.
2.'మంటపం' సరి అయినది- అని నేను చెప్పడానికి ఆధారం సాధారణంగా పూజలలో 'మంటపస్థిత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యోనమః' అనీ, దేవీ స్తుతిలో 'శ్యామాం విచిత్రాం-నవరత్న శోభితాం... స్వర్ణ,మణి మయ మంటపమధ్యే' అనీ చదువుతారు కదా!-అని.
3.నాకు తెలిసినంతలో తమిళులకు కచటతప-అనే పరుషాలు,గజడదబ-అనే సరళాలు విడిగా లేవు.
సాధారణంగా పద ఆదిలో ఉన్న కకారాదులను
పరుషాలుగాను, పదమధ్యంలో ఉండే వాటిని సరళంగాను ఉచ్చరించడం వాళ్ల అలవాటు/సంప్రదాయం.
4.అందుకే చాలామంది తమిళ శాస్త్రీయ గాయకులు
త్యాగరాజ స్వామి వారి
కీర్తనలను ఆలపించేటప్పుడు
'బంటు రీతి' అనే పదాలను 'పండు రీతి' అని పలకడం వింటూ ఉంటాం.
5.దీనికి కారణం పదఆదిలో ఉన్న 'బ' (సరళం) తమిళంలో 'ప' అనే పరుషంగాను, పదమధ్యం(చివర)లో ఉన్న 'టు'(పరుషం) 'డు' అని
సరళంగాను మారడమే.
అర్థంతో నిమిత్తం లేకుండా పాడేవాళ్ళతోనే ఈ సమస్య.
6.వర్ణ ఉత్పత్తి స్థానాలను
వివరించే సంస్కృత వ్యాకరణ సూత్రం 'అ,కు,హ, విసర్జనీయానాం కణ్ఠః' అని చెప్తుంది(లఘు సిద్ధాంత కౌముదీ-సంజ్ఞాప్రకరణం-10వ
సూత్రం 'తుల్యాస్య ప్రయత్నం సవర్ణం-వివరణ.)అందుకే 'అ, య,హ'-లకు యతి మైత్రిని కూడా చెప్పారు.
7.ఈ కారణంగానే కొంతమంది తమిళ గాయకుల ఉచ్ఛారణలో 'ఎందరో మహానుభావులు..' అనే కీర్తన
'.. మగానుభావులు'(హా->గా)
అని వినిపిస్తుంది.
8.ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వంటి తమిళ మహా గాయనీమణులు,మహా గాయకులు మాత్రం తమ మాతృభాషా సంప్రదాయాన్ని పక్కనపెట్టి సంస్కృత పదాలను యథాతథంగా
ఉచ్చరిస్తారు వారికి అనేక ప్రణామాలు🙏
9.అవసరమైతే నా ఈ అవగాహనను నిస్సంకోచంగా సరిచేయాలని పెద్దలకు, మిత్రులకు విజ్ఞప్తి.
-మోతుకూరు నరహరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి