9, జులై 2023, ఆదివారం

యోగవాసిష్ఠ రత్నాకరము*

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

మూడవ అధ్యాయము 

మోక్షసాధనము

 

3-73

అతో మనోజయశ్చిన్త్యః శమసంతోషసాధనః అనన్తసమసంయోగ స్తస్మాదానన్ద ఆప్యతే. 


అందుచే అనంతపరమాత్మతో ఐక్యము నందుటకొఱకై శమ, సంతోషాది సాధనములతో గూడి మనోజయమును గూర్చి చింతింపవలెను. ఏలయనగా ఆ పరమాత్మ సాక్షాత్కారము చేతనే ఆనందము లభించును.


3-74

తిష్ఠతా గచ్ఛతా చైవ పతతా భ్రమతా తథా 

రక్షసా దానవేనాపి దేవేన పురుషేణ వా. 

3-75

మనః ప్రశమనోద్భూతం తత్ర్పాప్యం పరమం సుఖమ్‌ వికాసిశమ వుష్పస్య వివేకోచ్చతరోః ఫలమ్‌. 


కూర్చొనుచున్నను, నడచుచున్నను, పడుచున్నను, తిరుగుచున్నను, లేక రాక్షసుడై యున్నను, దేవతయై యున్నను, మనుజుడై యున్నను, కేవలము మనశ్శాన్తి చేతనే జీవునకు వికాసవంతమగు శమము (మనోజయము) అను పుష్పముచే శోభితమగు వివేకమను గొప్ప వృక్షము యొక్క ఫలమగు పరమాత్మ సుఖము సంప్రాప్తించుచున్నది. 


శ్రీ వాల్మీకీచే రచింపబడిన మోక్షోపాయమగు యోగవాసిష్ఠ రత్నాకరమున ముముక్షు ప్రకరణమందు మోక్షసాధనమను మూడవ అధ్యాయము సమాప్తము.

**

ముముక్షు ప్రకరణము 

*నాల్గవ అధ్యాయము*

*శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము*

 

శ్రీ వసిష్ఠ ఉవాచ:-

4-1‌‌

మోక్షద్వారే ద్వారపాలానిమాన్‌ శృణు యథాక్రమమ్‌ యేషామేకతమాసక్త్యా మోక్షద్వారం ప్రవిశ్యతే.


శ్రీ వసిష్ఠుడు :- ఓ రామచంద్రా! మోక్షద్వారపాలకులను గుఱించి క్రమముగ చెప్పుచున్నాను, వినుము. వీనిలో ఏయొక్కదాని నాశ్రయించినను మోక్షద్వారమున ప్రవేశింపవచ్చును.


4-2

త్రైలోక్యోదరవర్తిన్యో నానన్దాయ తథా శ్రియః సామ్రాజ్యసంపత్ప్రతిమా యథా శమవిభూతయః.


ముల్లోకములందున్న సంపదలలో నేదియుగూడ సామ్రాజ్య సంపత్తిని బోలు శమమను ఐశ్వర్యముతో సమానముగ ఆనందము నీయజాలవు.


4-3

యాని దుఃఖాని తృష్ణా దుఃసహా యే దురాధయః తత్సర్వం శాన్తచేతఃసు తమోఽ ర్కేష్కివ నశ్యతి.


ఈ ప్రపంచమున ఏయే దుఃఖములు, తృష్ట, సహించుటకు కష్ట సాధ్యములగు మానసికపీడలు కలవో; అవి యన్నియు శాంతచిత్తులకు సూర్యప్రకాశమునందు అంధకారమువలె నశించిపోవును.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము 

నాల్గవ అధ్యాయము 

శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము

 


4-4

శ్రుత్వా స్పృష్ట్వా చ దృష్ట్వా చ భుక్త్వా ఘ్రాత్వా శుభాశుభమ్‌ 

న హృష్యతి గ్లాయతి యః స శాన్త ఇతి కథ్యతే.


శుభమైనట్టిగాని, అశుభమైనట్టిగాని పదార్థములను వినినపుడు గాని, తాకినపుడుగాని, చూచినపుడుగాని, తినినపుడుగాని, వాసన చూచినపుడుగాని, ఎవడు సంతోషమునుగాని, దుఃఖమునుగాని బొందకుండునో ఆతడే శాంతుడని (శమయుక్తుడని) చెప్పబడును. 


4-5

యః సమః సర్వభూతేషు భావి కాంక్షతి నోజ్ఝతి జిత్వేన్ద్రియాణి యత్నేన 

స శాన్త ఇతి కథ్యతే. 


ఎవడు సమస్త ప్రాణులందును సమబుద్ధి కలిగియుండునో భావికాల సుఖాదులను కోరకయు, యథాప్రాప్తములగు వర్తమాన క్రియలను త్యజింపకయు నుండునో; ప్రయత్నముచే ఇంద్రియములను జయించునో, ఆతడే శాంతుడని (శమయుక్తుడని) చెప్పబడును. 


4-6

స్థితోఽ పి న స్థిత ఇవ న హృష్యతి న కుప్యతి 

యః సుషుప్తసమః స్వస్థః స శాన్త ఇతి కథ్యతే. 


హర్ష, కోపములను బొందనివాడును, సుషుప్తియందున్నవానివలె స్వస్థచిత్తుడై యుండువాడును శాంతుడని (శమయుక్తుడని) చెప్పబడును.


4-7

అప్యాపత్సు దురన్తాసు కల్పాన్తేషు మహత్స్వపి తుచ్ఛేఽ హం న మనో యస్య స శాన్త ఇతి కథ్యతే.  


భయంకరములును, దీర్హకాలికములును, కల్పాంత విపత్తుల్యములు నగు గొప్ప గొప్ప ఆపదలందును, మిథ్యాభూతములై, నశ్వరము లైనట్టి దేహాదులందెవనికి 'నేను' అను బుద్ధియుండదో; ఆతడు శాంతుడు (శమవంతుడని)అని చెప్పబడును. 


4-8

శమమమృత మహార్యమార్యగుప్తం 

పరమవలంబ్య పరం పదం ప్రయాతాః

4-9

రఘుతనయ యథా మహానుభావాః 

క్రమమనుపాలయ సిద్ధయే తమేవ.


ఓ రామచంద్రా! 'శమము' అను అమృతము ఇతరులచే అపహరింపబడుటకు శక్యము కానిది; ఉత్తములగు మనుజులు దీనిని బహుజాగ్రత్తగా రక్షించుకొనిరి; మహానుభావు లగువారు ఇట్టి శమమను ఉత్కృష్టసాధనమునే ఆశ్రయించి పరమాత్మ పదమును బొందిరి. మోక్షసిద్ధికొఱకై నీవున్ను అదియే శమమును అవలంబింపుము. 


4-10

శాస్త్రావబోధామలయా ధియా పరమపూతయా 

కర్తవ్యః కారణజ్ఞేవ విచారోఽ నిశమాత్మనః.


(విషయ; సంశయ, పూర్వపక్ష, సిద్ధాంత ప్రయోజనములను విభాగముల నెఱిఁగిన) వివేకశీలుఁడగు మనుజుడు శాస్త్రబోధ సహితమై, నిర్మలమై, పరమ పవిత్రమైనట్టి బుద్ధిచే నిరంతరము ఆత్మను గూర్చిన విచారణ సలుపవలయును.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము 

నాల్గవ అధ్యాయము 

శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము


4-11

విచారాత్తీక్షతామేత్య ధీః పశ్యతి పరం పదమ్‌ 

దీర్ఘసంసారరోగస్య విచారో హి మహౌషధమ్‌.


విచారణచే బుద్ధి తీక్షణత్వము జెంది పరమాత్మ పదమును వీక్షించును. సంసారమను దీర్ఘరోగమునకు తత్త్వవిచారణయే గొప్ప ఔషధము. 


4-12

మోహేన బన్ధునాశేషు సంకటేషు శమేషు చ 

సర్వం వ్యాప్తం మహాప్రాజ్ఞ విచారో హి సతాం గతిః. 


మహాప్రాజ్ఞుఁడవగు రామచంద్రా! బంధువినాశములందును, సంకట భయస్థానములందును, తదితర ఆపదలందును జనులకు కర్తవ్యము, దుఃఖ నివారణోపాయము ఏమియు తెలియుట లేదు. సమస్తము అజ్ఞానముచే వ్యాప్తమై యున్నది, కాబట్టి అట సత్పురుషులకు విచారణయే శరణ్యమై యున్నది. 


4-13

బలం బుద్ధిశ్చ తేజశ్చ ప్రతిపత్తిః క్రియాఫలమ్‌ ఫలంత్యేతాని సర్వాణి విచారేణైవ ధీమతామ్‌. 


విచారణవలననే బుద్ధిమంతులకు బలము, బుద్ధి, తేజస్సు, సమయోచితమగు స్పురణ, క్రియానుష్ఠానము, తత్ఫలమున్ను లభించుచుండును.


4-14

యుక్తాయుక్తమవాదీపమభివాంఛితసాధకమ్‌ 

స్ఫారం విచారమాశ్రిత్య సంసారజలధిం తరేత్‌, 


ఏది యుక్తమైనది, ఏది అయుక్తమైనది అని తెలుపుటలో గొప్ప దీపము వంటిదియు, వాంఛితార్థమును (మోక్షమును) సాధించు నదియుగు మహత్తర (తత్త్వ) విచారణ నాశ్రయించి సంసార సాగరమును దాటివేయవలెను. 


4-15

యా వివేకవికాసిన్యో మతయో మహతామివా 

న తా విపది మజ్జన్తి తుమ్బకానీవ వారిణి. 


నీటియందు ఎండుసొరకాయబుఱ్ఱ మునుగనట్లు ఈ ప్రపంచమున వివేకముచే వికసితములగు మహాత్ముల బుద్ధులు విపత్తునం దెన్నటికిని మునుంగ నేరవు (దుఃఖింపవు) 


4-16

విచారచారవో జీవా భాసయన్తో దిశో దశ 

భాన్తి భస్కరవన్నూనం భూయో భవభయాపహాః.  


తత్త్వవిచారణచే శోభించునట్టి జీనన్ముక్తులగు జీవులు తమ జ్ఞానప్రకాశముచే దశదిశలను ప్రకాశింపజేయుచు, అనేక జీవులయొక్క సంసారభయమును అంధకారమును రూపుమాపుచు నిక్కముగ సూర్యునివలెనే ప్రకాశించుచున్నారు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము 

నాల్గవ అధ్యాయము 

శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము

 

4-17

బాలస్య స్వమనోమోహకల్పితః ప్రాణహారకః

రాత్రౌ నభసీ వేతాలో విచారేణ విలీయతే.


రాత్రియందు ఆకాశమున బాలుని స్వకీయ అజ్ఞానముచే కల్పిత మైనట్టియు, భీతిద్యారా ఆ బాలుని ప్రాణమునుగూడ హరించునదియునైన బేతాళము విచారణచే విలీనమై పోవుచున్నది. (అట్లే ఈ జగత్తున్ను)


4-18

సర్వ ఏవ జగద్భావా అవిచారేణ చారవః అవిద్యమానసద్భావా విచారవిశరారవః


జగత్తునందలి పదార్థము లన్నియును విచారింపని కారణముచేతనే సత్యములుగను, రమణీయములుగను గన్పట్టుచున్నవి. విచారణ చేసిన తోడనే అవి సన్నగిల్లి మిథ్యాభూతములై యొప్పును. 


4-19

న దదాతి న చాదత్తే న చోన్నమతి శామ్యతి 

కేవలం సాక్షివత్పశ్యన్ జగదాభోగి తిష్ఠతి. 


అప్పుడు విచారణా శీలుడగు మనుజుడు ఈ విశాలజగత్తును కేవలము సాక్షివలే గనుచుండును; మనస్సును దానియందు వ్యాపింపజేయడు; దేనినీ గ్రహింపడు; భోగింపడు; శాంతుడైయుండును.


4-20

కోఽ హం కస్య చ సంసార ఇత్యాపద్యపి ధీమతా చిన్తనీయం ప్రయత్నేన సప్రతీకారమాత్మనా.


'నేనెవడను? ఈ ప్రపంచ మెచటనుండి యేతెంచినది?' ఈ ప్రకారముగ ఆపదయందును ధీమంతుడగువాడు సంసార ప్రతీకారమగు శ్రవణాద్యనుష్ఠానముతో గూడ ప్రయత్నపూర్వకముగ స్వయముగ చింతన చేయవలెను. 


4-21

పరమాత్మమయీ మాన్యా మహానన్దైకసాధినీ 

క్షణమేకం పరిత్యాజ్యా న విచారచమత్కృతిః.


పరమాత్మమయ మైనదియు, తక్కిన అన్ని విచారణలకంటెను అధికమగు ప్రతిష్ఠతో గూడినదియు, మహానందమునే సాధించునదియుగు ఆత్మతత్త్వ విచారణను ఒక్క క్షణమైనను విడువరాదు. 


4-22

విచారకాన్తమతయో వానేకేషు పునః పునః 

లుఠన్తి దుఃఖశ్వభ్రేషు జ్ఞాతాధ్యగతయో నరాః.


విచారణచే సుందరమైనట్టి బుద్ధిగలవారును, మోక్షమార్గముల నెఱింగిన వారునగు మనుజులు అనేక దుఃఖములను గోతులందు మరల మరల దొఱలకుందురు

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము 

నాల్గవ అధ్యాయము 

శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము


4-23

వరం కర్దమభేకత్వం మలకీటకతా వరమ్‌ వరమన్ధగుహాహిత్వం న నరస్యావిచారితా.


బురదయందు కప్ప అయియుండుట మేలు; మలమందు కీటకమై (పురుగై) యుండుట మేలు; అంధకారబంధురమగు గుహయందు పామై యుండుట మేలు కాని మనుజునకు తత్త్వవిచారణ లేక యుండుట మాత్రము ఉత్తమము కాదు. 


4-24

కోఽ హం కథమయం దోషః సంసారాఖ్య ఉపాగతః న్యాయేనేతి పరామర్శో విచార ఇతి కథ్యతే. 


నేనెవడను? (ఈ శరీరాదులు నేనా? లేక తద్విలక్షణుడనా?) ఈ జగత్తున దోష మెట్లేతించినది? (అధిష్టానమగు ఆత్మ యందెట్లేర్పడినది?) ఈ ప్రకారముగ శ్రుతి, గుర్వాదులు తెలిపిన రీతి పరామర్శచేయుట విచారణయని చెప్పబడుచున్నది.


4-25

విచారాజ్జాయతే తత్త్వం తత్త్వాద్విశ్రాన్తిరాత్మని 

అతో మనసి శాన్తత్వం సర్వదుఃఖపరిక్షయః. 


విచారణచే తత్త్వ మెఱుఁగబడుచున్నది. తత్త్వజ్ఞానముచే ఆత్మయందు స్థితి (విశ్రాంతి) సంభవించుచున్నది. అట్టి ఆత్మస్థితిచే మనస్సునందు శాంతియు, సర్వదుఃఖ వినాశమున్ను కలుగుచున్నవి.


4-26

సంతో షైశ్వర్యసుఖినాం చిరవిశ్రాన్తచేతనామ్‌ సామ్రాజ్యమపి శాన్తానాం జరత్తృణలవాయతే. 


సంతోషము (సంతుష్టి )అను ఐశ్వర్యముచే సుఖవంతులును, అట్టి సంతోషముచే చిరకాలము విశ్రాంతి నొందిన చిత్తము గలవారునగు శాంతపురుషులకు విశాల సామ్రాజ్యమున్ను శిథిల తృణలేశమువలె తోచును. 


4-27

సంతోషశాలినీ బుద్ధి రామ సంసారవృత్తిషు నిషమాస్వప్యనుద్విగ్నా న కదాచన హీయతే.


ఓ రామచంద్రా! సంతుష్టిచే శోభాయమానమగు బుద్ధి దారిద్ర్యవియోగాది భయంకర సంసార దశలందును సుఖము నెన్నటికిని గోల్పోదు. 


4-28

అప్రాప్తవాంఛాముత్సృజ్య సంప్రాప్తే సమతాం గతః అదృష్టఖేదాఖేదో యః స సంతుష్ట ఇహోచ్యతే.


ప్రాప్తింపని వస్తువును గూర్చిన కోరిక లేనివాడును, ప్రాప్తించిన వస్తువునందు మిథ్యాత్వమును గాంచుటచే దానియందు హర్షశోకములు లేనివాడై, ఆ వస్తువు ప్రాప్తింపనట్లే యుండువాడును, సుఖదుఃఖాది ద్వంద్వములు లేనివాడు నగు మనుజుడు సంతుష్టుఁడని చెప్పబడును.

కామెంట్‌లు లేవు: