*అందమైన మనసు!*
➖➖➖✍️
ఈరోజు, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఇది చాలా కాలం క్రితంనాటి విషయం…
మా ఇల్లు నగరంలోని ప్రముఖ హాప్‌కిన్స్ ఆసుపత్రి ప్రవేశ ద్వారం ఎదురుగా, నేరుగా ఉన్న వీధిలో ఉండేది. మేం క్రింద నివసించేవాళ్ళం, పై అంతస్తులోని గదులను ఆసుపత్రిలోని రోగులకు అద్దెకు ఇచ్చేవాళ్ళం.
ఒక వేసవి సాయంత్రం నేను రాత్రి వంట చేస్తూండగా, తలుపు తట్టిన శబ్దం విని తలుపు తీయగా, ఒక అందవిహీనమైన వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు.
‘అతను నా ఎనిమిదేళ్ల కొడుకంత పొడవు లేడు,’ అని అనుకుంటూ, వంగిపోయి, క్రుంగిఉన్న అతని శరీరం వైపు చూసాను. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, అతని ముఖం ఒకప్రక్కకు వాచిపోయి, ఎర్రగా, ఇంకా పచ్చిగా ఉంది.
అతను చాలా ఆహ్లాదకరమైన తన గొంతుతో, "గుడ్ ఈవినింగ్. ఒక రాత్రికి ఉండడానికి మీవద్ద గది ఏమైనా ఉందేమో అని వచ్చాను. నేను ఈ ఉదయం తూర్పు నుండి చికిత్స కోసం వచ్చాను, మళ్ళీ ప్రొద్దున్న వరకు తిరిగి వెళ్లే బస్సు లేదు", అని చెప్పాడు.
అతను మధ్యాహ్నం నుండి గది కోసం వెతుకుతున్నానని, కాని ఎక్కడా గది దొరకలేదని చెప్పాడు. "నా ముఖం కారణంగా అని నేను అనుకుంటున్నాను. ఇది చాలా భయంకరంగా ఉందని నాకు తెలుసు, కానీ నా వైద్యుడు మరికొన్ని చికిత్సలు అవసరమని చెప్పాడు..."
నేను ఒక క్షణం సంకోచించాను, కానీ అతని తదుపరి మాటలు నన్ను ఒప్పించాయి: "నేను వరండాలోని ఈ పడకకుర్చీలో పడుకోగలను. నా బస్సు ఉదయాన్నే బయలుదేరుతుంది." అని అన్నాడు.
కానీ మేం అతనికి మంచం ఏర్పాటు చేస్తామని చెప్పాను.
నేను లోపలికి వెళ్లి భోజనం సిద్ధం చేసాను. ఆ పెద్ద మనిషిని మాతో భోజనం చేయమని ఆహ్వానించాను, "వద్దు ధన్యవాదాలు. నా దగ్గర భోజనం ఉంది", అని అతను బ్రౌన్ పేపర్ బ్యాగ్‌ని చూపించాడు. నేను వంట పూర్తి చేసి, అతనితో కాసేపు మాట్లాడటానికి వరండాలోకి వెళ్ళాను.
ఈ వృద్ధుడి చిన్న శరీరంలో విశాలమైన హృదయం నిండిఉందని తెలుసుకోడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. తన కుమార్తెను, ఆమె ఐదుగురు పిల్లలు, వెన్ను గాయంతో వికలాంగుడై నిస్సహాయుడైన ఆమె భర్తను పోషించడానికి అతను చేపలు పడతాడని, అదే అతని జీవనోపాధి అని చెప్పాడు.
ఒక ఫిర్యాదు చేస్తున్నట్లుగా కాకుండా, నిజానికి, అతను చెప్తున్న ప్రతి వాక్యంతో భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదానికి కృతఙ్ఞతలు చెప్తూ ఒక మాటను జోడించాడు.
అతనిది చర్మానికి సంబంధించిన ఒక రకమైన క్యాన్సర్, ఆ వ్యాధి ఉన్నా,దానితో పాటు ఎటువంటి నొప్పిలేనందుకు కృతజ్ఞతతో ఉన్నాడు. ముందుకు సాగేందుకు తనకు శక్తిని ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
మేం అతని కోసం పిల్లల గదిలో పడుకోవడానికి ఒకమంచం ఏర్పాటు చేసాం. పొద్దున్నే లేచి చూసేసరికి పరుపులు పద్ధతిగా మడతపెట్టి, అతను బయట వరండాలో ఉన్నాడు. అల్పాహారం నిరాకరించాడు, కానీ తన బస్సు ఎక్కడానికి బయలుదేరే ముందు, ఆగి, గొప్ప సహాయం కోరుతున్నట్లుగా, "మళ్ళీసారి చికిత్స కోసం వచ్చినప్పుడు దయచేసి నేను ఇక్కడ ఉండవచ్చా? నేను మిమ్మల్ని కొంచెం కూడా ఇబ్బందిపెట్టను, కుర్చీలోనైనా బాగానే నిద్రపోగలను" అని అన్నాడు.
ఒక క్షణం ఆగి, "మీ పిల్లలు నాకు మా ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించారు. పెద్దలు నా ముఖం చూసి భయపడతారు, కానీ పిల్లలు పట్టించుకోకపోవడం నేను గమనించాను" అన్నాడు.
అతను మళ్ళీ ఇక్కడికి రావచ్చని చెప్పాను.
తన తర్వాతి పర్యటనలో, అతను ఉదయం ఏడు గంటల తర్వాత వచ్చాడు. బహుమతిగా, ఒక పెద్ద చేపను, నేను ఇప్పటివరకు ఎన్నడూచూడని పెద్ద నత్తగుల్లలను తెచ్చాడు. అవి చక్కగా, తాజాగా ఉంటాయని, ఆ ఉదయం బయల్దేరే ముందే గుల్లలని విడదీశానని చెప్పాడు.
అతని బస్సు తెల్లవారుజామున 4:00 గంటలకు బయలుదేరిందని నాకు తెలుసు, మా కోసం వీటిని తయారుచేయడానికి అతను ఏ సమయంలో నిద్రలేచిఉంటాడా అని నేను ఆశ్చర్యపోయాను.
అతను మాతో ఉండటానికి వచ్చిన అన్ని సంవత్సరాలలో, చేపలు లేదా నత్తగుల్లలు లేదా తన తోట నుండి కూరగాయలు కానీ మాకోసం తీసుకురాని రోజు ఎప్పుడూ లేదు.
ఇతర రోజుల్లో, మాకు పోస్ట్ ద్వారా ప్యాకేజీలు వచ్చేవి, ఎల్లప్పుడూ ప్రత్యేక డెలివరీ ద్వారానే. చేపలు, గుల్లలు లేదా ప్రతీ ఆకు శుభ్రంగా కడగబడిన తాజా బచ్చలికూర లేదా పాలకూర, పెట్టెలో ప్యాక్ చేయబడి వచ్చేవి.
వీటిని మాకు పోస్ట్ లో పంపడానికి అతను మూడు మైళ్లు నడిచి ఉంటాడని తెలిసిఉండడం, అతను ఎంత బీదవాడో తెలిసిఉండడం వల్ల ఆ బహుమతులు మరింత విలువైనవిగా మారాయి.
ఈ చిన్న జ్ఞాపకాలను స్వీకరించినప్పుడు, అతను మొదటి ఉదయం ఇక్కడనుండి వెళ్ళిన తర్వాత, మా ఇంటి ఇరుగుపొరుగు చేసిన వ్యాఖ్యల గురించి నేను తరచుగా ఆలోచిస్తాను -
"నిన్న రాత్రి ఆ అనాకారమైన మనిషిని మీ ఇంట్లో ఉంచావా ?
నేను అతనిని వెళ్ళిపోమన్నాను!
అలాంటి వారిని ఇంట్లో పెట్టుకుంటే మీవద్ద ఉండడానికి మరెవ్వరూ రారు !"
బహుశా ఒకటి లేదా రెండుసార్లు మాకు అలా జరిగిఉండవచ్చు. కానీ, వారు అతనిని తెలుసుకొని ఉంటే, బహుశా వారి అనారోగ్యాలను భరించడం తేలికయ్యేది. అతనిని గురించి తెలిసినందుకు మా కుటుంబం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని నాకు తెలుసు;
*ఫిర్యాదు చేయకుండా చెడును అంగీకరించడం,
*మంచిని కృతజ్ఞతతో అంగీకరించడం ఏమిటో మేం అతని నుండి నేర్చుకున్నాం.
ఇటీవల, నేను గ్రీన్‌హౌస్ (హరితగృహం) ఉన్న స్నేహితురాలిని సందర్శించాను. ఆమె అక్కడి పువ్వులను నాకు చూపించినప్పుడు, అన్నింటికంటే చాలా అందమైన, బాగా వికసించిన ఒక బంగారు చామంతిని చూసాం. కానీ అది ఒక పాతబడిన, తుప్పు పట్టిన బకెట్‌లో పెరగడం చూసి ఆశ్చర్యపోయాను. "ఇది నా మొక్క అయిఉంటే, దానిని నా వద్ద ఉన్న అత్యంత అందమైన పాత్రలో ఉంచుతాను!" అని నేను అనుకున్నాను.
నా స్నేహితురాలు నా మనసును మార్చింది… "నా వద్ద పూలకుండీలు సరిపోలేదు, ఇది ఎంత అందంగా ఉంటుందో నాకు తెలుసు, అందుకే ఈ పాత బకెట్ లో పెరగడం పర్వాలేదనిపించింది. ఎందుకంటే నేను దానిని తీసి బయట తోటలో పాతిపెట్టగలిగేంత సమయం వరకు మాత్రమే కదా" అని ఆమె వివరించింది.
నేను మనస్ఫూర్తిగా నవ్వడం చూసి ఆమె ఆశ్చర్యపోయి ఉండవచ్చు, కానీ నేను స్వర్గంలో అలాంటి దృశ్యాన్నే ఊహించుకుంటున్నాను.
"చాలా ప్రత్యేకమైన, అందమైనవాడు ఇక్కడ ఉన్నాడు, అతను ఈ చిన్న శరీరంలో మొదలుపెట్టడం పెద్దగా పట్టించుకోడు", అని ఆ దయగల, మంచి జాలరి ఆత్మ వద్దకు వచ్చినప్పుడు భగవంతుడు చెప్పి ఉండవచ్చు.
మనం కళ్లతో చూసే వాటిని భగవంతుడు చూడడు.
మనిషి బాహ్య రూపాలను చూస్తాడు, కానీ భగవంతుని దృష్టి అంతర్లీనంగా ఉంటుంది.
*శరీరాలకు బదులుగా మన కళ్ళు ఆత్మలను మాత్రమే చూడగలిగినట్లయితే, అందం గురించిన మన నిర్వచనాలు ఎంత భిన్నంగా ఉంటాయో!
♾♾ ♾ ♾♾
మనం అంగీకరించడం, ప్రేమించడం నేర్చుకున్నప్పుడు, మన జీవితంలోని ప్రతీ అంశం అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది.
అనుభూతి : హృదయ స్వచ్ఛతకు, సరళతకు, ప్రేమకు నేను కృతజ్ఞతతో ఉంటాను.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...9440652774.
లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి