16, ఆగస్టు 2024, శుక్రవారం

శ్రీవైష్ణవ మాధ్వ ఏకాదశి

 జై శ్రీమన్నారాయణ 

16.08.2024,శుక్రవారం.



ఈరోజు వరలక్ష్మీ వ్రతం

శ్రీవైష్ణవ మాధ్వ ఏకాదశి


శ్రావణమాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి.


భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.


*సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి*


*శ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా*


కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది.

కామెంట్‌లు లేవు: