14, జనవరి 2025, మంగళవారం

తిరుమల సర్వస్వం 118-*

 *తిరుమల సర్వస్వం 118-*

*తాళ్ళపాక అన్నమాచార్యుడు 6*

ఓం నమో వేంకటేశాయ*


*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 

*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*



 ‌ *శ్రీవేంకటేశ్వరుని నిత్యకళ్యాణోత్సవం* 



 అన్నమయ్య, ఉత్సవాల్లో శ్రీవారి శోభను కర్ణపేయంగా వర్ణించడమే కాకుండా అత్యంత భక్తి ప్రపత్తులతో ఎన్నో ఉత్సవాల్లో స్వయంగా పాల్గొనేవాడు. తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి నిత్యకళ్యాణోత్సవం ప్రవేశపెట్టింది అన్నమాచార్యుడే! శ్రీవేంకటేశ్వరుడు, అన్నమాచార్యుడు స్వగోత్రీకులు. ఇద్దరిదీ భారద్వాజస గోత్రమే! అయినా కట్టుబాట్లను త్రోసిరాజని, శ్రీనివాసునికి కన్యాదానం చేసి, సాక్షాత్తు ఆ శ్రీవారిని అల్లునిగా చేసుకున్నారు అన్నమాచార్యుల వారు!


 ఆ పరంపరను కొనసాగిస్తూ నేటికీ నిత్యకళ్యాణోత్సవంలో అన్నమయ్య వంశీయులే కన్యాదాతగా వ్యవహరిస్తున్నారు. అంతే గాకుండా, ఉగాది, శ్రీరామనవమి, ఆణివార ఆస్థానాల యందు, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, పుష్పయాగం వంటి సేవలలోనూ ఈ వంశీయులు పాల్గొని ఘనంగా సత్కరించబడుతున్నారు. శ్రీనివాసునికి అన్నమయ్య మనసావాచా కర్మణః సమర్పించుకున్న సేవల ఫలితంగా, గత ఆరు శతాబ్దాలుగా వారి వంశస్థులందరూ శ్రీవారిసేవలో తడిసి ముద్దవుతున్నారు. ఈ నాటికీ వారి వారసులే సుప్రభాత సమయంలో మేలుకొలుపు మొదలుకొని ఏకాంతసేవలో జోలపాట వరకు పాడుతారు. ఆశ్రిత పక్షపాతి అయిన శ్రీవేంకటేశ్వరుని కటాక్షంతో అన్నమాచార్యుని వంశీయులందరికీ ఆచంద్రతారార్కం ఈ భాగ్యం లభిస్తూనే ఉంటుంది.



 *స్త్రీదేవతలపై కీర్తనలు* 


 శ్రీమహావిష్ణువు యొక్క వివిధ అవతారాలనే కాకుండా, స్త్రీ దేవతా మూర్తులను కూడా అన్నమయ్య స్తుతించాడు. 


ఉదాహరణకు:


‌ శుక్రవార అభిషేకం సందర్భంగా అలమేలుమంగను..


 *కంటి శుక్రవారం గడియ లేడింట* 

*అంటి అలమేల్మంగ అండనుండే స్వామి* 


 రంగనాథుని సేవలో తరిస్తున్న గోదాదేవిని -


*చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ* 

*కూడున్నది పతి చూడి కుడుత నాంచారి;* 


 పెండ్లికూతురి ముస్తాబులోనున్న సీతమ్మవారిని - 


*సిగ్గరి పెండ్లికూతుర సీతమ్మ* 

*అల్లనాడే రాఘవుడు హరివిల్లు విరిచెను*

*యెల్లి నేడే పెండ్లాడి నిదవో నిన్ను;*


అంటూ అమ్మవార్లందరినీ రాయలసీమ గ్రామీణ నుడివడి ఉట్టిపడేలా వర్ణించాడు.



 *పెనుగొండ ఆస్థానంలో అన్నమయ్య* 


 ఇలా తన సంకీర్తనా యజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న అన్నమయ్య యశస్సు నలుదిక్కులా వ్యాపించడంతో, అప్పటి పెనుగొండ ప్రభువైన నరసింహరాయలు అన్నమయ్యను సత్కరించి, రాజగురువుగా తన ఆస్థానంలో నియమించుకున్నాడు. ఆ సమయంలో అలమేలుమంగా శ్రీనివాసుల శృంగారలీలలు వర్ణిస్తూ అన్నమయ్య ఓ కీర్తనను ఆలపించాడు -


*ఏమెకొ! చిగురు టధరమున యెడనెడ కస్తూరి నిండెను* 

*భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు గదా!*


 ఈ కీర్తనను విన్న నరసింహరాయలు యుక్తాయుక్త విచక్షణను మరచి, కీర్తికండూతితో, అత్యాశతో, తనపై కూడా అలాంటి కీర్తన చెప్పమని కోరాడు. పూర్తిగా శ్రీవారి సేవకే అంకితమైన అన్నమయ్య, నారాయణుని కీర్తించిన తన నోటితో ఒక నరుని స్తుతించలేనని చెబుతూ, నరసింహరాయలు కోర్కెను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. దానికి కోపోద్రిక్తుడైన సాళువరాజు *"మూరురాయరగండ"* అనే బంగారు సంకెళ్ళతో అన్నమయ్యను బంధించి ఖైదు చేయించాడు. అన్నమయ్య ఆర్తితో వేడుకొనగా, ఆనందనిలయుని కటాక్షంతో సంకెళ్ళు కకావికలం అయ్యాయి. భటులు చెప్పిన విషయం నమ్మని రాజుగారు తానే స్వయంగా దగ్గరుండి మరోసారి సంకెళ్లు వేయించాడు. అన్నమయ్య సంకీర్తనాలాపనతో సంకెళ్లు రెండవసారి కూడా విడిపోయాయి. ఆ వింతను స్వయంగా చూసిన నరసింహరాయల అహంకారం తగ్గి అన్నమయ్యను క్షమాభిక్ష వేడుకున్నాడు. ఆ రాజు అజ్ఞానాన్ని మన్నించి, ఇకమీదట భాగవతులను అవమానించవద్దని హెచ్చరించి, రాజాస్థానం తన గమ్యం కాదని గుర్తెరిగిన అన్నమయ్య, సకుటుంబంగా తిరిగి వేంకటాచలం చేరుకున్నాడు.


 *ఇతర వాగ్గేయకారులతో అన్నమయ్య* 


 తన వృద్ధాప్యాన్ని తిరుమల క్షేత్రంలో, స్వామివారిని కీర్తిస్తూ గడుపుతున్న సమయంలో, అన్నమయ్యకు నాలుగు లక్షల యాభదివేల కీర్తనలు వ్రాసినట్లుగా చెప్పబడుతున్న పురందరదాసుతో పరిచయమేర్పడింది. ఆ భాగవతోత్తముడు అన్నమయ్యను తన గురువుగానూ, హరి అవతారంగానూ భావించి, ఇలా కీర్తించాడు -


*హరియవతార మీతడు అన్నమయ్య* 

*అరయ మా గురుడీతడు అన్నమయ్య* 

*వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య*


 పురందరదాసే కాకుండా, గొప్ప గొప్ప వాగ్గేయకారులైన త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్యలు కూడా ఇతని భక్తిప్రభావానికి లోనై, అన్నమయ్య కవితాఝరికి జేజేలు పలికారు. 


 కవితాదృష్టితో పరికిస్తే... 


‌ క్షేత్రయ్య పదాలు నృత్యానికి అనువుగా, లయబద్ధంగా గోచరిస్తాయి; 


 త్యాగరాజ కీర్తనలు సంగీత భరితంగా సవ్వడి చేస్తాయి; 


 రామదాసు పాటలు భక్తిభావాన్ని పుణికిపుచ్చు కుంటాయి; 


 జయదేవుని అష్టపదులు శృంగారభావాన్ని తొణికిస లాడిస్తాయి;

కానీ, అన్నమయ్య కీర్తనలు మాత్రం – *నృత్యం, సంగీత సాహిత్యాలు, భక్తితత్వం, శృంగార భావనల – మేళవింపై శ్రోతలను ఆనందడోలికల్లో విహరింపజేస్తాయి.*


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: