16, ఆగస్టు 2024, శుక్రవారం

వేదాంత శాస్త్ర సిద్ధాంతం*

 *వేదాంత శాస్త్ర సిద్ధాంతం* 


వేదాంత సిద్దాంతాన్ని అనుసరించే బ్రహ్మయే జగత్కారణం అని భగవత్పాదులు చెప్పిన ఈ విషయంలో ఏ విధమైన ఆక్షేపణ లేదు. జగత్తులో ప్రతివాడూ విషయాలను అనుభవిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. ఈ ఆస్వాదింపబడే విషయాలను శాస్త్రంలో భోగ్యం అంటారు. వాటిని భుజించేవాడు, ఆస్వాదించేవాడూ భోక్త కాబట్టి చేతనుడైన జీవుడే భోక్త అని, భోగ్యం అంటే శబ్ద, స్పర్శ, రసాది విషయ సమూహమనీ అంటారు. అద్వితీయమైన బ్రహ్మనే ఈ జగత్తుకు ఉపాదాన కారణంగా చెపుతున్నారు. అందువల్ల కార్యకారణాలు రెండూ ఒకటి అవుతున్నాయి. అంటే భోగ్యవస్తువులకే భోక్తృత్వం కూడా లభిస్తోంది. అంటే భోగ్యమైన అన్నం మనలను తింటోందా? లేక మనం అన్నాన్ని తింటున్నామా అన్నట్లు. 

కాబట్టి వేదాంతంలో చెప్పబడే భోక్త భోగ్యవిభాగం కుదరదుగదా అని ఆక్షేపణ. బ్రహ్మము జగత్తుకు ఉపాదాన కారణం అని అన్నట్లయితే ఈ భోక్త రూపంలోనూ భోగ్య రూపంలోనూ కనిపించే జగత్తు అంతా బ్రహ్మము కంటె భిన్నమైనదికాదు. మనం భోగ్యం అనుకునే శబ్దాది విషయాలన్నిటికీ భోక్త యొక్క రూపం కలుగుతుంది. అందువల్ల ఇక భోక్త, భోగ్యము విభాగము ఉండదు. అంటే ఈ విభాగం లోకంలో మనం చూస్తున్నట్లుగానే వుంటుంది - అని లోక దృష్టాంతాన్ని చూపి సమాధానం చెపుతున్నారు. అంటే సముద్రంలో ఉండే నురుగు, అలలు, బుడగలు అనేవి వేరుగా కనిపించినా వాటి అన్నింటికీ కారణమైనది సముద్రము ఒక్కటే. ఈ జగత్తు తనకు ఉపాదాన కారణమైన

బ్రహ్మము కంటే భిన్నము కాకపోయినా ప్రపంచంలోని రూపాలలో స్వస్వరూపాలలో భేదం కనిపించవచ్చు.

లేకపోతే లోక వ్యవహారం ఎట్లా నడుస్తుంది? ఏదో ఒక తర్కాన్ని చెప్పటం తప్పుగదా! దీనికి వేదం మాత్రమే ప్రమాణం. కార్యం అసత్యమైతే కారణం కూడా అసత్యమే అవుతుంది గదా! వేదవాక్యం ఎట్లా ప్రమాణమవుతుంది? అంటే భగవత్పాదులు ఛాందోగ్యోపనిషత్తులో ఈ విషయాన్ని చెప్పారు. కార్యకారణాలకు వుండే భిన్నత్వం కేవలం శ్రుతి ప్రమాణమే అనకుండా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా చూపించారు. కుండ పుట్టిన తరువాత కూడా అది మట్టి కంటే భిన్నం కాదు. అంటే కార్యం పుట్టిన తరువాత కూడా కారణం కంటె భిన్నం కాదు. ఈ జగత్తుకు కారణమైన బ్రహ్మతో సమానమైన అన్వయత్వం చెప్పబడ్డది. కాబట్టి కార్యకారణాలు భిన్నముకావు. కారణమైన బ్రహ్మ మూడు కాలాలలో వున్నట్లే కార్యమైన జగత్తు కూడా మూడు కాలాలలోనూ వుంది.

వేదవాక్య ప్రమాణం అని ఎట్లా చెప్పగలరు? అని కుతర్కం చేస్తే ప్రయోజనం వుందా? అంటే లోకసిద్ధమైన స్వప్న వృత్తాంతాలకు, పురాణేతిహాసములలోని స్వప్నఫలితాలకు కలిగిన ప్రమాణత్వాన్ని కూడా తెలిపి అన్వయించ వచ్చును. కాని విశ్వసించని సంశయాత్మకు ఏమి చెప్పినా యేమి ప్రయోజనము? తాతగారు చెప్పినది మనుమడు నమ్మకపోతే, ఆ సమయానికి తాతగారు గతిస్తే తాతగారే లేరని అనగలమా? *'సంశయాత్మ వినశ్యతి'* అనుకోవలసినదే.

కాబట్టి శాస్త్రార్థ విచారణ, తమ ప్రజ్ఞను ఉపయోగించి, ప్రయోజనాన్ని బలపరచి భగవత్పాదులు ప్రతిపాదించిన అథ్వైత సిద్ధాంతాన్ని, శృతి వాక్యాలను అన్వయించుకొని శాస్త్రాన్ని బాగా అర్ధం చేసుకోవాలి. 

|| हर नमः पार्वतीपतये हरहर महादेव ||                                --- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు* .

కామెంట్‌లు లేవు: